తీవ్ర జ్వరంతో వృద్ధుడి మృతి

20 Jul, 2020 11:09 IST|Sakshi
పీపీఈ కిట్లు ధరించి మృతదేహాన్ని తరలిస్తున్న మున్సిపల్‌ అధికారులు

మృతదేహం తరలింపునకు ముందుకు రాని పారిశుద్ధ్య సిబ్బంది  

మానవత్వం ప్రదర్శించిన మున్సిపల్‌ కమిషనర్, ఉద్యోగులు

స్వయంగా తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించిన వైనం

రాయచోటి అర్బన్‌ : పట్టణంలోని ఓ వృద్ధుడు తీవ్ర జ్వరంతో బాధ పడుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. మృతదేహాన్ని తరలించేందుకు మున్సిపల్‌ పారిశుద్ధ్య సిబ్బంది ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ కమిషనర్, తన తోటి అధికారులతో కలిసి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాలలోకి వెళితే.. బీహార్‌ రాష్ట్రానికి చెందిన మహమ్మద్‌ అఫ్జల్‌ (65) మాసాపేటలోని ఒక మసీదులో మౌజన్‌గా పని చేస్తున్నాడు. వారం రోజులుగా జ్వరంతో బాధ పడుతూ స్థానిక ఆర్‌ఎంపీ వద్ద వైద్యం చేయించుకున్నాడు. శనివారం జ్వరం తీవ్రం కావడంతో ఓ విలేకరి విషయాన్ని మున్సిపల్, రెవెన్యూ అధికారులకు తెలిపారు. దీంతో మున్సిపల్‌ కమిషనర్‌ రాంబాబు, తహసీల్దార్‌ సుబ్రమణ్యంరెడ్డి మాసాపేటకు వెళ్లి వృద్ధుడిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కోవిడ్‌–19 లక్షణాలున్నట్లు వైద్యుడు అనుమానించి కడప రిమ్స్‌కు పంపాలంటూ అధికారులకు సూచించారు.

రాత్రి కావడంతో ఉదయమే కడపకు తరలి స్తామని, ప్రస్తుతం వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. వృద్ధుడిని వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోకపోవడంతో.. అతను రాత్రికి రాత్రే తిరిగి మాసాపేటలోని మసీదుకు వెళ్లిపోయాడు. ఆదివారం ఉదయం కడపకు తరలించేందుకు 108 అంబులెన్స్‌తో మున్సిపల్‌ అధికారి మల్లికార్జున మసీదు వద్దకు వెళ్లి.. వృద్ధుడికి పీపీఈ కిట్‌ అందించారు. పీపీఈ కిట్‌ ధరిస్తూ ఉండగానే కుప్పకూలిపోయాడు. వైద్యం కోసం అంబులెన్స్‌లోకి చేర్చేందుకు 108 సిబ్బంది ముందుకు రాలేదు. మున్సిపల్‌ అధికారి మల్లికార్జున స్వయంగా రంగంలోకి దిగి.. మరో యువకుడితో కలిసి ఎలాగోలా  ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.  కరోనాతో మరణించాడన్న అనుమానంతో మృతదేహాన్ని ఖననం చేసేందుకు పారిశుద్ధ్య సిబ్బంది ముందుకు రాలేదు. దీంతో కమిషనర్‌ రాంబాబు, మున్సిపల్‌ అధికారి మల్లికార్జున, సంఘ సేవకుడు మైనుద్దీన్, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పీఏ నిస్సార్‌ అహమ్మద్, మున్సిపల్‌ సిబ్బంది దర్బార్‌ మానవత్వంతో వ్యవహరించారు. పీపీఈ కిట్లు ధరించి  మృతదేహాన్ని ప్రత్యేక వాహనంలో మాసాపేట శ్మశాన వాటికకు చేర్చారు. అక్కడ కోవిడ్‌ – 19 కరోనా ప్రొటోకాల్‌ ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.

>
మరిన్ని వార్తలు