అమ్మలేని వాడని ఆదరించారు 

1 Jul, 2019 07:50 IST|Sakshi
పూర్వవిద్యార్థులతో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి 

ఉపవాసం ఉండి చదివిన రోజులే ఎక్కువ  

పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో భావోద్వేగానికి గురైన ప్రభుత్వ విప్‌ కాపు 

సాక్షి, గుమ్మఘట్ట: ‘చిన్నతనంలోనే అమ్మ చనిపోయింది. 1 నుంచి 5 వరకు స్వగ్రామం నాగిరెడ్డిపల్లిలో చదువు పూర్తిచేశాను. తర్వాత చదువుకెళ్లేందుకు ఆర్థిక ఇబ్బంది అడ్డుతగిలింది.  చదివింది చాలు.. పశువులు తోలుకెళ్లమని ఇంట్లో వాళ్లు ఆదేశించారు.. జొన్న సంకెటి ఓ పూట తింటే మరో పూట ఉండేదికాదు. కడు పేదరికం అనుభవించా.. గుణిగానపల్లిలో ప్రారంభమైన ప్రాథమికోన్నత పాఠశాల మూతపడకుండా ఉండటం కోసం సమీప బంధువు ఒకరు 6 వ తరగతికి అక్కడ చేర్చారు.

ఎన్నో రోజులు ఉపావాసం ఉండి చదువుకున్నా.. అమ్మలేని పిల్లోడని అందరు నాపై జాలిపడి ఆదరించేవారు. 7వ తరగతిలో ఫస్ట్‌క్లాస్‌ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించా.. 8లో మీరంతా నాకు మిత్రులు అయ్యారు.  పట్టుదల, క్రమశిక్షణే నన్ను ఇంతటిస్థాయికి చేర్చింది. మిమ్మల్ని ఇలా చూడటం చాల అదృష్టంగా భావిస్తున్నా’ అని రాష్ట్ర ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. 

40 ఏళ్ల తర్వాత... 
గుమ్మఘట్ట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం 1975 – 85 మధ్యగల హైస్కూల్‌ విద్యార్థులంతా ఆత్మీయ కలయిక సమావేశం ఏర్పాటు చేశారు. కాపు రామచంద్రారెడ్డితో పాటు వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులంతా హాజరై పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. తమ ఆత్మీయ మిత్రుడు ముచ్చటగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం గర్వించదగ్గ విషయమని మిత్రులంతా కొనియాడారు. అనంతరం పాఠశాల హెచ్‌ఎం శ్రీదేవి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ 40 ఏళ్ల తర్వాతా ఇలా అందరు కలవడం హర్షణీయమన్నారు.

ఇకపై ఈ ఆత్మీయ కలయికను ఊపిరి ఉన్నంత వరకు కొనసాగిద్దామన్నారు. అందరం కలిసి చదువుకున్న పాఠశాల అభివృద్ధికి కృషి చేద్దామన్నారు. మనలో ఏ ఒక్కరికి ఆపద వచ్చినా చేయిచేయి కలిపి ఆదుకునే ప్రయత్నం చేసినప్పుడే మన జీవితాలకు సార్థకత లభిస్తుందన్నారు. అమ్మలేని నాకు..  నియోజకవర్గ ప్రజలే అమ్మాలాంటి వారని.. వీరి ఆశీర్వాదం ఉన్నంత కాలం ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తానన్నారు.
 

ఎమ్మెల్యేను సన్మానిస్తున్న పూర్వ విద్యార్థులు  

ఇంటర్‌ కళాశాల ఏర్పాటుకు కృషి.. 
ఎంత ఉన్నత శిఖరాలకు ఎదిగినా చదువుకున్న గుమ్మఘట్ట పాఠశాలను మరిచిపోలేనని.. మిత్రులందరి విజ్ఞప్తి మేరకు గుమ్మఘట్టలో ఇంటర్‌ కళాశాలను వచ్చే విద్యాసంవత్సరం నాటికి ఏర్పాటయ్యేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే కాపు హామీ ఇచ్చారు. అందరు మన కళాశాల వైపే చూసేలా మంచి మోడల్‌గా తీర్చిదిద్దుతామన్నారు. అనంతరం ఆత్మీయ కలయికకు కారకులైన గోనబావి వడ్డే మారెప్పను మిత్రులంతా అభినందించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థునులు కాపు రామచంద్రారెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కుమార్తె స్రవంతిరెడ్డి, మిత్రులు వడ్డే మారెప్ప, క్రిష్టప్ప, సక్రప్ప, సిద్ద రామప్ప, లక్ష్మినారాయణ, ప్రకాష్, మల్లికార్జున, తిప్పేస్వామి, నాగప్ప, శ్రీనివాసులు, ధనుంజయ్యశెట్టి, అనంతరెడ్డి, నాగభూషన, రామాంజినేయులు, ఇబ్రహీమ్, విజయబాస్కర్‌ తో పాటు తదితరులు పాల్గొన్నారు. 
 
 

>
మరిన్ని వార్తలు