మరో 3 నెలలు... వాయిదా!

23 May, 2020 01:02 IST|Sakshi

రుణాలపై ఈఎంఐలకు 3 నెలలు విరామం...

మారటోరియం ఆగస్టు వరకు పొడిగింపు

రెపో, రివర్స్‌రెపో రేట్లు 0.40 శాతం తగ్గింపు 

మరింత చౌకగా రుణాలు

వృద్ధికి ప్రేరణగా ఆర్‌బీఐ తాజా నిర్ణయాలు 

2020–21లో వృద్ధి రేటు అధోముఖం

కరోనా ప్రభావం తీవ్రంగా ఉండొచ్చన్న అభిప్రాయం

ముంబై: కరోనా వైరస్‌ రాక ముందే దేశ జీడీపీ వృద్ధి రేటు ఏడేళ్ల కనిష్టానికి పడిపోయింది. అదే సమయంలో వచ్చిన ‘కరోనా’.. ఆర్థిక వ్యవస్థను రెండు నెలలపాటు లాక్‌డౌన్‌ చేసేసింది. ఈ పరిస్థితుల్లో దేశ ఆర్థిక వృద్ధికి ప్రేరణగా ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. రుణ రేట్లు మరింత దిగివచ్చేందుకు వీలుగా రెపో రేటు (బ్యాంకులకు ఇచ్చే నిధులపై వసూలు చేసే రేటు)ను 40 బేసిస్‌ పాయింట్ల (0.40 శాతం) మేర కోత విధించి 4 శాతానికి తీసుకొచ్చింది. ఇది 20 ఏళ్ల (2000 తర్వాత) కనిష్ట స్థాయి.

ఈ నిర్ణయంతో రెపో ఆధారిత గృహ, వాహన, వ్యక్తిగత, ఇతర టర్మ్‌ రుణాల రేట్లు దిగొస్తాయి. అటు రివర్స్‌ రెపో రేటు (బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద ఉంచే నిధులపై చెల్లించే రేటు)ను కూడా 40 బేసిస్‌ పాయింట్లు తగ్గించి 3.75 శాతం నుంచి 3.35 శాతానికి తీసుకొచ్చింది. ఈ నిర్ణయం ఆర్‌బీఐ వద్ద నిధులు ఉంచడానికి బదులు రుణ వితరణ దిశగా బ్యాంకులను ప్రోత్సహించనుంది. మరోవైపు రుణగ్రహీతలకు మరింత ఉపశమనం కల్పిస్తూ.. రుణ చెల్లింపులపై మారటోరియంను మరో మూడు నెలలు పొడిగించింది. అవసరమైతే రేట్లను మరింత తగ్గించేందుకు వీలుగా ‘సర్దుబాటు ధోరణి’నే కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. ఎంపీసీ నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ వీడియో సందేశం రూపంలో తెలియజేశారు.  

రుణగ్రహీతలపై పన్నీరు
లాక్‌డౌన్‌ను చాలా వరకు సడలించినప్పడికీ సాధారణ పరిస్థితులు ఏర్పడడానికి ఎంతో సమయం పడుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రుణ చెల్లింపులపై మే వరకు ఇచ్చిన మారటోరియం (తాత్కాలిక విరామం)ను మరో 3 నెలల పాటు.. ఈ ఏడాది ఆగస్టు చివరి వరకు ఆర్‌బీఐ పొడిగించింది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, సూక్ష్మ రుణ సంస్థలు, కోఆపరేటివ్‌ బ్యాంకులు, క్రెడిట్‌కార్డు సంస్థలు జారీ చేసిన రుణాలకు ఇది అమలవుతుంది.  కాకపోతే మారటోరియంను మే తర్వాత కొనసాగించాలా లేదా అన్నది ఆయా సంస్థల అభీష్టంపైనే ఆధారపడి ఉంటుంది.  మారటోరియం కాలంలో చేయాల్సిన చెల్లింపులు తర్వాతి కాలంలో అసలుకు కలుస్తాయి. దీనివల్ల రుణ చెల్లింపుల కాల వ్యవధి పెరుగుతుంది.  కంపెనీలకు మూలధన అవసరాకు ఇచ్చిన క్యాష్‌ క్రెడిట్‌/ఓవర్‌ డ్రాఫ్ట్‌లకు కూడా 3 నెలల మారటోరియం అమలవుతుందని ఆర్‌బీఐ  పేర్కొంది.

వృద్ధి ప్రతికూలం..
అంచనాల కంటే కరోనా వైరస్‌ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగానే ఉంటుందని ఆర్‌బీఐ ఎంపీసీ అభిప్రాయపడింది. దీంతో 2020–21 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి ప్రతికూల దిశలోనే (జీడీపీ వృద్ధి క్షీణత) ప్రయాణించొచ్చని పేర్కొంది. కాకపోతే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధం (అక్టోబర్‌–మార్చి)లో వృద్ధి పుంజుకోవచ్చన్నారు.

