ఔషధ దిగ్గజానికి కరోనా సెగ: ప్లాంట్‌ మూత

15 Jul, 2020 08:47 IST|Sakshi

సాక్షి, గాంధీనగర్‌: ప్రముఖ ఔషధ తయారీ సంస్థ లుపిన్‌కు కరోనా మహమ్మారి సెగ తాకింది. గుజరాత్, అంకలేశ్వర్‌లోని సంస్థకు చెందిన తయారీ ప్లాంట్‌లో సిబ్బందికి కోవిడ్‌-19 పాజిటివ్‌ రావడంతో ప్లాంట్‌ను తాత్కాలికంగా మూసివేసింది.  (కరోనాపై పోరులో మహిళా అధికారి కన్నుమూత)

దేశీయ టాప్‌ అయిదు సంస్థల్లో ఒకటైన లుపిన్‌ మందుల తయారీ కర్మాగారంలో 18మంది ఉద్యోగులకు కరోనా సోకింది. దీంతో తన ప్లాంట్‌ను మూసివేయాల్సి వచ్చింది. అయితే  మిగిలిన ప్లాంట్లలోని ఉద్యోగులు కరోనాకు ప్రభావితం కాలేదని ప్రభుత్వ సీనియర్‌ అధికారి ఎండీ మోడియా  వెల్లడించారు. ఉద్యోగులకు  కరోనా పాజిటివ్‌ ధృవీకరించిన తరువాత జూలై 12న ప్లాంట్ మూసివేసామని చెప్పారు. శానిటైజేషన్‌, ఐసోలేషన్‌ తదితర ప్రక్రియలను నిబంధనల ప్రకారం పాటిస్తున్నామని మోడియా తెలిపారు. 

బాధితులు వైద్య సంరక్షణలో ఉన్నారనీ, కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రోటోకాల్‌ పాటిస్తున్నామని లుపిన్‌ ప్రతినిధి తెలిపారు. అంకలేశ్వర్‌లో 40 ఎకరాలలో 11 తయారీ కర్మాగారాలను లుపిన్‌ కలిగి ఉంది. కాగా దేశంలో  మంగళవారం నాటికి 906,752 కేసులు నమోదయ్యాయి. మరణించినవారి సంఖ్య  23,727కు చేరింది.

మరిన్ని వార్తలు