మాజీ సీఎంపై సీబీఐ ఛార్జిషీట్

2 Feb, 2018 22:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మానేసర్‌ భూ కుంభకోణం కేసులో హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్‌ సింగ్‌ హుడాపై శుక్రవారం సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ మాజీ సీఎంతో పాటు దీంతో సంబంధం ఉందన్న ఆరోపణలతో మరో 34 మంది అధికారుల పేర్లను ఛార్జిషీట్లో చేర్చారు. భూపిందర్ సీఎంగా ఉన్న సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా చేసిన మురారి లాల్ తయాల్, యూపీఎస్‌సీ మాజీ సభ్యుడు చాటర్ సింగ్ సహా తదితర అధికారులపై వేల పేజీలతో కూడిన ఛార్జిషీట్‌ను సీబీఐ అధికారులు పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టుకు సమర్పించారు. ఈ 24లోగా పూర్తి ఆధారాలు సమర్పించేందుకు సీబీఐని కోర్టు ఆదేశించినట్లు సమాచారం.

అసలు ఏం జరిగిందంటే.. భూపిందర్ సీఎంగా ఉన్న 2005-15 కాలంలో మానేసర్‌లో ఇండస్ట్రియల్ మోడల్ టౌన్‌షిప్‌ల ఏర్పాటుకుగానూ 900 ఏకరాలకు పైగా భూమి సేకరించాలని ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో తక్కువ ధరలకే బిల్డర్స్ రైతులు, స్థానికులను బెదిరించి భూములు కొనుగోలు చేశారు. అయితే హుడా ప్రభుత్వమే బలవంతంగా మార్కెట్ ధర కంటే తక్కువ ధరలకే భూములు సొంతం చేసుకోవాలని ప్లాన్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఉద్దేశపూర్వకంగానే భూములు కొనుగోలు చేసిన తర్వాత హుడా ప్రభుత్వం అక్కడ ఎలాంటి టౌన్‌షిప్ నిర్మించకపోవడం గమనార్హం. తాజాగా సీబీఐ దీనిపై ఛార్జిషీటు దాఖలు చేసి కేసు విచారణను వేగవంతం చేయాలని చూస్తోంది.

మరిన్ని వార్తలు