డిమాండ్‌ క్షీణత, సరఫరా వ్యవస్థలో అవరోధాలు కలసి 2020–21 మొదటి ఆరు నెలల కాలంలో వృద్ధిని తగ్గించేస్తాయని.. క్రమంగా ఆర్థిక కార్యకలాపాల పునః ప్రారంభం, ద్రవ్య, పరపతి, పాలనాపరమైన చర్యల వల్ల వృద్ధి రేటు రెటు ఆర్థిక సంవత్సరం ద్విదీయ అర్ధ భాగంలో క్రమంగా పుంజుకోవచ్చని చెప్పారు.  దేశ పారిశ్రామిక ఉత్పత్తిలో 60 శాతం వాటా కలిగిన ఆరు అగ్రగామి రాష్ట్రాలు రెడ్‌/ఆరెంజ్‌ జోన్‌లోనే ఉన్నాయని ఎంపీసీ పేర్కొంది.  

కార్పొరేట్‌ గ్రూపులకు మరిన్ని రుణాలు
ఒక కార్పొరేట్‌ గ్రూపునకు ఒక బ్యాంకు ఇచ్చే రుణ పరిమితిని 25 శాతం నుంచి 30 శాతానికి ఆర్‌బీఐ పెంచింది. దీనివల్ల కార్పొరేట్‌ కంపెనీలకు ఒకే బ్యాంకు పరిధిలో మరింత రుణ వితరణకు వీలు కలుగుతుంది. డెట్, ఇతర క్యాపిటల్‌ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితుల కారణంగా చాలా కంపెనీలు నిధులు సమీకరణకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ తెలిపారు.

ఎగ్జిమ్‌ బ్యాంకుకు రూ.15 వేల కోట్లు
ఎక్స్‌పోర్ట్‌ ఇంపోర్ట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఎగ్జిమ్‌ బ్యాంకు)కు 15,000 కోట్ల క్రెడిట్‌లైన్‌ (అదనపు రుణం) సదుపాయాన్ని (90 రోజులకు) ఆర్‌బీఐ ప్రకటించింది. ‘‘ఎగ్జిమ్‌ బ్యాంకు తన కార్యకలాపాల కోసం విదేశీ కరెన్సీపై ఆధారపడుతుంది. కోవిడ్‌–19 మహమ్మారి కారణంగా నిధులు సమీకరించలేని పరిస్థితిని ఎదుర్కొంటోంది. కనుక నిధుల సదుపాయాన్ని విస్తరించాలని నిర్ణయం తీసుకున్నాం’’ అని ఆర్‌బీఐ పేర్కొంది.  

రాష్ట్రాలకు మరో 13 వేల కోట్లు
కన్సాలిడేటెడ్‌ సింకింగ్‌ ఫండ్‌ (సీఎస్‌ఎఫ్‌) నుంచి రాష్ట్రాలు మరిన్ని నిధులను తీసుకునేందుకు వీలుగా ఆర్‌బీఐ నిబంధనలను సడలించింది. దీనివల్ల రాష్ట్రాలకు మరో రూ.13 వేల కోట్ల నిధులు  అందుబాటులోకి వస్తాయి. రుణాలకు చెల్లింపులు చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్‌బీఐ వద్ద సీఎస్‌ఎఫ్‌ను నిర్వహిస్తుంటాయి.

ద్రవ్యోల్బణంపై అస్పష్టత
కరోనా మహమ్మారి కారణంగా ద్రవ్యోల్బణ గమనంపై తీవ్ర అస్పష్టత ఉందన్న అభిప్రాయాన్ని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ వెల్లడించారు. పప్పు ధాన్యాల ధరల పెరుగుదలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ధరలను తగ్గించేందుకు దిగుమతి సుంకాలను సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. 2020–21 మొదటి ఆరు నెలల్లో రిటైల్‌ ద్రవ్యోల్బణం అధిక స్థాయిల్లోనే ఉండొచ్చంటూ.. ద్వితీయ ఆరు నెలల కాలంలో
లక్షి్యత 4 శాతానికి దిగువకు రావొచ్చన్నారు.

దివాలా చర్యలకు మరింత వ్యవధి
ఇక మారటోరియం కాలానికి దివాలా చట్టంలోని నిబంధనల నుంచి ఆర్‌బీఐ మినహాయింపునిచ్చింది. ఐబీసీ చట్టంలోని నిబంధనల కింద రుణ గ్రహీత సకాలంలో చెల్లింపులు చేయకపోతే.. 30 రోజుల సమీక్షాకాలం, 180 రోజుల పరిష్కార కాలం ఉంటుంది. ఇవి మారటోరియం కాలం ముగిసిన తర్వాతే అమల్లోకి వస్తాయి.  

