పసిడి నగలకు ‘హాల్‌మార్క్‌’

30 Nov, 2019 03:29 IST|Sakshi

2021 జనవరి 15 నుంచి తప్పనిసరి

వచ్చే జనవరి 15న నోటిఫికేషన్‌

వ్యాపారులకు ఏడాది సమయం

కేంద్ర మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌

న్యూఢిల్లీ: దేశంలో బంగారం ఆభరణాలు, బంగారంతో చేసిన కళాకృతులకు హాల్‌ మార్కింగ్‌ ధ్రువీకరణను 2021 జనవరి 15 నుంచి తప్పనిసరి చేయనున్నట్టు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ శుక్రవారం ప్రకటించారు. ‘‘ఇందుకు సంబంధించి రాబోయే జనవరి 15న నోటిఫికేషన్‌ విడుదల చేస్తాం. ఆభరణాల వ్యాపారులు తమ వద్దనున్న హాల్‌మార్క్‌లేని ఆభరణాలను పూర్తిగా ఖాళీ చేసుకునేందుకు ఏడాది పాటు సమయం ఉంటుంది’’ అని మంత్రి తెలిపారు.

ఈ నేపథ్యంలో నగల వర్తకులు భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్‌) వద్ద తప్పనిసరిగా రిజిస్టర్‌ చేసుకుని, హాల్‌మార్క్‌తో కూడిన ఆభరణాలనే విక్రయించాల్సి ఉంటుందన్నారు. ‘‘విలువైన పసిడి విషయంలో స్వచ్ఛతకు హామీనివ్వడమే మా లక్ష్యం. చిన్న పట్టణాలు, గ్రామాల్లోని వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం’’ అని వివరించారు.

2000 ఏప్రిల్‌ నుంచి బంగారు ఆభరణాలకు హాల్‌మార్క్‌ను ధ్రువీకరించే పథకాన్ని బీఐఎస్‌ ఆచరణలోకి తీసుకొచ్చింది. కాకపోతే తప్పనిసరి చేయలేదు. దీంతో ప్రస్తుత ఆభరణాల్లో 40 శాతమే హాల్‌మార్క్‌వి ఉంటున్నాయి. ఇప్పటికే వినియోగంలో ఉన్న ఆభరణాల జోలికి తాము వెళ్లబోమని మంత్రి పాశ్వాన్‌ స్పష్టం చేశారు. హాల్‌మార్కింగ్‌ తప్పనిసరికి సంబంధించిన ముసాయిదా ఆదేశాలను అభిప్రాయాల కోసం ప్రపంచ వాణిజ్య మండలి (డబ్ల్యూటీవో) వెబ్‌సైట్‌లో అక్టోబర్‌ 10న ఉంచామని చెప్పారు. అభిప్రాయాలు తెలియజేసేందుకు 60 రోజుల గడువు ఉంటుందన్నారు.  

హాల్‌మార్కింగ్‌ మూడు రకాలు.. 
ఆభరణాల హాల్‌మార్కింగ్‌ను బీఎస్‌ఐ మూడు రకాలుగా వర్గీకరించింది. 14 కేరట్, 18 కేరట్, 22 కేరట్‌ ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. ఈ మూడు విభాగాల ధరలను ఆభరణాల విక్రేతలు తమ దుకాణాల్లో ప్రదర్శించడాన్ని కూడా తప్పనిసరి చేయనున్నట్టు పాశ్వాన్‌ తెలిపారు. బీఐఎస్‌ వద్ద నమోదైన ఆభరణాల వర్తకులు బీఐఎస్‌ లైసెన్స్‌ పొందిన అస్సేయింగ్‌ అండ్‌ హాల్‌మార్కింగ్‌ కేంద్రాల నుంచి హాల్‌మార్క్‌ సర్టిఫికేషన్‌ను పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 234 జిల్లాల పరిధిలో 877 హాల్‌మార్కింగ్‌ కేంద్రాలు నడుస్తున్నాయి. 26,019 మంది జ్యువెలర్లు బీఐఎస్‌ వద్ద రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కనీసం రూ.లక్ష నుంచి ఆభరణాల విలువకు గరిష్టంగా ఐదు రెట్ల వరకు జరిమానాతోపాటు, బీఐఎస్‌ చట్టం కింద ఏడాది వరకు జైలుశిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని బీఐఎస్‌ అధికారి ఒకరు తెలిపారు. అన్ని జిల్లాల్లో హాల్‌ మార్కింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా వర్తకుల రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తామని చెప్పారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు