రాజేంద్రనగర్‌లో విషాదం!

23 Feb, 2019 10:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగర శివారులోని రాజేంద్రనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. శివరాంపల్లి వద్ద  A to Z ఈత కొలనులో మహ్మద్ ఖాజా అనే విద్యార్థి ఈత నేర్చుకోవడానికి వచ్చి నీటమునిగి మృత్యువాతపడ్డాడు. గత కొంతకాలంగా విద్యార్థి ఈత నేర్చుకోవడం కోసం శిక్షణ తీసుకుంటున్నాడు. శనివారం ఉదయం కూడా రోజులానే స్విమ్మింగ్‌ పూల్‌లోకి దిగాడు. సమయానికి అక్కడ కోచ్‌ లేకపోవడంతో కొంత దూరం వెళ్లిన విద్యార్థి ప్రమాదవశాత్తు నీటమునిగి మృతి చెందాడు. బాలుడి మృతికి స్విమ్మింగ్ పూల్ యాజమాన్య నిర్లక్ష్యమే కారణమని బాలుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. స్విమ్మింగ్ పూల్లో కోచర్ లేకపోవడంతో పాటు అక్కడ సరియైన నిర్వహణ లేని‌ కారణంగానే తమ కుమారుడు మృతి చెందాడంటూ ఆందోళనకు దిగారు.

అప్పటి వరకు తమ ముందు ఆడుకున్న తన కొడుకు విగత జీవిలా పడి వుండడం చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. యాజమాన్యం నిర్లక్ష్యంపై రాజేంద్రనగర్ పోలీసులకు తల్లిదండ్రులు పిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పొస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అక్కడికి చేరుకునేలోపు యాజమాని అక్కడి నుంచి అదృశ్యమయ్యరు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు