ముజఫర్‌నగర్‌ అల్లర్ల కేసు : బీజేపీ నేతలకు వారెంట్లు

16 Dec, 2017 19:08 IST|Sakshi

యూపీ మంత్రి సురేశ్‌ రాణా, కేంద్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యేలకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు

నాటి ఘటనలో 60 హత్యలు, నిరాశ్రయులైన 40వేల మంది..

ముజఫర్‌నగర్‌ : ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైన ముజఫర్‌నగర్‌ అల్లర్ల కేసుల్లో అధికార బీజేపీకి చెందిన కీలక సభ్యులకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు జారీ అయ్యాయి. వారిలో ఉత్తరప్రదేశ్‌ కేబినెట్‌లో మంత్రిగా కొనసాగుతోన్న సురేశ్‌ రాణా, కేంద్ర మాజీ మంత్రి సంజీవ్‌ బల్యాన్‌, ఎమ్మెల్యేలు సంగీత్‌ సోమ్‌, ఉమేశ్‌ మాలిక్‌ తదితరులున్నారు. 2013 ఆగస్టు-సెప్టెంబర్‌లో జరిగిన ముజఫర్‌నగర్‌ అల్లర్లలో అధికారిక లెక్కల ప్రకారం 60 మంది ప్రాణాలు కోల్పోగా, 40 వేల మంది నిరాశ్రయిలయ్యారు.

రెచ్చగొట్టి.. ఉసిగొలిపారు : పైన పేర్కొన్న బీజేపీ నాయకులు.. ముజఫర్‌నగర్‌లో ఒక వర్గానికి చెందిన యువతను హింసకు పురిగొల్పేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, నిషేధాజ్ఞలు ఉల్లంఘించడమే కాక ప్రభుత్వ సిబ్బంది విధులకు ఆటంకం కల్పించారని అల్లర్లపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఆరోపించింది. సిట్‌ వాదనతో ఏకీభవించిన మెజిస్ట్రేట్‌ మధు గుప్తా.. నిందితులు జనవరి 19న కోర్టుకు హాజరుకావాలని నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేశారు.  

ప్రజా ప్రతినిధులు కావడంతో : ముజఫర్‌నగర్‌ అల్లర్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నాయకుల్లో అత్యధికులు ప్రస్తుతం చట్టసభ్యులుగా కొనసాగుతున్న దరిమిలా వారిని విచారించేందుకు ప్రభుత్వ అనుమతి తప్పనిసికావడంతో సీఎం యోగి అంగీకరించారు. ప్రభుత్వ అనుమతి లభించిన దరిమిలా సదరు నేతల విచారణ ప్రక్రియ ముమ్మరం కానుంది.

నాన్‌బెయిలబుల్‌ వారెంట్లు జారీ అయిన బీజేపీ ప్రముఖుల్లో కొందరు..

 

మరిన్ని వార్తలు