రెండేళ్లలో రూ.68వేలకు బంగారం..!

25 Jun, 2020 12:51 IST|Sakshi

కరోనా కేసులు తగ్గినా బంగారానికి డిమాండే

కలిసొస్తున్న భారత్‌-చైనా సరిహద్దు వివాదాలు

అర్థికవృద్ధిపై ప్రతికూల అవుట్‌లుక్‌ ప్రభావం

ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అనిశ్చితులు, రేటింగ్‌ సంస్థల ప్రతికూల అవుట్‌లుక్‌ ప్రకటన లాంటి సంక్షోభ సమయాల్లో ఇన్వెస్టర్లకు ఆదాయాల్నిచ్చే ఏకైక అసెట్‌ క్లాస్‌ సాధనం ఏదైనా ఉందంటే అది బంగారం అనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌(ఎంసీఎక్స్‌) మార్కెట్లో బుధవారం 10గ్రాముల బంగారం ధర 48,589 రూపాయిల వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. రానున్న రోజుల్లో బంగారం ధరలో అప్‌ట్రెండ్‌ కొనసాగుతుందని బులియన్‌ పండితులు అంచనా వేస్తున్నారు.

వచ్చే రెండేళ్లల్లో రూ.68వేలకు:
భారత ఆర్థికవృద్ధి అవుట్‌లుక్‌ను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) తగ్గించడం, చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదాలు, దేశవ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుదల భయాలు, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ర్యాలీ చేసే అవకాశం తదితర అంశాలు దేశీయంగా బంగారానికి డిమాండ్‌ను పెంచుతాయని బులియన్‌ పండితులు అంటున్నారు. ఈ క్రమంలో వచ్చే రెండేళ్లలో 10గ్రాముల బంగారం ధర రూ.68వేల స్థాయికి చేరుకోవచ్చని వారు అంచనా వేస్తున్నారు.  

కరోనా కేసులు తగ్గినా బంగారానికి డిమాండే: 
కరోనా కేసులు తగ్గినా బంగారం ర్యాలీ కొనసాగేందుకు అవకాశం ఉందని మోతీలాల్‌ ఓస్వాల్‌ బ్రోకరేజ్‌ కమోడిటీ విభాగపు అధిపతి కిషోర్‌ నార్నే అభిప్రాయపడ్డారు. దేశీయంగా వచ్చే ఏడాదిన్నర, రెండేళ్లలో బంగారం ధర రూ.65,000-68,000 శ్రేణిని అందుకునేందుకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే డాలర్‌ మారకంలో రూపాయి కదలికపై బంగారం మూమెంటం ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.   

‘‘కోవిడ్‌-19 బారినపడిన ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు ఎక్కువ సమయం పడుతుంది. ఆయా దేశాల సెంట్రల్‌ బ్యాంకులు మరో రెండేళ్ల పాటు సులభమైన ద్రవ్య పాలసీ విధానానికే కట్టుబడే అవకాశం ఉంది. ఇది బంగారం బలపడేందుకు సహకరించవచ్చు’’ అని నార్నే అంటున్నారు. 

అంతర్జాతీయంగా సానుకూల పరిణమాలు:
కరోనా కేసులు ప్రపంచవ్యాప్తంగా 9మిలియన్‌ దాటడంతో పాటు కొన్ని దేశాల్లో రెండో దశ వ్యాధి వ్యాప్తి మొదలైంది. తాజాగా అమెరికా చైనాల మధ్య మరోసారి వాణిజ్య యుద్ధం వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. బంగారానికి వ్యతిరేక దిశలో ట్రేడయ్యే డాలర్‌, అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ బలహీనపడుతున్నాయి. ఈ అంశాలన్ని బంగారం ర్యాలీకి సహకరించే అంశాలే కావడం విశేషం.  
 
2021ఎఫ్‌వైలో భారత్‌ ఆర్థికవృద్ధి 4.5శాతం క్షీణత
కరోనా మహమ్మారి భారత ఆర్థిక వ్యవస్థను భారీగా దెబ్బతీసిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు ఏకంగా 4.5 శాతం పడిపోయిందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. అయితే, 2021లోపు 6 శాతం వృద్ధిరేటు నమోదవుతుందని స్ఫష్టం చేసింది. అలాగే అంతర్జాతీయ వృద్ధిరేటు 2020లో 4.9 శాతం ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది.

మరిన్ని వార్తలు