లాక్‌డౌన్ పొడిగింపుపై కేంద్రానిదే తుది నిర్ణ‌యం

7 Apr, 2020 16:14 IST|Sakshi

సాక్షి, విజయనగరం: జిల్లా నుంచి 104 సాంపుల్స్ క‌రోనా టెస్టింగ్‌కు పంపించ‌గా, ఇప్ప‌టివ‌ర‌కు అన్ని రిపోర్టులు నెగెటివ్‌గానే వ‌చ్చాయ‌ని రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు. కేంద్రం ఆదేశాల ప్ర‌కారం విదేశాల నుంచి వచ్చిన‌వారితోపాటు, ఢిల్లీ వెళ్లి వ‌చ్చిన‌వారి నుంచి న‌మూనాల‌ను తీసి పంపించామ‌ని తెలిపారు. మంగ‌ళ‌వారం ఆయ‌న విజ‌య‌న‌గ‌రం జిల్లా కలెక్టరేట్‌లో కరోనా నియంత్రణపై అధికారులతో సమీక్ష నిర్వ‌హించారు. అనంత‌రం మంత్రి మాట్లాడుతూ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ద్వారా.. క్వారంటైన్ ఉన్నవారి ప్రతీ ఇంటినీ నిత్యం మానిటర్ చేస్తున్నామ‌ని తెలిపారు. ఎవ‌రికైనా అనారోగ్యంగా ఉంటే వెంటనే గుర్తించి ఆస్పత్రికి తరలిస్తున్నామ‌ని పేర్కొన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్ని సిద్ధం చేశామ‌ని స్ప‌ష్టం చేశారు. ప్రభుత్వ సూచనలను ప్రజలంతా తూచా తప్పకుండా పాటించాలని కోరారు. (కరోనా రాకుండా.. స్టీమ్‌ బూత్‌)

అవసరమైతే.. ఆర్టీసీ బస్టాండ్ల‌లో మార్కెట్లు
"జిల్లాలో ఉన్న రైతు బజార్‌ల‌ను వికేంద్రీకరణ చేశాం. అవసరమైతే ఆర్టీసీ బస్టాండ్ల‌లో మార్కెట్లు ఏర్పాట్లు చేయాలని ఆలోచిస్తున్నాం. నిత్యావసర సరుకుల రేట్లు పెంచితే కఠిన చర్యలు త‌ప్ప‌వు. ప్రభుత్వ సాయం అందని వారు సచివాలయంలో పేరు నమోదు చేసుకోండి. లాక్‌డౌన్‌ వల్ల ఇతర జిల్లాల్లో చిక్కుకున్న వారందరికీ ప్రత్యేక షెల్టర్స్‌ను ఏర్పాటు చేశాం. ఎవరూ ఆందోళన చెందవద్దు. ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను ప్రతీ ఒక్కరికి అందేలా చేయడమే మా లక్ష్యం. ఇలాంటి విపత్కర సమయంలో రాజకీయాలు సరికాదు. మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ను పాటించాలి. ఆ త‌ర్వాత‌ లాక్‌డౌన్‌ పొడిగింపుపై కేంద్రానిదే తుది నిర్ణయం" అని బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ పేర్కొన్నారు. (ఆంధ్ర విద్యార్థులకు ఉపశమనం)

మరిన్ని వార్తలు