మద్యంమత్తులో తల్లిని కడతేర్చిన కొడుకు

9 May, 2020 11:05 IST|Sakshi
నిందితుడు అశోక్‌

కరోనా భృతి డబ్బులు ఇవ్వాలని వాగ్వాదం

నిరాకరించడంతో హత్య

బొంరాస్‌పేట: మద్యంమత్తులో కన్నతల్లిని కు మారుడు హతమార్చిన సంఘటన బొంరాస్‌ పేట మండలం దుద్యాల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గడ్డం అంజిలమ్మ (55), ఈశ్వరయ్యకు ఒకడే కుమారుడు అశోక్‌. తండ్రి గతంలోనే మృతిచెందగా కుమారుడిని తల్లి పెంచి పెద్ద చేసింది. అశోక్‌కు ఇద్దరు భార్యలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మేస్త్రీ పని చేస్తూ అందతా తాగుడుకే వెచ్చించాడు. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోవడంతో ఖర్చుల కోసం అప్పులు చేస్తున్నాడు.

అతడిని తల్లి అంజిలమ్మ, భార్య మందలించింది. పని లేకపోవడంతో పేకాటకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో పేకాట,తన తాగుడు కోసం డబ్బులు ఇవ్వాలని కుటుంబసభ్యులతో గొడవపడుతున్నాడు. గురువారం మొదటి భార్య మొగులమ్మ, తల్లి అంజిలమ్మతో గొడవపడ్డాడు. భయపడిన భార్య తన పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లింది. అనంతరం సాయంత్రం మద్యం తాగి అశోక్‌ ఇంటికిచేరుకున్నాడు. తల్లితో తాగుడు కోసం కరోనా భృతి కింద వచ్చిన నగదు ఇవ్వాలని గొడవపడ్డాడు. ఆమెపై చేయి చేసుకున్నాడు. కొద్దిసేపటికి తల్లి కి మద్యం తాపించి నిద్రపుచ్చాడు. ఆ మద్యంమత్తులో అశోక్‌ గురువారం రాత్రి తల్లి గొంతు నులిమి హత్య చేశాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ శ్రీనివాస్, పరిగి, కొడంగల్‌ సీఐలు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేశారు. పంచనామా చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కొడంగల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎస్‌ఐ వెంకటశ్రీను తెలిపారు.నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

మరిన్ని వార్తలు