పుష్కర విధులకు 60వేల మంది

7 Jul, 2016 00:42 IST|Sakshi

72 గంటలు ముందుగానే విధుల్లో చేరనున్న ఉద్యోగులు
వారికి ‘అక్షయ పాత్ర’ భోజనం
విద్యాసంస్థల భవనాల్లో సిబ్బందికి వసతి
12 రోజులపాటు ప్రత్యేక కాల్ సెంటర్లు

 

కృష్ణా పుష్కరాల నిర్వహణకు ప్రణాళిక సిద్ధమైంది. పోలీసులు సహా అన్ని శాఖల ఉద్యోగులు 60 వేల మంది పుష్కర విధుల్లో పాలుపంచుకోనున్నారు. ఆయా శాఖల వారీగా ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక జాకెట్లు సిద్ధం చేస్తున్నారు. పుష్కరాలు జరిగే 12 రోజులు పనిచేసేలా ప్రత్యేక కాల్‌సెంటర్లను ఏర్పాటుచేయనున్నారు. కలెక్టర్ బాబు.ఎ అధ్యక్షతన బుధవారం జరిగిన జిల్లా అధికారుల సమావేశంలో ఈ మేరకు కార్యాచరణ రూపొందించారు.

 

విజయవాడ : వచ్చేనెల 12వ తేదీ నుంచి 24వ తేదీ వరకూ జరగనున్న కృష్ణా పుష్కరాల నిర్వహణకు చేపట్టాల్సిన కార్యాచరణపై జిల్లా యంత్రాంగం వ్యూహం సిద్ధం చేసింది. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి అధికార యంత్రాగంతో కలెక్టర్ బాబు.ఎ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పుష్కరాలను విజయవంతం చేసేం దుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. పుష్కర విధులకు వచ్చే పోలీసులు, సాధారణ ఉద్యోగులు, వారికి కల్పించే వసతికి సంబంధించి కార్యాచరణపైనా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ పోలీసులు, సాధారణ ఉద్యోగులకు పుష్కర నగర్‌లకు 500 మీటర్లలోపు వసతి ఏర్పాట్లు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పుష్కరఘాట్, పుష్కర నగర్‌కు సమీపంలో ఉన్న ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థల భవనాల జాబితాలు తక్షణమే ఇవ్వాలని జిల్లా విద్యాశాఖాధికారిని కలెక్టర్ ఆదేశించారు. ఆయా శాఖాధిపతులు తమ శాఖల నుంచి పుష్కర విధులకు కేటాయిస్తున్న ఉద్యోగుల వసతిపై రెండురోజుల్లో  వేదిక ఇవ్వాలని కోరారు.

 
మూడు రోజులు ముందుగానే విధులకు
పుష్కరాల ప్రారంభానికి 72 గంటల ముందుగానే ఉద్యోగులు కేటాయించిన ప్రదేశంలో విధులకు హాజరై అక్కడి వాతావరణానికి అలవాటు పడాలని కలెక్టర్ సూచించారు. ఘాట్ల వారీగా బందోబస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పుష్కర విధులు నిర్వహించే ఆయా శాఖల ఉద్యోగులను సులభంగా గుర్తించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన జాకెట్‌లను అందజేస్తామన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు ఆకుపచ్చరంగు, పారా మెడికల్ సిబ్బందికి కాషాయం రంగు జాకెట్లను ఇచ్చేందుకు నిర్ణయించామన్నారు.

 
85 శాతం మంది భక్తుల స్నానాలు ఇక్కడే..

సుమారు ఆరు కిలోమీటర్ల పరిధిలో ఉన్న పద్మావతి, కృష్ణవేణి, దుర్గ, పున్నమి ఘాట్లు, పవిత్రసంగమం వద్ద 85 శాతం మంది యాత్రీకులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారని అధికారులు అంచనావేశారు. ఈ ప్రాంతాల్లో యాత్రికులకు అసౌకర్యం కలగకుండా సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు.

 
3 చోట్ల అక్షయపాత్ర వంటశాలలు

పుష్కర విధుల్లో పాల్గొనే 60 వేల మంది ఉద్యోగులకు అక్షయపాత్ర సంస్థ ద్వారా భోజన సదుపాయం కల్పించేందుకు నిర్ణయించామని కలెక్టర్ చెప్పారు. ఆయా శాఖలు సిబ్బంది భోజన వసతి కోసం ఇచ్చే నిధులను అక్షయపాత్ర సంస్థకు కేటాయించాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు. విజయాడలో మూడు ప్రాంతాల్లో అక్షయపాత్ర సంస్థ వంట శాలలు ఏర్పాటు చేసి ఐదు లక్షల మందికి ఆహారం అందించేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. ఉద్యోగులు పుష్కర విధులు నిర్వహించే చోటే ఆహారాన్ని పంపిణీ చేస్తామని కలెక్టర్ చెప్పారు.

 
పుష్కర కాల్‌సెంటర్లు

పుష్కరాల కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. పుష్కర సమాచారం, వివిధ హోదాల్లో ఉన్న ముఖ్యుల (వీఐపీ) పర్యటనలను ముందుగానే తెలుసుకుని, సాధారణ యాత్రికులకు అసౌకర్యం కలగకుండా, ముఖ్యులకు ఏర్పాట్లు చేసేందుకు వీలుగా ఇవి పనిచేస్తాయని చెప్పారు. 10 మంది ఉద్యోగులు నిరంతరం ఈ కాల్ సెంటర్లలో విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, జిల్లా అధికారులు పలువురు పాల్గొన్నారు.

 

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega