రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలి

15 Mar, 2015 03:14 IST|Sakshi

 శ్రీకాకుళం అర్బన్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కల్పించాలని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కోరారు. ఇదే డిమాండ్‌తో ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకూ రిలే నిరాహారదీక్షలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. శ్రీకాకుళంలోని ఇందిరావిజ్ఞాన భవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కల్పించాలని కోరుతూ విభజన చట్టంలో తీర్మాణం చేసినట్టు పేర్కొన్నారు. ఇందుకు అప్పటి ప్రతిపక్ష పార్టీ నేత వెంకయ్యనాయుడు అంగీకరించారన్నారు. ఇపుడు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు.
 
 ఏపీకి ప్రత్యేకహోదా కల్పించాలని కోరుతూ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి నేతృత్వంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అలాగే ప్రధాని మోడీని, ఇతర పార్టీల ప్రతినిధులను కలసి ప్రత్యేకహోదా కోసం మద్దతివ్వాలని మాట్లాడడం జరిగిందన్నారు. కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు చేపట్టనున్నామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో రోజుకు రెండు నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్రియాశీల సభ్యులు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. సామాజిక బాధ్యతతో సత్వర అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ కాంక్షిస్తుందన్నారు.
 
 రాజకీయాలకు అతీతంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ మాట్లాడుతూ ఏపీ విభజన సమయంలో అన్ని పార్టీలూ ఏవిధంగా అయితే సహాయ పడ్డాయో ఇపుడు ప్రత్యేక హోదా కల్పన కోసం అలాగే కృషిచేయాలన్నారు. డీసీసీ అధ్యక్షుడు డోల జగన్‌మోహనరావు మాట్లాడుతూ సోమవారం నుంచి రిలేనిరాహారదీక్షలు చేపడతామన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కిల్లి రామ్మోహన్‌రావు, చౌదరి సతీష్, రత్నాల నరసింహమూర్తి, పైడి రవి, గంజి ఎజ్రా, ఎం.ఎ.బేగ్, చొంగ రమాదేవి, పుట్టా అంజనీకుమార్, లండ శ్రీను పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు