కన్నవారే కడతేర్చారు

31 May, 2018 01:12 IST|Sakshi
ఛత్రియ, హేతురాం

అల్లరి చేస్తోందని కూతుర్నే హతమార్చిన వైనం

ఇటుకతో కొట్టి చంపిన తల్లి..

బూడిద కుప్పలో పూడ్చిన తండ్రి 

రంగారెడ్డి జిల్లాలో ఘటన

ఇబ్రహీంపట్నం: నవమాసాలూ మోసిన కన్న తల్లే ఆ చిన్నారి పాలిట మృత్యుదేవతైంది. అల్లరి చేస్తోందనే కారణంతో దివ్యాంగురాలనే కనికరం కూడా చూపకుండా ఆ తల్లి కన్నకూతురికే మరణ శాసనం రాసింది. కన్న తల్లి కూతుర్ని ఇటుకతో కొట్టి చంపితే.. కన్న తండ్రి ఆమె మృతదేహాన్ని బూడిద కుప్పలో పూడ్చేశాడు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు తమ కుమార్తె అదృశ్యమైందంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కన్న ప్రేమకే మచ్చతెచ్చిన ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. బుధవారం ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ మల్లారెడ్డి కేసు వివరాలు వెల్లడించారు.  

అల్లరి చేస్తోందని.. 
ఒడిశాకి చెందిన భార్యాభర్తలు బల్లటి ఛత్రియ, హేతురాం యాచారం మండల పరిధిలోని చింతుల్ల శివారులోని బీఎన్‌సీ ఇటుక బట్టీలో 5 నెలలుగా పనిచేస్తున్నారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడు. మూడో కుమార్తె ఊర్మిళ(7) పుట్టు మూగ, చెవుడు. ఊర్మిళ అల్లరి ఎక్కువగా చేసేది. తరచూ పొరుగువారితో గొడవ పడుతుండేది. దీంతో తల్లి ఛత్రియ(39) తన కూతురును చంపాలని నిర్ణయించుకుంది. 26వ తేదీ మధ్యాహ్నం ఊర్మిళ గుడిసెలో నిద్రిస్తుండగా ఇటుకతో ఆమె తలపై కొట్టి చంపింది. గుడిసె బయట నిద్రిస్తున్న భర్త హేతురాంను లేపి విషయాన్ని చెప్పింది.

మృతదేహాన్ని ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. దీంతో సమీపంలోని ఇటుకబట్టీల్లో కాల్చేసిన బూడిద పొట్టు కుప్పను తవ్వి అందులో మృతదేహాన్ని హేతురాం పాతిపెట్టాడు. అనంతరం చిన్నారి తప్పిపోయిందంటూ చుట్టుపక్కల వారిని నమ్మించారు. ఇటుక బట్టీ యజమాని ఆ చిన్నారి తల్లిదండ్రులతో కలసి 27న యాచారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

విచారణ చేపట్టిన సీఐ కృష్ణంరాజుకు తల్లిదండ్రులపైనే అనుమానం కలిగింది. ఇటుక బట్టీ ల వద్ద దుర్వాసన వస్తుండటంతో ఆ అనుమానం మరింత బలపడింది. ఛత్రియను బిడ్డ ఎక్కడుందో చెప్పాలని నిలదీయగా వాస్తవాన్ని వెల్లడించింది. పోలీసులు ఘటనాస్థలంలో తవ్విచూడగా మృతదేహం లభ్యమైంది. విచారణ చేపట్టిన పోలీసులు తల్లిదండ్రులే ఆ చిన్నారిని హతమార్చారని తేల్చారు. ఛత్రియ, హేతురాంను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా