నిట్‌లో ఎంటెక్‌ విద్యార్థి ఆత్మహత్య

20 Jun, 2018 09:06 IST|Sakshi
 మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఇన్‌స్పెక్టర్‌ అజయ్‌

1.8కే అల్ట్రా మెగా హాస్టల్‌లో ఘటన

ఉలిక్కిపడిన విద్యార్థులు

విచారణ చేపట్టిన కాజీపేట పోలీసులు

ఎంజీఎం మార్చురీకి మృతదేహం తరలింపు

కాజీపేట అర్బన్‌: వరంగల్‌ నిట్‌లోని ఓ హాస్టల్‌లో మంగళవారం ఎంటెక్‌ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాజీపేట ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌.అజయ్, సహచర విద్యార్థుల కథనం ప్రకారం.. నిట్‌లో ఎంటెక్‌ మొదటి సంవత్సరంలో త్రిపుల్‌ఈ విభాగంలోని పవర్‌సిస్టం ఇంజినీరింగ్‌ చదువుతున్న అమిత్‌కుమార్‌(31) 1.8కె అల్రామె గా హాస్టల్‌లోని ఎ8–27గదిలో ఉంటున్నాడు.

రెండు రోజుల నుంచి తన తండ్రికి ఫోన్‌లో అందు బాటులోకి రాలేదు. దీంతో అమిత్‌కుమార్‌ పక్క గదిలో ఉంటున్న మిత్రుడు రాహుల్‌కు ఉదయం 11 గంటలకు శంకర్‌ ప్రసాద్‌ ఫోన్‌ చేసి అమిత్‌ను ఓసారి మాట్లాడించమని తెలిపాడు. దీంతో రాహుల్‌తో పాటు మరికొందరు విద్యార్థులు అమిత్‌ గది వద్దకు వెళ్లారు. తలుపు తట్టగా తలుపు లోపల గడియ పెట్టి ఉంది.

దీంతో విద్యార్థులు బలవంతంగా తలుపులు తెరచి చూసే సరికి సీలింగ్‌ ఫ్యాన్‌కు టవల్‌తో అమిత్‌కుమార్‌ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో విద్యార్థులు నిట్‌ యాజమాన్యానికి, కాజీపేట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని అమిత్‌కుమార్‌ మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. కాగా పోలీసులు అమిత్‌కుమార్‌ ఆత్మహత్య విషయం తల్లిదండ్రులు శంకర్‌ప్రసాద్, లలితాదేవికి తెలిపారు. దీంతో వారు హుటాహుటిన బీహార్‌ నుంచి వరంగల్‌కు బయలుదేరారు. 

మానసిక ఒత్తిడితోనేనా? 

అమిత్‌కుమార్‌ ఎంటెక్‌ సెమిస్టర్‌ పరీక్షలో ఫెయిల్‌ అయినందు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. డిసెంబర్‌లో జరిగిన సెమిస్టర్‌ పరీక్షల్లో నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్‌ కాగా జూన్‌లో నిర్వహించిన పరీక్షల్లో ఉతీర్ణత సాధించాడు. కాగా మొదిటి సెమిస్టర్‌లో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు తాత్కాలికంగా స్టైఫండ్‌ను నిలిపివేస్తారు. దీంతో మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పలువురు అనుమానిస్తున్నారు.


 

మరిన్ని వార్తలు