ఏమిటీ స్వచ్ఛంద దుబారా?

29 Dec, 2014 01:24 IST|Sakshi
ఏమిటీ స్వచ్ఛంద దుబారా?

 సీతంపేట:ఎమ్మెల్యే శివాజీ: మందస కేంద్రంగా పని చేస్తున్న స్నేహాంజలి స్వచ్ఛంద సంస్థకు ఐడబ్ల్యూఎంటీ పథకం కింద రూ.5 కోట్లు ఎలా మంజూరు చేశారు?.. కలెక్టర్ అనుమతితో పీవో మంజూరు చేశారా లేక ప్రభుత్వమే మంజూరు చేసిందా??.. నాకు తెలియాలి.కలెక్టర్: ఆ నిధులు ఎలా మంజూరయ్యాయో మాకు కూడా స్పష్టంగా తెలియదు...కలెక్టర్‌కే తెలియకుండా నిధులు మంజూరు కావడమేంటి?..అని శివాజీ నిలదీయగా మరికొందరు ఎమ్మెల్యేలు ఆయనతో గొంతు కలపడంతో ఈ అంశంపై ఆదివారం సీతంపేట పీఎంఆర్‌సీలో జరిగిన ఐటీడీఏ సర్వసభ్య సమావేశంలో వాడీవేడి చర్చ జరిగింది. స్వచ్ఛంద సంస్థలకు నిధులు మంజూరవుతున్న తీరును సభ్యులు తీవ్రంగా తప్పుపట్టారు. చేస్తున్న పనులేమీ కనిపించకపోయినా నిధులు భారీగా ఇచ్చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ సంస్థల పేరుతో ఎన్ని నిధులు మంజూరు చేశారనేది తెలియాలని పట్టుబట్టారు. దీంతో మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకొని స్వచ్ఛంద సంస్థల పనులు తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించారు. ఏ సంస్థకు ఎన్ని నిధులు మంజూరు చేశారనేది తాను పరిశీలించి గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌తో మాట్లాడతానని చెప్పారు. మంజూరైన నిధులు ఎంతవరకు ఖర్చు చేశార నేది కూడా పరిశీలిస్తామన్నారు. ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మాట్లాడుతూ చిన్నయ్య ఆదివాసీ సంఘం చేసిన కార్యక్రమాలు ఎక్కడా కనిపించడం లేదని అన్నారు.
 
 ఆ ఇద్దరిపై విచారణకు కమిటీ
 గత ఐటీడీఏ పీవోగా పనిచేసిన సునీల్‌రాజ్‌కుమార్, ఈఈ ఎంఆర్‌జీనాయుడుల హయాంలో జరిగిన అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌ను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. రవికుల బంద చెరువుకు రూ.40 లక్షలు వెచ్చించి ఏం పనులు చేశారని ఈఈ శ్రీనివాస్‌ను ప్రశ్నించారు. ఈ పనుల్లో భారీగా నిధులు దుర్వినియోగం చేశారన్నారు. గతంలో చేపట్టిన విచారణ ఏమైందని ప్రశ్నించారు. అప్పట్లో జేసీ వీరపాండ్యాన్ విచారణ ప్రారంభించినా సాంకేతిక ఇబ్బందులు తలెత్తడంతో పూర్తి చేయలేకపోయారని, దీనిపై చీఫ్ ఇంజనీర్‌కు రాశామని కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వానికి రెండు లేఖలు పంపినా స్పందన లేదన్నారు. నిధుల దుర్వినియోగంపై జిల్లా అధికారులతో విచారణ చేయించాలని, ఆర్‌ఆర్ యాక్ట్ ప్రయోగించి నిధులు రాబట్టాలని మంత్రి ఆదేశించారు.
 
 కొండ ప్రాంతాలకు నీరందించండి
 కొండలపైనున్న గ్రామాలకు సోలార్ మోటార్ల ద్వారా తాగునీటి సౌకర్యం కల్పించాలని పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కోరారు. ఒడిశాలో అమలు చేస్తున్న ఈ విధానాన్ని తాను పరిశీలించానని చెప్పారు. అధికారులు కూడా పరిశీలించాలని సూచించారు. నేలబొంతు, గొడ్డ, బందపల్లి, పెద్దమడిలలో రక్షిత పథకాలు ఏర్పాటు చేసినా ఆర్‌డబ్ల్యూఎస్, గిరిజన సంక్షేమ శాఖలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రంకిణి గ్రామంలో ఐదేళ్ల క్రితం బోర్ వేసినా పంపింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయలేదన్నారు.  అశోకం గ్రామానికి నీటి సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. సవర శివరాంపురంలో బోరు వేసినా విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని జనవరిలో సంబంధిత ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసి తాగునీటి  ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
 
