రేప్‌ బాధితురాలి మౌనం .. అలా పరిగణించలేం

22 Oct, 2017 13:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అత్యాచారం కేసులో బాధితురాలు మౌనంగా ఉన్నంత మాత్రాన.. నిందితుడితో శారీరక సంబంధం ఉందని అంగీకరించినట్లు కాదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. బాధితురాలిపై తాను ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడలేదని.. విచారణ సమయంలో ఆమె ఏం మాట్లాడకుండా ఉండటమే అందుకు నిదర్శనమని ఓ వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. 19 ఏళ్ల యువతిని నిర్భందించి అత్యాచారం చేసిన కేసులో దిగువ న్యాయస్థానం రెండేళ్ల క్రితం అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

తాజా పిటిషన్‌పై స్పందించిన న్యాయమూర్తి సంగీత దింగర సెహగల్ స్పందిస్తూ.. బాధితురాలు మౌనంగా ఉంటే నిందితుడితో పరస్పర శారీరక సంబంధం ఉన్నట్లేనా? అలా అంగీకరించినట్లు ఎలా అవుతుందని పిటిషనర్‌ తరపున న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ కేసులో నిందితుడిని నిరపరాధిగా తేల్చటం కుదరదని తేల్చి చెప్పింది.  పైగా ఈ కేసులో ఆమెను బెదిరించినట్లు కూడా స్పష్టంగా తేలిందని జడ్జి తెలిపారు. 

యువతి చెప్పిన కథనం ప్రకారం.. 2010లో యూపీకి చెందిన ఆమె పని కోసం ఢిల్లీకి చేరుకుంది. అక్కడ మున్నా అనే ఓ వ్యక్తి పని ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి.. హర్యానాలోని పానిపట్‌కు తీసుకెళ్లి ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంచి రెండు నెలలు అత్యాచారం చేశాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు.  అటుపై నోయిడాలోని కుమార్ అనే మరో స్నేహితుడి దగ్గరకు తీసుకెళ్లి ఆమెను అమ్మేందుకు యత్నించాడు. అయితే మున్నాకు తెలీకుండా కుమార్‌ కూడా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న మున్నా కుమార్‌తో గోడవకు దిగటంతో విషయం పోలీస్‌ స్టేషన్‌కు చేరి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయగా.. 2015లో ట్రయల్‌ కోర్టు మున్నాకు 10 ఏళ్ల శిక్ష విధించింది.

మరిన్ని వార్తలు