రాష్ట్రంలో నయవంచక పాలన

8 Jun, 2015 02:58 IST|Sakshi
రాష్ట్రంలో నయవంచక పాలన

 - పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి

 కడప అగ్రికల్చర్ : రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా నయవంచక, రాక్షసపాలన కొనసాగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం కడప నగరంలోని ఇందిరాభవన్‌లో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పా ల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏడాది పాలన పూర్తి చేసుకున్నా విభజన చట్టంలో రూపొందించిన ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదాలు అమలు చేయడం లో విఫలమయ్యాయని దుయ్యబట్టారు. ప్రజల కు ఇచ్చిన హామీలలో కనీసం ఏ ఒక్కటి కూడా నెరవేర్చిన పాపాన పోలేదన్నారు.

హామీలు ఎందుకు నెరవేర్చలేదో సమాధానం చెప్పుకోలేని స్థితిలో సీఎం చంద్రబాబు, ఆయన మంత్రివర్గం, ఆ పార్టీ నాయకులు ఉన్నారన్నారు. ఉత్తరకోస్తా, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, ఈ ప్రాంతాలు చాలా వెనుకబడి ఉన్నాయని విభజన చట్టంలో పేర్కొన్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా వేధిస్తోందన్నారు. అందుకు తాము ఏమాత్రం తీసిపోమంటూ రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం కూడా అదేబాటలో పయనిస్తోందని ధ్వజమెత్తారు.

అన్ని సమస్యలు పరిష్కారం కావాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమన్నారు. 13 జిల్లాల్లోని ప్రజలు విభజన చట్టంలోని అంశాలను హక్కుగా పొందేలా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాయలసీమ జిల్లాలకు నీరు రావాలంటే హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ ప్రాజెక్టులు పూర్తి అయి దాని కింద ఉన్న ఉప కాలువలు నిర్మిస్తేనే సాగునీరు, తాగునీరు సాధ్యమవుతుందన్నారు.

శాసనమండలి ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య మాట్లాడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తితో రాష్ట్రంలో పాలన జరగడం లేదన్నారు. ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఉన్నాయనే సంగతిని రాష్ట్ర ముఖ్యమం త్రి మరిచిపోయారని, సొంత నిర్ణయాలు తీసుకోవడం అంతా తానే అనే విధంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యంలో పనికి రాదన్నారు. రాజధాని నిర్మాణం మీ సొంత పార్టీ కార్యాలయ నిర్మాణమా? లేక మీ సొంత ఇంటి నిర్మాణమా? అని ప్రశ్నించారు.

మాజీమంత్రి సాకే శైలజానాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలను ముఖ్యమంత్రి  సమ దృష్టితో చూడడం లేదన్నారు. రాజధాని నిర్మాణం కోసం కొట్టిన కొబ్బరికాయ రాయలసీమ ప్రజల గుండెలమీద కొట్టినట్లు ఉందన్నారు. ఎందుకంటే రాజధాని నిర్మాణానికి రాయలసీమలోని ఏ జిల్లా పనికి రా దో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్నారు. తుళ్లూరులోకి రహదారి కాదుకదా సైకిల్ వెళ్లడానికి కూడా దారి లేదని, అలాంటి ప్రాంతంలో రియల్ ఎస్టేట్, కార్పొరేట్ వ్యాపారుల కోసమే రాజధాని నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించారు.

అనంతపురంలో ఎయిమ్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి తీసుకెళ్లి గుంటూరులో పెడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సదస్సులో మాజీమంత్రి అహ్మదుల్లా, కేంద్ర మాజీమంత్రి సాయిప్రతాప్, ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు, పీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్.తులసిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నజీర్ అహ్మ ద్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి నీలి శ్రీనివాసరావు మాట్లాడారు.

మరిన్ని వార్తలు