షెల్‌ కంపెనీలపై కొరడా..

13 Sep, 2017 01:18 IST|Sakshi
షెల్‌ కంపెనీలపై కొరడా..

లక్ష మంది డైరెక్టర్లపై అనర్హత వేటు!!
న్యూఢిల్లీ:
నల్లధనంపై పోరులో భాగంగా డొల్ల కంపెనీలు నిర్వహిస్తున్న వారిపై మరిన్ని కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. షెల్‌ కంపెనీలతో సంబంధమున్న దాదాపు 1.06 లక్షల మంది పైగా డైరెక్టర్లపై అనర్హత వేటు పడనుంది. సెప్టెంబర్‌ 12 నాటికి కంపెనీల చట్టంలోని సెక్షన్‌ 164 కింద అనర్హత వేటు వేయతగిన డైరెక్టర్లుగా 1,06,578 మందిని గుర్తించినట్లు, వీరిపై ఆమేరకు చర్యలు తీసుకోనున్నట్లు కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. 

ఈ సెక్షన్‌ ప్రకారం వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాలు వార్షిక నివేదికలు సమర్పించని కంపెనీల్లోని డైరెక్టర్లు ఐదేళ్ల పాటు అదే కంపెనీలో పునర్నియామకానికి గాని లేదా ఇతర కంపెనీల్లో గానీ డైరెక్టర్‌ బాధ్యతలు చేపట్టడానికి గానీ అర్హత కోల్పోతారు. ఈ నెలాఖరు నాటికల్లా షెల్‌ కంపెనీలతో సంబంధమున్న డైరెక్టర్ల పూర్తి వివరాలతో జాబితా సిద్ధం కాగలదని కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పీపీ చౌదరి చెప్పారు.

చాన్నాళ్లుగా వ్యాపార కార్యకలాపాలు జరగని 2.09 లక్షల కంపెనీల రిజిస్ట్రేషన్‌ను కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ ఇటీవలే రద్దు చేసిన దరిమిలా తాజా ప్రతిపాదిత చర్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ కంపెనీల ఏర్పాటు పరమావధి, డైరెక్టర్లు, లబ్ధిదారుల నిగ్గు తేల్చే దిశగా ఆయా సంస్థల డేటాను కూడా కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ పరిశీలిస్తోన్నట్లు ప్రభుత్వం ప్రకటనలో వివరించింది.

ఈ సంస్థల ఆధ్వర్యంలో మనీల్యాండరింగ్‌ కార్యకలాపాల్లాంటివి ఏమైనా జరిగాయా అన్న కోణంపై కూడా దృష్టి పెట్టినట్లు పేర్కొంది. సదరు డిఫాల్ట్‌ కంపెనీలతో సంబంధమున్న వృత్తి నిపుణులు, చార్టర్డ్‌ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీలు, కాస్ట్‌ అకౌంటెంట్లు మొదలైన వారిని ఇప్పటికే గుర్తించడం జరిగింది. వారిపై ఐసీఏఐ, ఐసీఎస్‌ఐ తదితర వృత్తి నిపుణుల సంస్థలు తీసుకున్న చర్యలు కూడా పరిశీలనలో ఉన్నాయి. 2.09 లక్షల సంస్థల రిజిస్ట్రేషన్‌ రద్దు అయిన తర్వాత ప్రస్తుతం 11 లక్షల కంపెనీలు క్రియాశీలకంగా ఉన్నాయి.

మరిన్ని వార్తలు