ఫెడ్ ప్రభావం.. 305 పాయింట్ల పతనం

20 May, 2016 01:15 IST|Sakshi
ఫెడ్ ప్రభావం.. 305 పాయింట్ల పతనం

25,400 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్
రెండు వారాల కనిష్టస్థాయి ఇది
అంతర్జాతీయ ట్రెండ్‌తో పాటే...

ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వ్ జూన్‌లో వడ్డీ రేట్లు పెంచవచ్చన్న అంచనాలు ఊపందుకోవడంతో అంతర్జాతీయ ట్రెండ్‌ను అనుసరిస్తూ గురువారం భారత్ సూచీలు రెండు వారాల కనిష్టానికి పతనమయ్యాయి. 305 పాయింట్లు నష్టంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 25,400 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంతభారీ క్షీణత మూడు వారాల్లో ఇదే మొదటిసారి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 87 పాయింట్ల తగ్గుదలతో 7,783 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.ప్రపంచ ట్రెండ్‌కు తోడు పీ-నోట్స్‌పై ఇన్వెస్టర్లలో తాజా ఆందోళనలు తలెత్తడం కూడా సెంటిమెంట్‌ను బలహీనపర్చినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.

 బీజేపీ విజయాన్ని పక్కనపెట్టిన ఇన్వెస్టర్లు...
వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాల్ని  తాజా ఆందోళనల కారణంగా ఇన్వెస్టర్లు విస్మరించారని విశ్లేషకులు చెప్పారు. ఫెడ్, పీ-నోట్స్ ఆంశాలపైనే మార్కెట్ దృష్టినిలపడంతో ఈక్విటీలు పతనమయ్యాయని వివరించారు. జూన్‌లో వడ్డీ రేట్లను పెంచాలన్న అభిప్రాయాన్ని అధికశాతం ఫెడ్ కమిటీ సభ్యులు వ్యక్తంచేసినట్లు ఇటీవలి సమావేశపు మినిట్స్ వెల్లడించడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారని బీఎన్‌పీ పారిబాస్ ఫండ్ మేనేజర్ శ్రేయాష్ దేవల్కర్ చెప్పారు.

 పతనమైన సన్‌టీవీ, ఆదానీ పోర్ట్స్
ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే అధికారాన్ని చేజిక్కించుకోకపోవడంతో సన్‌టీవీ షేరు 13 శాతంపైగా పతనమై రూ. 371 వద్ద ముగిసింది. సన్‌టీవీ అధినేత కళానిధి మారన్...డీఎంకే చీఫ్ కరుణానిధికి సమీప బంధువు, సన్నిహితుడుకావడంతో ఆ పార్టీ అధికారంలోకి వస్తే సన్‌టీవీ నెట్‌వర్క్ మరింత విస్తరించవచ్చన్న అంచనాలతో ఇన్వెస్టర్లు ఆ షేర్లను కొనుగోలు చేయడంతో రెండు రోజుల క్రితం ఈ షేరు 10% పెరగడం తెలిసిందే. ఇక సెన్సెక్స్ షేర్లలో అత్యధికంగా ఆదాని పోర్ట్స్ 6.14% క్షీణించి రూ. 172 వద్ద క్లోజయ్యింది.

 ప్రపంచ మార్కెట్లదీ ఇదే బాట....
ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాల ప్రభావంతో ప్రపంచ మార్కెట్లు కూడా క్షీణబాట పట్టాయి. ఆసియాలోని చైనా, హాంకాంగ్, తైవాన్, కొరియా సూచీలు 0.2-1.3% మధ్య తగ్గాయి. యూరప్‌లోని బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ ఇండెక్స్‌లు 0.8-1.8% మధ్య పతనమయ్యాయి. అమెరికా మార్కెట్ కూడా కడపటి సమాచారం అందేసరికి 1% క్షీణతతో ట్రేడవుతోంది.

>
మరిన్ని వార్తలు