ఏయ్.. ఇది టీడీపీ ప్రభుత్వం

9 Oct, 2014 03:02 IST|Sakshi
ఏయ్.. ఇది టీడీపీ ప్రభుత్వం

బద్వేలు:
 ‘ఏయ్ ఇది ఎవరి ప్రభుత్వం... టీడీపీ ప్రభుత్వంలో పని చేస్తూ మేం చెప్పినట్లు వినరా... మీరు తగిన ఫలితం అనుభవిస్తారు’... అని బద్వేలు టీడీపీ నేత విజయజ్యోతి అధికారులపై మండిపడ్డారు. బుధవారం పోరుమామిళ్ల మండలం రంగసముద్రం పంచాయతీలో జన్మభూమి-మాఊరు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి, ఎటువంటి ఆహ్వానం లేకుండానే టీడీపీ నేత విజయజ్వోతి హాజరయ్యారు. అనంతరం తాను మాట్లాడతానంటూ మైక్ ఇవ్వాలని కోరారు.

దీనికి మండలాధ్యక్షుడు చిత్తా విజయప్రతాప్‌రెడ్డి అభ్యంతరం తెలిపారు. ఆమెను ఏ హోదాలో మాట్లాడిస్తారు.. ఇదేమీ పార్టీ కార్యక్రమం కాదు.. ప్రభుత్వ కార్యక్రమం కదా అంటూ ఆయన అధికారులను ప్రశ్నించారు. దీంతో అధికారులు ఆమెకు అవకాశమ్విలేదు. ఇదే సమయంలో జిల్లాలోని ఉన్నతాధికారులతో అధికారులకు ఫోన్ చేయించి ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో ఆమె మరింత అసహనానికి గురయ్యారు. తాను ప్రజల తరుఫున మాట్లాతానని పట్టుబట్టడంతో  ప్రజలకు మధ్యాహ్నం అవకాశమిస్తామని అప్పటి వరకు ఆగాలన్నారు.

దీంతో టీడీపీ నేతలు ఆమెకు మాట్లాడే అవకాశమివ్వాలని కోరుతూ మైక్ అందజేశారు. దీంతో అధికారుల తీరును నిరసిస్తూ చిత్తా విజయప్రతాప్, వైఎస్సార్‌సీపీ నాయకులు చిత్తా రవి, రమణ ఆందోళనకు దిగారు ఇదే సమయంలో కొందరు టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడికి ప్రయత్నించడంతో పాటు తీవ్ర పదజాలంతో దూషించారు. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరగడం విశేషం.

ఈ దశలో సీఐ వెంకటకుమార్, ఎస్‌ఐలు కృష్ణంరాజు నాయక్, హరిప్రసాద్ గొడవను సద్దుమణిగేలా చూశారు. పింఛన్ల పంపిణీ పూర్తయ్యాక విజయజ్యోతి ఎంపీడీఓ నారాయణరెడ్డి, నోడల్ అధికారి కృష్ణమూర్తి వద్దకు వెళ్లి  ‘మీరు మా ప్రభుత్వంలో పని చేస్తున్నారనే విషయాన్ని గుర్తు పెట్టుకోండంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీని పరవ్యవసానం మీరు అనుభవించాల్సి వస్తుందని వారిపై మండిపడటంతో కార్యక్రమానికి వచ్చిన పలువురు అధికారులు, ప్రజలు అవాక్కయ్యారు.

మరిన్ని వార్తలు