2020కి బీఎస్-6 నిబంధనల అమలుకు సిద్ధం: సియామ్

20 Sep, 2016 01:02 IST|Sakshi
2020కి బీఎస్-6 నిబంధనల అమలుకు సిద్ధం: సియామ్

న్యూఢిల్లీ: దేశీ వాహన పరిశ్రమ 2020 నాటికి బీఎస్-6 ఉద్గార నిబంధనల అమలుకు సిద్ధంగా ఉందని సియామ్ తెలిపింది. ఇక బీఎస్-4 నిబంధనలు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావొచ్చని అభిప్రాయపడి ంది. దీనికోసం బీఎస్-4 ఇంధనం దేశవ్యాప్తంగా అందుబాటులోకి రావాల్సి ఉందని తెలిపింది. వాహన కంపెనీలు ఈ కొత్త ఇంధన లభ్యతకు సంబంధించి ఆయిల్ కంపెనీలపై పూర్తి విశ్వాసంతో ఉన్నాయని పేర్కొంది. ఒకసారి నిబంధనల అమలుకు అంగీకరించిన తర్వాత వాటిల్లో ఎలాంటి మార్పులు, చేర్పులు, వాయిదాలు ఉండబోవని సియామ్.. వాహన కంపెనీలను హెచ్చరించింది.

కేంద్రం బీఎస్-4/6 ఇంధనానికి సంబంధించి ఆయిల్ కంపెనీలకు ఇచ్చిన పలు మినహాయింపుల వల్ల వాహన కంపెనీలకు సమస్యలు ఎదురుకావొచ్చని అంచనా వేసింది. కంపెనీలు తయారు చేసే వాహనాల ఇంధన సామర్థ్యంపై ప్రభావం పడొచ్చని పేర్కొంది. భద్రత, ఉద్గారాలకు సంబంధించిన కొత్త నిబంధనల అమలు దిశగా భారత్ చాలా వేగంగా కదులుతోందని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ దాసరి తెలిపారు. 2020కి బీఎస్-6 నిబంధలను తక్కువ కాలంలో అమల్లోకి తీసుకురావడం కష్టసాధ్యమైనా.. వాహన పరిశ్రమ ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. వాహన కంపెనీలు వాయు కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని బీఎస్-6 నిబంధల అమలు సవాల్‌ను స్వీకరించాయని చెప్పారు.

మరిన్ని వార్తలు