ఎందుకీ రచ్చ?!

22 May, 2019 00:07 IST|Sakshi

ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే రోజు దగ్గరపడుతున్నకొద్దీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో దిగులు, ఆందోళన పెరుగుతున్నాయి. గత నెల 11న పోలింగ్‌ పూర్తయ్యాక ఆ రాష్ట్ర రాజధాని అమరావతిలో కంటే వేరే రాష్ట్రాల రాజధానుల్లో ఆయన ఎక్కువగా కనబడుతున్నారు. మధ్యమధ్యలో దేశ రాజధాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈవీఎంలపైనా, వాటికి జతచేసే ఓటరు రశీదు యంత్రాల(వీవీ ప్యాట్‌ల)పైనా అపనమ్మకం కలగజేయడం, ఆ రకంగా మొత్తం ఎన్నికల ప్రక్రియపై సందేహాలు రేకెత్తించడం చంద్రబాబు ధ్యేయమని ఆయన తీరు గమనిస్తే అర్ధ మవుతుంది. బాబు ఎందుకిలా చేస్తున్నారన్నది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకూ చాన్నాళ్లక్రితమే తెలుసు. ఆదివారం ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు వెల్లడయ్యాక వేరే రాష్ట్రాలవారికి కూడా ఆ సంగతి తెలిసిపోయింది.

ప్రజా తీర్పు తనకు అనుకూలంగా ఉండే అవకాశం లేదని నిర్ధారణ కావడం వల్లనే ఆయన దీన్నొక సమస్యగా మార్చి, నెపాన్ని ఈవీఎంలపై వేయదల్చుకున్నారని ఆయనతో ఈమధ్య అంటకాగుతున్న పార్టీల నేతలు సైతం గుర్తించారు. అందుకే ప్రధాన పక్షాలైన కాంగ్రెస్, తృణ మూల్‌ కాంగ్రెస్, ఎస్‌పీ, బీఎస్‌పీ, డీఎంకే, జేడీ(ఎస్‌) సారథులెవరూ మంగళవారం ఆయనతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు పోలేదు. తమ తమ ప్రతినిధులను మాత్రమే పంపారు. 50 శాతం వీవీ ప్యాట్‌లను లెక్కించాలన్న తన డిమాండ్‌కు అటు ఎన్నికల సంఘం దగ్గరా, ఇటు సుప్రీం కోర్టులోనూ చుక్కెదురవడంతో చంద్రబాబు దాన్ని కాస్త మార్చారు. చివరి రౌండులో కాకుండా మొదటే అయిదు ఈవీఎంలనూ, వాటితో అనుసంధానించి ఉండే వీవీ ప్యాట్‌ల రశీదులనూ సరిపో ల్చాలని... వ్యత్యాసం బయటపడినపక్షంలో మొత్తం ఈవీఎంలనూ, వాటి వీవీ ప్యాట్‌ రశీదులను లెక్కించాలని కొత్త డిమాండు తీసుకొచ్చారు. ఇదే విషయమై మంగళవారం దాఖలైన పిటిషన్‌లను అటు సుప్రీంకోర్టులోనూ, ఇటు ఏపీ హైకోర్టులోనూ ధర్మాసనాలు తోసిపుచ్చాయి.

ఎన్నికల ప్రక్రియ విషయంలోనూ, ఈవీఎంల పనితీరుపైనా సందేహాలుండటాన్ని, వాటిపై స్పష్టత కావాలని అడగటాన్ని తప్పుబట్టనవసరం లేదు. కానీ ఆ సందేహాలకు నిర్దిష్టమైన ప్రాతి పదిక ఉండాలి. వాటికి ఎన్నికల సంఘం సహేతుకమైన వివరణనివ్వడంలో విఫలమైతే రచ్చ చేసినా, న్యాయస్థానాలను ఆశ్రయించినా అర్ధముంటుంది. దేశవ్యాప్తంగా ఏడు దశలుగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ జరిగింది. వాటిలో కోట్లాదిమంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించు కున్నారు. అన్ని పార్టీలూ వేలాదిమంది అభ్యర్థులను బరిలో నిలిపాయి. ఈ పార్టీల ప్రధాన నాయ కులుగానీ, వారి అభ్యర్థులుగానీ, కార్యకర్తలుగానీ, సాధారణ పౌరులుగానీ ఎవ్వరూ తాము వేసిన ఓటు వేరే పార్టీకి పోయిందని ఫిర్యాదు ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్‌లో సైతం ఒక్క చంద్రబాబు  మాత్రమే తన ఓటు టీడీపీకే పడిందో లేదోనన్న సందేహం వ్యక్తం చేశారు. వీవీ ప్యాట్‌లో సరిచూసు కున్నాకనే ఆయన ఈ మాట అన్నారో లేదో తెలియదు. చిత్రమేమంటే ఈమధ్య చంద్రబాబుతో పాటు ప్రతిచోటకూ ఊరేగింపుగా వెళ్తున్న ఏ రాజకీయ పక్షమూ విడిగా ఈవీఎంలపై సందేహాలు వ్యక్తం చేయడంలేదు. కేవలం ఆయన వచ్చినప్పుడు మాత్రమే వీటికి ఇదొక సమస్యగా కనబడు తోంది.

