మొక్కు'బడి విలువలు'

27 Jan, 2018 12:04 IST|Sakshi

ఇంటర్‌లో పాఠ్యాంశంగా నైతికత– మానవ విలువలు

27న నైతికవిలువలు, 29న పర్యావరణంపై పరీక్ష

పరీక్షకు హాజరు కానున్న 53,713 ఫస్టియర్‌ విద్యార్థులు

ఈ ఏడాది జంబ్లింగ్‌లో మూల్యాంకనం

రాయవరం (మండపేట): నేటి ఆధునిక సమాజంలో నైతికత–మానవ విలువలు, పర్యావరణ విద్య ప్రాధాన్యత అంశాలుగా గుర్తించి ఇంటర్‌ విద్యలో పాఠ్యాంశంగా చేర్చారు. ఏటా ఈ అంశాలపై నిర్వహిస్తున్న పరీక్షల తీరు మొక్కుబడిగా మారిపోతోందనే విమర్శలున్నాయి. చాలా కళాశాలల్లో ఈ అంశాలపై బోధన మాటే ఉండడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇవ్వకుండానే పరీక్షలు నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఏడాది విద్యాశాఖ పలు సంస్కరణలకు చర్యలు తీసుకుంటున్నా.. అవి ఎంత వరకు సఫలం అవుతాయన్నది ప్రశ్నార్థ్ధకమే.

నైతిక విలువల సుగంధాలను అద్దేందుకే..
పెరిగి పోతున్న పాశ్చాత్య పెడ ధోరణుల్లో విద్యార్థి లోకానికి నైతిక విలువల సుగంధాన్ని అందించేందుకు రాష్ట్ర మానవ వనరుల శాఖ 2015 నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులకు ‘నైతికత–మానవ విలువలు’, పర్యావరణం అనే పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టారు. ఈ నెల 27న నైతిక, మానవ విలువలు, 29న పర్యావరణ విద్యపై పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.


పరీక్ష పాసై తీరాలి...
ఇంటర్‌ ఫస్టియర్‌లో ప్రవేశ పెట్టిన ఈ పరీక్షలో విద్యార్థి ఉత్తీర్ణత కాకుంటే ఇంటర్‌ తప్పినట్లుగా పరిగణిస్తారు. అయితే మార్కులను పరిగణనలోనికి తీసుకోరు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు ఆయా సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులైనా ‘నైతికత–మానవ విలువలు’, ‘పర్యావరణ విద్య’ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులు కాకపోతే మార్కుల జాబితాను అందజేయరు. జిల్లాలో 43 ప్రభుత్వ, 18 ఎయిడెడ్, 237 ప్రెవేటు జూనియర్‌ కళాశాలల్లో 53,713 మంది ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

పాఠ్యప్రణాళికలో దక్కని చోటు..
ఇంటర్‌లో పర్యావరణ విద్య, నైతికత–మానవ విలువలును పాఠ్యాంశంగా 2015 నుంచి అమలు చేస్తున్నారు. ఈ అంశాలను పాఠ్య ప్రణాళికలో మాత్రం చేర్చకుండా ఇంటర్‌బోర్డు విస్మరిస్తోంది. ఏటా ఈ అంశాలపై పరీక్షలను ఫస్టియర్‌ విద్యార్థులకు నిర్వహిస్తున్నా.. పాఠ్య ప్రణాళికలో చోటు కల్పిద్దామన్న ఆలోచన విద్యాశాఖకు ఉండడం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి.

మొక్కుబడిగా పరీక్షలు..
పాస్‌ మార్క్‌ వస్తే చాలని, ఇంటర్‌ మార్కులకు వీటిని కలపక పోవడంతో ఈ సబ్జెక్టును కేవలం మొక్కుబడిగానే పరిగణిస్తున్నారు. ఈ పరీక్షలను ఏ కళాశాలలో చదివే విద్యార్థులకు ఆ కళాశాలలోనే నిర్వహిస్తున్నారు. దీని వల్ల కళాశాలల్లో చూచిరాతలు కొనసాగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. వీటిని ప్రాధాన్యం లేని పరీక్షలుగా పలు ప్రైవేటు యాజమాన్యాలు కొట్టి
పారేస్తున్నాయి.

ఉత్తీర్ణత తప్పనిసరి..
100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 60 మార్కులకు నిర్వహించే ప్రశ్నా పత్రంలో ఐదు కేటగిరీల్లో ఒక్కో దానికి 15  మార్కులు చొప్పున ఐదు ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది. వీటితో పాటు సుమారుగా 15 ప్రాజెక్టులు ఉంటాయి. వీటిలో నచ్చిన ప్రాజెక్టును ఎంపిక చేసుకుని పూర్తి చేయాలి. రాత పరీక్షకు 60  మార్కులు, వ్యక్తిగత ప్రాజెక్టుకు 20, గ్రూపు ప్రాజెక్టుకు 20మార్కులు ఉంటాయి.

మరిన్ని వార్తలు