 అటవీ అధికారి నిలదీత
 అటవీ ప్రాంతాల్లో నిర్మిస్తున్న రహదారులకు క్లియరెన్స్ ఇవ్వాలని ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కోరారు. ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయలు మంజూరవుతుంటే వంద మీటర్ల రోడ్డు నిర్మాణానికి మీరెందుకు అభ్యంతరం చెబుతున్నారని డీఎఫ్‌వో విజయ్‌కుమార్‌ను ఆయన నిలదీశారు. మావోయిస్టు ప్రభావిత గ్రామాల విషయంలో అభ్యంతరాలెందుకని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రశ్నించారు. హెక్టార్ వరకు పర్మిషన్ ఇవ్వొచ్చన్నారు. రోడ్ల నిర్మాణాలకు వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలని మంత్రి అచ్చెన్న కూడా సూచించారు. బూర్జ మండలం అనంతగిరి పేట వద్ద ప్రైవేటు వ్యక్తులు తుపానుకు పడిపోయిన చెట్లు నరికివేస్తున్నారని బూర్జ జెడ్‌పీటీసీ సభ్యుడు అన్నెపు రామకృష్ణ తెలిపారు. ఏనుగుల దాడిలో పంటలు పోయినవారికి పరిహారం సక్రమంగా అందడం లేదని జెడ్‌పీ కోఆప్షన్ సభ్యుడు సవరతోట ముఖలింగం ఆరోపించారు. ఒకే రైతుకు చెందిన ఎనిమిది ఎకరాల చెరుకు పంటను ఏనుగులు నష్టపరిస్తే పరిహారం ఇవ్వలేదని ఆ రైతు వలస బాట పట్టాడని ఆయన తెలిపారు. అటువంటి వారు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని డీఎఫ్‌వో కోరారు.
 
 ఉద్యానవనశాఖ ఏడీ సరెండర్
 విధుల్లో అలసత్వం వహిస్తున్న ఉద్యానవన శాఖ ఏడీ కె.శ్రీనివాస్‌ను సరెండర్ చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. దీనిపై కమిషనర్‌తో కూడా మాట్లాడతానన్నారు. జెడ్‌పీటీసీ సభ్యుడు అన్నెపు రామకృష్ణ మాట్లాడుతూ రెవెన్యూ, అటవీ శాఖల సమన్వయం లోపంతో తుపాను నష్టాల సర్వే సరిగా జరగలేదన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో అసలు సర్వే చేయలేదని కోఆప్షన్ సభ్యుడు   ముఖలింగం తెలిపారు. దీనికి మంత్రి స్పందిస్తూ స్పెషల్ కేసుగా పరిగణించి సర్వేకు చర్యలు తీసుకుంటానని హమీ ఇచ్చారు. బూర్జ  విత్తనాభివృద్ధి  క్షేత్రం ఆక్రమణలకు గురవుతోందని జెడ్‌పీటీసీ రామకృష్ణ తెలిపారు.
 
 కార్యక్రమాల వివరాలు తెలియాలి
 ఐటీడీఏ పరిధిలో జరిగే కార్యక్రమాల గూర్చి ప్రజాప్రతినిధులకు తెలియజేయాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ట్రైకార్ యూని ట్లు ఎన్ని మంజూరయ్యాయో ఎంపీపీలు, జెడ్‌పీటీసీలు, ఎమ్మెల్యేలకు తెలియజేయాలని పీవోను కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల రుణాల దరఖాస్తు గడువును సంక్రాంతి వరకు పెంచేలా ఆయా కమిషనర్లతో మాట్లాడతానన్నారు. బాలికల ఆశ్రమ పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవని సీతంపేట జెడ్‌పీటీసీ సభ్యుడు పాలక రాజ్‌కుమార్ తెలిపారు. గిరిజన నిరుద్యోగులకు ప్రత్యేక డీఎస్‌సీ కోచింగ్ ఇప్పించాలని కోరారు. పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లతోపాటు ట్యూటర్లను నియమించాలని ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు కోరారు. తుపానుకు విద్యుత్ వ్యవస్థ దెబ్బతిన్న ప్రాంతాల్లో ఇంకా పది శాతం గ్రామాలకు సరఫరా పునరుద్ధరించలేదని  విప్ రవికుమార్ చెప్పారు. సమావేశంలో ఎంపీ రామ్మోహన్‌నాయుడు, జెడ్పీ చైర్‌పర్సన్ ధనలక్ష్మి, ఎమ్మెల్సీ విశ్వప్రసాద్, ఐటీడీఏ పీవో సత్యనారాయణ, ఆర్డీవోలు దయానిధి, వెంకటేశ్వరరావు, సాల్మన్‌రాజు, ట్రైబల్ వెల్ఫేర్ ఎస్‌ఈ వీరారెడ్డి, డీఎంహెచ్‌వో శ్యామ ల, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మహలక్ష్మి, గిరిజన సంక్షేమశాఖ డీడీ సుదర్శనదొర, జెడ్పీ సీఈవో వసంతరావు, డీసీఎహ్‌వో సునీల, ఆర్‌వీఎం పీవో గణపతిరావు, వ్యవసాయశాఖ జేడీ అప్పలస్వామి, జీసీసీ డీఎం విజయ్‌కుమార్, డీఎం వో అరుణ్‌కుమార్, డిప్యూటీ డీఎంహెచ్‌వో నాయక్, వివిధ మండలాలకు చెందిన జెడ్‌పీటీసీలు, ఎంపీపీలు, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొన్నారు.  
 

>
మరిన్ని వార్తలు