ఆయనతోపాటు ఎన్నికల సంఘాన్ని కలవడానికి వెళ్తున్నారు. బయటికొచ్చి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్నారు. ఇంతమంది తన వెనక వస్తున్నారని చెప్పుకోవడానికి, తాను జాతీయ స్థాయిలో అందరినీ కూడగడుతున్నానని చెప్పుకోవడానికి చంద్రబాబుకు ఇదంతా ఉపయోగపడుతుంది. ఓటమి ఖాయమయ్యాక జాతీయ స్థాయిలో కాలక్షేపం చేయడానికి  ఇది తోడ్పడుతుంది. కానీ ఆ బృందంలోని ఇతర పార్టీల సంగతేమిటి? ఈ పార్టీల్లో కొన్ని వివిధ రాష్ట్రాల్లో అధికారం చలాయిస్తున్నాయి. మరికొన్నిచోట్ల అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తు న్నాయి. మరి ఆ పార్టీలు కేవలం చంద్రబాబు వచ్చినప్పుడు తప్ప ఇతర సమయాల్లో ఈవీఎంల గురించి ఎందుకు మాట్లాడవు? ఎందుకు ఉద్యమించవు? ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చి ఈవీఎంల విశ్వసనీయతను ఎందుకు నిర్ధారించుకోవు? ఆ పార్టీలకు ఈవీఎంలు కొంపముంచు తాయన్న భయాందోళనలు లేవా? ఉన్నా చంద్రబాబు ఆసరా లేనిదే మాట్లాడలేవా? ఏ రాజకీయ పార్టీనైనా వాటి విధానాలు, ఆచరణ చూసి జనం ఆదరిస్తారు. కనీసం ఈవీఎంలపై తమ వైఖరే మిటో స్పష్టంగా చెప్పలేని పార్టీలకు అసలు ఓటడిగే హక్కుంటుందా? ఇది తమ నైతికతకు కూడా పరీక్షని ఆ పార్టీలు ముందుగా గుర్తించాల్సి ఉంది. 

ఒక్కో అసెంబ్లీ స్థానంలో అయిదు ఈవీఎంలను ఎంపిక చేసి, వాటిల్లో వచ్చిన ఓట్లను వాటికి అనుసంధానించి ఉన్న వీవీ ప్యాట్‌లలోని రశీదులతో సరిపోల్చి చూడాలని గత నెలలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 50శాతం ఈవీఎంలను ఇలా సరిపోల్చాలన్న రాజకీయ పక్షాల వాదన సరికాదని తేల్చింది. దానిపై దాఖలైన రివ్యూ పిటిషన్‌ను ఈ నెల 7న తోసిపుచ్చింది. సాధారణంగా అయితే అక్కడితో ఆ సమస్యకు ముగింపు పలకాలి. ముందూ మునుపూ కొత్తగా ఏమైనా బయటపడితే వాటిని సుప్రీంకోర్టు దృష్టికి, ఎన్నికల సంఘం దృష్టికి తీసుకుపోవచ్చు. న్యాయం కోరవచ్చు. కానీ అందుకు భిన్నంగా విపక్షాలు వ్యవహరిస్తున్నాయి. చంద్రబాబు చెప్పినదానికల్లా గంగిరెద్దుల్లా తలలు ఆడిస్తున్నాయి. ఆయన కోరుతున్న డిమాండ్లలోని సహేతుకత ఏమిటో, దానికి తాము వంత పాడటం సరైందో కాదో కాస్తయినా అవి ఆలోచించుకోవడం లేదు. ఈ క్రమంలో తమ పరువు బజారున పడుతోందని గుర్తించడం లేదు. ఈవీఎంలు ఉనికిలోకొచ్చాక కాంగ్రెస్‌ వరసగా పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉంది. గత రెండేళ్లుగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో అధికారం లోకొచ్చింది. ఇతర పార్టీల సంగతలా ఉంచి ఆ పార్టీకైనా ఇంగితజ్ఞానం ఉన్నట్టు కనబడటం లేదు. ఇలా స్వప్రయోజనాలకోసం ఇష్టానుసారం మాట్లాడటం, వ్యవస్థలపై అనుమానాలు రేకెత్తించడం బాధ్యతారాహిత్యమవుతుందని కాంగ్రెస్, దాంతోపాటు ఇతర పార్టీలు గుర్తించడం మంచిది.

మరిన్ని వార్తలు