జెడ్పీటీసీ సభ్యురాలి ఆందోళన

10 Oct, 2017 06:57 IST|Sakshi
ఎంపీడీఓ కార్యాలయం ఎదుట బైఠాయించిన జెడ్పీటీసీ సభ్యురాలు నాగజ్యోతి

ఎంపీడీఓ కార్యాలయం ఎదుట బైఠాయింపు

అధికారుల తీరుపై ఆగ్రహం  

ఒంగోలు, కారంచేడు: అధికారుల తీరుపై అధికార పార్టీ జెడ్పీటీసీ సభ్యురాలు నాగజ్యోతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులంటే ఎందుకంత చులకనంటూ ప్రశ్నించారు. సోమవారం మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో ఎంపీడీఓ ఎన్‌.ఉమ, హౌసింగ్‌ ఏఈ రాజశేఖర్‌ల తీరు బాగాలేదంటూ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట సమావేశం అనంతరం ఆమె బైఠాయించారు. అనంతరం జెడ్సీటీసీ సభ్యురాలు విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు ప్రక్రియలో భాగంగా లబ్ధిదారుల ఎంపికకు తనకు సమాచారం ఇవ్వలేదని అధికారులపై మండిపడ్డారు.

కనీసం లబ్ధిదారుల జాబితా ఇవ్వాలని కోరినా ఎంపీడీఓ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రాత్రి పొద్దుపోయే వరకూ జెడ్పీటీసీ సభ్యురాలు నాగజ్యోతి కార్యాలయం గేటు వద్ద బైఠాయించడంతో లోపల ఉన్న అధికారులు బయటకు వెళ్లలేకపోయారు. రాత్రి 10.30 గంటలకు పోలీసులు వచ్చి జెడ్పీటీసీతో చర్చించినా ఆమె పట్టు వీడలేదు. ఈ లోపు ఎంపీడీఓ నీరసించి పడిపోవడంతో పోలీసులు ఆమెను బయటకు పంపించారు. దీనిపై ఎంపీడీఓ ఎన్‌.ఉమను వివరణ కోరగా మండలంలో జరిగే ప్రతి కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు జెడ్పీటీసీ సభ్యురాలికి ఎప్పటికప్పుడు అందిస్తున్నామని చెప్పారు.

మరిన్ని వార్తలు