ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ 15శాతం నష్టం

4 Apr, 2018 18:04 IST|Sakshi

సాక్షి,ముంబై:  ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌కు చెందిన బ్రోకింగ్‌ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ లిస్టింగ్‌లో నష్టాలను మూటగట్టుకుంది.   బుధవారం స్టాక్ ఎక్స్ఛేంజీలలో భారీ నష్టాలతో లిస్టయ్యింది.  ట్రేడింగ్‌  ఆరంభంలోనే ఇది 17 శాతం(రూ. 89) నష్టపోయి  రూ. 431వద్ద ప్రారంభమైంది. చివరికి 15 శాతం  నష్టంతో ముగిసింది. అయితే దీని ఈక్వీటీ షేరు ఇష్యూ ధర రూ. 520.  కాగా  ఇష్యూకి 78 శాతమే సబ్‌స్క్రిప్షన్ లభించింది. యాంకర్‌ విభాగంతో కలుపుకుంటే ఇష్యూ 88 శాతం సబ్‌స్క్రయిబ్‌ అయ్యింది. యాంకర్‌ పోర్షన్‌తో కలిపి ఇష్యూ ద్వారా ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ రూ. 3500 కోట్లను సమీకరించింది. వెరసి ఇష్యూ పరిమాణాన్ని రూ. 4017 కోట్ల నుంచి రూ. 3500కు తగ్గించుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.

ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ ఐపీవోకు సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగం నుంచి పూర్తిస్థాయిలో(1 శాతం) బిడ్స్‌ దాఖలుకాగా..  సంపన్న వర్గాల కోటాలో స్వల్పంగా 33 శాతమే స్పందన కనిపించింది. ఇక రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి సైతం 88 శాతం దరఖాస్తులు లభించాయి. కంపెనీ 4.42 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 3.46 కోట్ల షేర్ల కోసం మాత్రమే బిడ్స్‌ దాఖలయ్యాయి. యాంకర్‌ ఇన్వెస్టర్ల విభాగంలో 3.3 కోట్ల షేర్లను 28 సంస్థలకు కేటాయించింది. షేరుకి రూ. 520 ధరలో  వీటిని జారీ చేయడం ద్వారా రూ. 1717 కోట్లను సమీకరించింది.

మరిన్ని వార్తలు