‘కరోనా అంత ప్రమాదకరమేం కాదు.. ఉదాహరణ నేనే’

3 Apr, 2020 11:06 IST|Sakshi
జిల్లా కలెక్టర్‌, ఎస్పీ సమక్షంలో యువకుడి డిశ్చార్జ్‌

సాక్షి, కాకినాడ: కరోనా బారినపడ్డ రాజమండ్రి యువకుడొకరు చికిత్స అనంతరం కోలుకున్నాడు. లండన్‌ నుంచి వచ్చిన అతడికి మార్చి 22న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అతడిని కాకినాడ జీజీహెచ్‌లోని ఐసోలేషన్‌ వార్డులో చేర్పించి చికిత్స అందించారు. రెండు వారాల ట్రీట్‌మెంట్‌ తర్వాత అతని పరిస్థితి మెరుగైంది. రెండు సార్లు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ ఫలితాలు వచ్చాయి. జిల్లా కలెక్టర్‌ సమక్షంలో సదరు యువకుడిని నేడు డిశ్చార్జ్‌ చేశారు. కాగా, జిల్లా వ్యాప్తంగా తొమ్మిది కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 28 మందికి రిపోర్టులు రావాల్సి ఉంది. ఇక జిల్లా వ్యాప్తంగా చెక్‌పోస్టుల వద్ద కట్టుదిట్టమైన నిఘా కొనసాగుతోంది. ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ గత అర్ధరాత్రి పలు చెక్‌పోస్టులు పరిశీలించారు.
(చదవండి: పాజిటివ్ కేసులన్నీ ఢిల్లీ వెళ్లి వచ్చిన వాళ్లే)

డిశ్చార్జ్‌ అయిన యువకుడి కామెంట్లు..
నేను విమానంలో లండన్ నుంచి దుబాయ్, అక్కడ నుంచి హైదరాబాద్‌ మీదుగా రాజమండ్రికి వచ్చాను. నాతో పాటు ప్రయాణించిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. నేను వెంటనే అప్రమత్తమై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సంప్రదించాను. వారు నన్ను కాకినాడ జీజీహెచ్‌లో కరోనా ఐసోలేషన్ వార్డులో జాయిన్ చేశారు. నాకూ కరోనా పాజిటివ్ అని రిపోర్టు రావడంతో కొంత టెన్షన్ పడ్డాను. లండన్ నుంచి వచ్చిన తర్వాత బయట ఎక్కడా తిరగలేదు. నా కుటుంబ సభ్యులను కూడా హాస్పిటల్ క్వారంటైన్‌కు తరలించి టెస్టు చేసారు. వారికి నెగెటివ్ వచ్చింది. 

ఇక్కడి వైద్యులు నాకు భరోసా ఇచ్చి ట్రీట్‌మెంట్‌ అందించారు. ప్రతీ రోజూ ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా మందులు ఇస్తూ టెస్టులు చేసేవారు. రెండు సార్లు కరోనా నెగెటివ్ రావడంతో ఈ రోజు డిశ్చార్జ్‌ చేసారు. జీజీహెచ్‌ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది చాలా బాగా పనిచేశారు. వారి కృషితోనే నేను కరోనా నుంచి బయట పడ్డాను. సోషల్ మీడియాలో వస్తున్నంతగా కోవిడ్‌-19 ప్రమాదకరం కాదు. వైద్యుల సూచనలు పాటిస్తే కరోనా నయం అవుతుంది. దానికి నేనే ఉదాహరణ. కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారు వెంటనే ఆసుపత్రిలో స్వచ్ఛందంగా చేరాలి.
(చదవండి: తబ్లిగీ జమాత్‌: 13,702 మంది..)

మరిన్ని వార్తలు