మైనార్టీలు వైఎస్సార్‌సీపీతోనే

9 Sep, 2017 04:01 IST|Sakshi
మైనార్టీలు వైఎస్సార్‌సీపీతోనే
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి
 
మదనపల్లె రూరల్‌: మైనార్టీలు ఎప్పటికీ వైఎస్సార్‌సీపీతోనే ఉంటారని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం నవరత్నాల సభలో పాల్గొనేందుకు మదనపల్లెకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. మైనార్టీలు టీడీపీ వైపు ఆకర్షితులవుతున్నారన్న మాటలు అవాస్తవమన్నారు. డాక్టర్‌ వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో మైనార్టీల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. వారిని మరల్చేందుకు ప్రభుత్వం ఎన్ని కుట్రలు, ప్రలోభాలు పెట్టినా ఎప్పటికీ జరగదన్నారు. ప్రధాని మోదీ మీడియాలో చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే ఒకే దేశం–ఒకే ఎన్నికలు జరపాలన్న ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోందన్నారు.

అదే జరిగితే రానున్న ఎన్నికలు వైఎస్సార్‌సీపీకి చాలా కీలకమన్నారు. కార్యకర్తలు పన్నెండునెలలు శక్తివంచన లేకుండా పార్టీ కోసం కృషి చేయాలన్నారు. చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీల జోక్యంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఎలాంటి పథకాలకు నోచుకోకుండా, అన్యాయ మైపోయారన్నారు. వైఎస్సార్‌సీపీని నమ్ముకున్న కార్యకర్తలందరికీ అండగా ఉంటామని, జగనన్నను ముఖ్యమంత్రిగా చూడాలన్న ధ్యేయంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు.

గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి బూత్‌కమిటీలు కీలకమని, జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే బూత్‌కమిటీ సభ్యులు అపాయింట్‌మెంట్‌ లేకుండా నేరుగా కలిసే అవకాశం ఉంటుందన్నారు. బూత్‌ కమిటీ సభ్యులు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను వైఎస్సార్‌ కుటుంబంలో భాగస్వాములుగా చేసి, నవరత్నాల పథకాలు ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావాలని, నిస్వార్థంగా కష్టపడిన ప్రతి కార్యకర్తకీ గుర్తింపు ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు బాబ్‌జాన్, ఉదయ్‌కుమార్, షమీం అస్లాం, జింకావెంకటాచలపతి తదితరులు పాల్గొన్నారు.
>
మరిన్ని వార్తలు