ఇంటర్ స్పెషల్ ఫీజుల రద్దు

7 Jun, 2016 16:26 IST|Sakshi

శ్రీకాకుళం/శ్రీకాకుళం న్యూకాలనీ: సర్కారు జూనియర్ కళాశాలల్లో స్పెషల్ ఫీజులు రద్దయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియెట్ ప్రెవేశాల సమయంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వెనుకబడిన వర్గాలకు చెంది అర్హత కలిగిన విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న స్పెషల్ ఫీజులను ఈ విద్యాసంవత్సరం నుంచి పూర్తిగా రద్దుచేయాలని ఇంటర్మీడియెట్ విద్య కమిషనర్ నిర్ణయించారు.  ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. దీంతో పేద, మధ్యతరగతి విద్యార్థులకు మరింత ఊరట కలగనుంది. వివిధ గ్రూపుల విద్యార్థులకు సగటున రూ.500 నుంచి 800 వరకు ఫీజు భారం తగ్గనుంది.
 
 అక్రమాలకు తావులేదు
 ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల సమయంలో విద్యార్థుల నుంచి స్పెషల్ ఫీజులను వసూలు చేస్తుండడం ఆనవాయితీగా వస్తోంది. అయితే దీనిని అదునుగా చేసుకుని కొంతమంది ప్రిన్సిపాళ్లు నిధులు పక్కదారి పట్టించేవారు. స్పెషల్ ఫీజుల మొత్తాన్ని కళాశాల బ్యాంకు ఖాతాలకు జమ చేయవలసి ఉంది, అరుుతే, కొందరు ఈ నిధులను తమ జేబుల్లోనే వేసుకొంటున్నారని ఆరోపణలు ఉన్నాయి.
 
  ఈ విధంగా లక్షల రూపాయల నిధులను అప్పనంగా బొక్కేసేవారు. కొన్ని కళాశాలల్లో అధ్యాపకులు గుర్తించినప్పటికీ క్రమశిక్షణా చర్యలకు బాధ్యులవుతామని మిన్నికుండిపోయేవారు. జిల్లాలో 43 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా 20కుపైగా కళాశాలల్లో లక్షల్లో నిధులు తారుమారయ్యాయని గత ఏడాది అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే స్పెషల్ ఫీజులను రద్దుచేయాలనే  డిమాండ్లు కూడా రెండేళ్లుగా కమిషనర్ దృష్టికి వెళుతున్నాయి.
 
 రసీదులు అందించాల్సిందే
 ఇదిలా ఉండగా ఈ ఏడాది నుంచి విద్యార్థులు కేవలం సాధారణ ఫీజులు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఈ ఫీజుల చెల్లింపులకు సంబంధించి సంబంధిత ప్రిన్సిపాళ్లు, సిబ్బంది విధిగా రసీదులు అందించాల్సిందేనని జిల్లా అధికారులు స్పష్టంచేస్తున్నారు. స్పెషల్ ఫీజులు వసూలు చేసిన, సాధారణ ఫీజుల రసీదులు ఇవ్వకపోయినా తమకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
 
 అక్రమంగా ఫీజులు వసూలు చేస్తే చర్యలు
 కమిషనర్ ఆదేశాల మేరకు అర్హత కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల నుంచి స్పెషల్ ఫీజులు వసూలు చేయకూడదు. వసూలు చేస్తే అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.
 - రెయ్యి పున్నయ్య, డీవీఈఓ, ఇంటర్మీడియెట్ విద్య, శ్రీకాకుళం.
 
 రసీదులు అందజేయాలి
 ఫీజు వసూళ్ల మేరకు ప్రిన్సిపాళ్లు విధిగా రసీదులు అందజేయూలి. గతంతో పోలిస్తే ప్రభుత్వ కళాశాలల్లో గణనీయమైన ఫలితాలు సాధిస్తుండటం శుభసూచికం. రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలోనే అడ్మిషన్లు జరుగుతున్నాయి. ప్రిన్సిపాళ్లు చొరవ తీసుకోవాలి.
 - పాత్రుని పాపారావు, ఆర్‌ఐఓ, ఇంటర్మీడియెట్ బోర్డు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా