మద్యం డోర్‌ డెలివరీ అంటూ రూ. 50వేలు టోకరా

7 Apr, 2020 08:21 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో:  లాక్‌డౌన్‌ ప్రభావం మందుబాబులపై భారీగానే ఉంది. పనిలో పనిగా ఆన్‌లైన్‌లోనూ మద్యం కోసం సెర్చ్‌ చే సేస్తున్నారు. దీన్ని క్యాష్‌ చేసుకోవడానికి కొందరు సైబర్‌ నేరగాళ్ళు రంగంలోకి దిగారు. నగరానికి చెందిన ప్రముఖ వైన్‌ షాప్‌ బగ్గా వైన్‌ షాప్‌ పేరుతో ఫేస్‌బుక్‌లో ఓ పేజ్‌ ఓపెన్‌ చేశారు. దీని ద్వారా ఆర్డర్‌ ఇస్తే కావాల్సిన బాటిల్స్‌ ను డోర్‌ డెలివరీ చేస్తామంటూ నమ్మించి భారీగా దండుకుంటున్నారు. ఈ సైబర్‌ నేరగాళ్ళ వల్లో పడి రూ.50 వేలు కోల్పోయిన బాధితుడు సోమవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ మధుసూదన్‌ దర్యాప్తు ప్రారంభించారు.  నగరానికి చెందిన ఓ వ్యక్తి మద్యం కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు బగ్గా వైన్స్‌ పేరుతో ఏర్పాటైన ఫేస్‌బుక్‌ పేజ్‌ కనిపించింది. అందులో 24 గంటలూ డోర్‌ డెలివరీ అంటూ కొన్ని ఫోన్‌ నెంబర్లు పొందుపరిచి ఉన్నాయి.

బాధితుడు వాటిని సంప్రదించడంతో బగ్గా వైన్స్‌ యాజమాన్యం మాదిరిగానే మాట్లాడారు. తమకు మద్యం కావాలంటూ బాధితుడు చెప్పడంతో ఏఏ బ్రాండ్లు కావాలో ఎంచుకోవాలని సైబర్‌ నేరగాళ్ళు చెప్పారు. దీంతో బాధితుడు మూడు బాటిళ్ళు ఎంచుకోగా వాటికి సంబంధించి మొత్తం రూ.4500 అవుతుందని, ఆన్‌లైన్‌లో చెల్లించాలని సూచించారు. వీరి గూగుల్‌ పే ఖాతా నుంచి తొలుత రూ.10 చెల్లించాలని సూచించగా బాధితుడు అలానే చేశాడు. ఆపై మిగిలిన మొత్తం చెల్లింపు కోసం తాము పంపే క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాలని కోరారు. బాధితుడు అలానే చేసి ప్రొసీడ్‌ టు పే అనే ఆప్షన్‌ ఎంచుకోగా... ఇతడి ఖాతా నుంచి రూ.50 వేలు సైబర్‌ నేరగాళ్ళ గూగుల్‌ పే ఖాతాకు వెళ్ళిపోయాయి. దీంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు సోమవారం సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన అధికారులు ప్రాథమిక ఆధారాలను బట్టి ఇది రాజస్థాన్‌ గ్యాంగ్స్‌ పనిగా అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఫేస్‌బుక్‌లో తమ సంస్థ పేరుతో ఏర్పాటైన నకిలీ పేజీలపై బగ్గా వైన్స్‌ సంస్థ సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా స్పందించిన అధికారులు వాటిని తొలగించాలని కోరుతూ ఫేస్‌బుక్‌ సంస్థకు నోటీసు జారీ చేశారు.   

మరిన్ని వార్తలు