జియో ఆఫర్లు ‘సముచితమే’: ట్రాయ్‌

3 Feb, 2017 00:25 IST|Sakshi
జియో ఆఫర్లు ‘సముచితమే’: ట్రాయ్‌

న్యూఢిల్లీ: టెలికం సంస్థ రిలయన్స్‌ జియో ప్రకటించిన టారిఫ్‌ ప్లాన్లు.. నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) భావిస్తోంది. జియో ఉచిత ప్రమోషనల్‌ ఆఫర్‌ను సవాల్‌ చేస్తూ టెలికం ట్రిబ్యునల్‌ టీడీశాట్‌ని ఆశ్రయించిన భారతీ ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులార్‌ తదితర ఆపరేట్లరకు కూడా ఇదే విషయం తెలియజేయనుంది. ‘జియో టారిఫ్‌లను ట్రాయ్‌ పరిశీలించింది. అవి ప్రస్తుత టారిఫ్‌ ఉత్తర్వులు, ఇతర నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని అభిప్రాయపడింది’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి.

జియో టారిఫ్‌లు నిబంధనలను ఉల్లంఘించడం లేదని, ట్రాయ్‌ ఇందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అటార్నీ జనరల్‌ ఇటీవలే నియంత్రణ సంస్థకు సూచించిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. నిర్దేశిత 90 రోజులను కూడా అధిగమించి  జియో 2017 మార్చి దాకా ఉచిత వాయిస్, డేటా ఆఫర్లను అందించడం నిబంధనలకు విరుద్ధమంటూ ఇతర ఆపరేటర్లు టీడీశాట్‌ను ఆశ్రయించారు. దీంతో ట్రాయ్‌ నిర్ణయాన్ని తెలియజేయాలంటూ టీడీశాట్‌ ఆదేశించింది. కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 6న జరగనుంది.

కవరేజీ ఓకే.. కానీ స్పీడే లేదు..
రిలయన్స్‌ జియో నెట్‌వర్క్‌ కవరేజీ ఇతర ఆపరేటర్లతో పోలిస్తే చాలా ముందంజలో ఉందని క్రెడిట్‌ సూసీ ఒక నివేదికలో పేర్కొంది. అయితే, ఉచిత ఆఫర్‌ కాలంలో నెట్‌వర్క్‌పై అధిక లోడ్‌ కారణంగా 4జీ స్పీడ్‌ అందించడంలో మాత్రం ఎయిర్‌టెల్‌ కన్నా వెనుకబడే ఉందని వివరించింది.

మరిన్ని వార్తలు