మరిన్ని నిర్ణయాలకు సదా సిద్ధం
2020 మార్చి నుంచి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ దెబ్బతిన్నట్టు సంకేతాలు తెలియజేస్తున్నాయి. ఆర్‌బీఐ ఇక ముందూ చురుగ్గానే వ్యవహరిస్తుంది. అవసరం ఏర్పడితే భవిష్యత్తు అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా అన్ని రకాల సాధనాలను, ఇటీవల తీసుకున్న విధంగా కొత్తవి సైతం అమలు చేసేందుకు ఆర్‌బీఐ సిద్ధంగా ఉంటుంది

– శక్తికాంత దాస్, ఆర్‌బీఐ గవర్నర్‌

ఆర్‌బీఐ అసాధారణ నిర్ణయాలు

► మార్చి 3: కరోనా వైరస్‌ ప్రవేశంతో,  పరిస్థితులు సమీక్షిస్తున్నామని, తగి న నిర్ణయాలకు సిద్ధమని  ప్రకటన.

► మార్చి 27: రెపో రేటు 75 బేసిస్‌ పాయింట్లు, సీఆర్‌ఆర్‌ 100 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. రుణ చెల్లింపులపై మూడు నెలల మారటోరియం విధింపు.

► ఏప్రిల్‌ 3: రోజువారీ మనీ మార్కెట్‌ ట్రేడింగ్‌ వేళలను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు పరిమితం చేసింది.

► ఏప్రిల్‌ 17: రివర్స్‌ రెపో రేటు 25 బేసిస్‌ పాయింట్లు తగ్గింపు. నాబార్డ్, సిడ్బి, నేషనల్‌హౌసింగ్‌ బ్యాంకులకు రూ.50వేల కోట్ల నిధుల వెసులుబాటు. 90 రోజుల్లోపు రుణ చెల్లింపుల్లేని ఖాతాలను ఎన్‌పీఏలుగా  గుర్తించాలన్న నిబంధనల నుంచి మారటోరియం రుణాలకు మినహాయింపు.

► ఏప్రిల్‌ 27: మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు పెట్టుబడుల ఉపసంహరణ ఒత్తిళ్లను ఎదుర్కొంటుండడంతో (డెట్‌ ఫండ్స్‌కు సంబంధించి) వాటికి రూ.50వేల కోట్ల ప్రత్యేక విండోను (బ్యాంకుల ద్వారా) తీసుకొచ్చింది.  

► మే 22: రెపో, రివర్స్‌ రెపో 40 బేసిస్‌ పాయింట్ల చొప్పున తగ్గింపు. మారటోరియం మరో మూడు నెలలు పొడిగింపు.

ఇతర కీలక అంశాలు
ఎగుమతులకు సంబంధించి ఇచ్చే రుణాల కాల వ్యవధిని ఏడాది నుంచి 15 నెలలకు ఎంపీసీ పొడిగించింది.  

 దిగుమతులకు సంబంధించిన రెమిటెన్స్‌ల పూర్తికి సమయాన్ని 6 నెలల నుంచి 12 నెలలకు పొడిగించింది.  

2020–21లో మే 15వరకు విదేశీ మారక నిల్వలు 9.2 బిలియన్‌ డాలర్లు పెరిగి 487 బిలియన్‌ డాలర్లకు చేరాయి.

ఆరుగురు సభ్యులున్న ఎంపీసీలో గవర్నర్‌ దాస్‌ సహా ఐదుగురు 40 బేసిస్‌ పాయింట్లకు ఆమోదం తెలిపితే, చేతన్‌ ఘటే మాత్రం 25 బేసిస్‌ పాయింట్లకు మొగ్గు చూపించారు.  

రిజర్వ్‌ బ్యాంక్‌ ఎంపీసీ భేటీ వాస్తవానికి జూన్‌ 3–5 తేదీల మధ్య జరగాల్సి ఉంది. కాకపోతే తక్షణ అవసరాల నేపథ్యంలో ముందస్తుగా ఈ నెల 20–22 తేదీల మధ్య సమావేశమై నిర్ణయాలు తీసుకుంది.

మారటోరియం తీసుకున్నది 20 శాతమే
మా రుణ గ్రహీతల్లో 20 శాతం మందే మారటోరియం ఎంచుకున్నారు. వీరిలో అందరూ నిధుల సమస్యను ఎదుర్కోవడం లేదు.  నగదును కాపాడుకునే వ్యూహాంలో భాగంగానే వారు మారటోరియం అవకాశాన్ని వినియోగించుకున్నారు నిధుల పరంగా ఎటువంటి సమస్యల్లేని వారు  చెల్లింపులు చేయడమే మంచిది.   

– రజనీష్‌ కుమార్, ఎస్‌బీఐ చైర్మన్‌

మరిన్ని చర్యలు...
భవిష్యత్తు ఆర్థిక వృద్ధిపై ఎంతో అనిశ్చితి ఉందన్న అంచనాలు, ఆర్‌బీఐ సైతం జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతికూల ధోరణిలో ఉం డొచ్చని అంగీకరిం చినందున.. ఆర్‌బీఐ, ప్రభుత్వం నుంచి ఇక ముందూ మరిన్ని మద్దతు చర్యలు అవసరం అవుతాయి.

– సంగీతారెడ్డి, ఫిక్కీ ప్రెసిడెంట్‌ 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు