కరోనా వ్యాక్సిన్‌ ‘రెడీ టూ యూజ్‌’ : రష్యా మంత్రి

21 Jul, 2020 20:27 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

రెండవ దశ పరీక్షలు విజయవంతం

త్వరలోనే మూడవ దశ పరీక్షలు

ధృవీకరించని రక్షణ మంత్రిత్వ శాఖ

మాస్కో: కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో వేగంగా కదులుతున్న రష్యా మరో  కీలక విషయాన్ని ప్రకటించింది.  తమ దేశానికి చెందిన కోవిడ్-19 తొలి వ్యాక్సిన్‌ వాడకానికి వచ్చే నెలలోనే సిద్ధంగా ఉంటుందని ఉప రక్షణ మంత్రి రుస్లాన్ సాలికోవ్‌ ప్రకటించారు. మాస్కోకు చెందిన వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాలికోవ్ ఈ విషయం చెప్పారని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. 

తమ వ్యాక్సిన్‌కు సంబంధించిన మొదటి, రెండు దశల క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి చేశామని సాలికోవ్‌  తెలిపారు.  ముఖ్యంగా రెండవ దశ పరీక్షలు విచారణ సోమవారం ముగిసాయనీ,  వీరందరూ కరోనావైరస్ నుండి రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటున్నారని, త్వరితంగా కోలుకుంటున్నారని వెల్లడించారు. మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ను వేలాదిమందిపై త్వరలోనే నిర్వహించనున్నట్టు తెలిపారు. అయితే ఎపుడు మొదలుపెట్టేదీ, టీకా ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభమయ్యేదీ ఆయన స్పష్టంగా ప్రస్తావించలేదు. మరోవైపు సాలికోవ్ చేసిన వాదనను రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ధృవీకరించలేదు. వ్యాక్సిన్ పరీక్షలు కొనసాగుతున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించినట్టు మరో నివేదిక ద్వారా తెలుస్తోంది. 

కాగా మాస్కోలోని ప్రభుత్వ సంస్థ గమలేయ ఇన్స్‌స్టిట్యూట్‌ అండ్‌ రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్ (ఆర్‌డీఐఎఫ్) సహకారంతో  కరోనావైరస్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు రష్యన్‌ ఆర్మీ ఇటీవల ప్రకటించింది. రష్యా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో వేలాది మంది వాలంటీర్లతో దశ-3 మానవ క్లినికల్ ట్రయల్స్ ఆగస్టు 3న ప్రారంభం కానున్నాయనీ, టీకా పంపిణీ సెప్టెంబరు నాటికి ప్రారంభమవుతుందని (ఆర్‌డీఐఎఫ్) అధినేత కిరిల్ దిమిత్రోవ్‌ గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దిమిత్రోవ్‌ ప్రకారం, దేశీయంగా 30 మిలియన్ మోతాదులను,  అంతర్జాతీయంగా170 మిలియన్లను తయారు చేయనుంది. వ్యాక్సిన్‌ తయారీకి ఐదు దేశాలు అంగీకారం తెలిపాయి.

మరిన్ని వార్తలు