వదంతుల మహమ్మారి

14 May, 2020 23:56 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాధారణ సమయాల్లోనే వెనకా ముందూ చూడకుండా వదంతులు వ్యాప్తి చేసే దురలవాటున్న వారు విపత్కర పరిస్థితుల్లో ఆ దుర్గుణాన్ని విడిచిపెడతారనుకోవడం భ్రమ. కరోనా మహమ్మారిపై ప్రభుత్వాలు, పౌరులు తమ శక్తికొద్దీ పోరాడుతున్న వర్తమానంలో... ఇదే అదనుగా కొందరు ఉన్మాదులు సమాజంలో వదంతులు వెదజల్లుతున్నారు. విద్వేషాలను పెంచి పోషిస్తున్నారు. ఇది ఏ ఒక్క దేశానికో, రాష్ట్రానికో పరిమితమై లేదు. ప్రపంచవ్యాప్తంగా అన్నిచోట్లా ఈ జాడ్యం వ్యాపిం చింది. చెప్పాలంటే ఇది కరోనాను మించిన మహమ్మారిగా మారింది.

కనుకనే ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ సైతం దీన్ని తీవ్రంగా పరిగణించి స్పందించి, ఈ ధోరణి విషయంలో ప్రభుత్వాలన్నీ అప్రమత్తంగా వుండి అదుపు చేయాలని సూచించారు. సమాజంలో బలహీనవర్గాలవారు, మైనారిటీలు, మహిళలు ఈ వదంతులకు చాలాసార్లు లక్ష్యంగా మారు తుంటారు. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కూడా కొందరు దుండగులు వదల్లేదు. ఆయన ఆరోగ్యంపై దుష్ప్రచారానికి పూనుకున్నారు. చివరకు తాను క్షేమంగా వున్నానని స్వయంగా అమిత్‌ షాయే చెప్పాల్సివచ్చింది.
(చదవండి: దేశీ టెస్టింగ్‌ పరికరం లాంచ్‌)

తొలిసారి లాక్‌డౌన్‌ విధించినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి మాట్లాడుతూ వదంతుల అంశాన్ని కూడా ప్రస్తావించారు. ప్రామాణికమైన మాధ్యమం నుంచి లేదా అధికారిక వర్గాలనుంచి వస్తే తప్ప దేన్నీ నమ్మరాదని హితవు చెప్పారు. ఉన్నత స్థాయి లోనివారు స్పందిస్తున్నారంటే ఇదెంత ముదిరిపోయిందో సులభంగానే అంచనా వేసుకోవచ్చు. కనుకనే  వదంతుల కట్టడికి చర్యలు తీసుకోబోతున్నట్టు ట్విట్టర్‌ ప్రకటించింది. గూగుల్, ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సాప్‌ వంటివి ఇప్పటికే తప్పుడు వార్తలను, వదంతులను అడ్డుకోవడానికి కొన్ని సాంకేతికతను అమల్లోకి తీసుకొచ్చాయి. అయితే వాటివల్ల పెద్దగా ఫలితం వుండటం లేదు. 

కొన్ని జాగ్రత్తలు పాటిస్తే, ముందుగా గుర్తించి చికిత్స తీసుకుంటే కరోనా వ్యాధి నుంచి బయ టపడొచ్చు. వ్యాధిగ్రస్తుల్ని వేరుచేసి చికిత్స అందించడంద్వారా వారి నుంచి ఎవరికీ వ్యాపించకుండా చూడవచ్చు. కానీ వదంతులతో సమాజంలో పరస్పర వైషమ్యాలు పెంచాలని చూసేవారు మన తోనే, మనమధ్యనే వుంటారు. చాలాసార్లు అనేకమంది అమాయకులు తమకు తెలియకుండానే వారిలో ఒకరిగా మారుతారు. ఏదో పెను ముప్పు ముంచుకొస్తున్నదని నిజంగానే నమ్మి తమ కొచ్చిన నకిలీ కథనాన్ని అందరికీ పంపుతారు. నిజానిజాలేమిటో నిర్ధారణయ్యేసరికి ఎంతో నష్టం జరిగిపోతుంది.

వదంతుల వెనక వాటివల్ల ప్రయోజనం పొందే అదృశ్యశక్తులు కూడా వుంటాయి. ఆ శక్తుల పనిపట్టకపోతే వదంతుల వ్యాప్తి ఆగదు. గత ఏడెనిమిదేళ్లుగా మన దేశానికి ఈ విషయంలో ఎన్నో చేదు అనుభవాలున్నాయి. ఢిల్లీ శివార్లలో అఖ్లాక్‌ అనే 52 ఏళ్ల వ్యక్తిని పశుమాంసం ఇంటికి తెచ్చుకున్నాడన్న కారణంతో ఊరంతా ఒక్కటై దాడిచేసి కొట్టి చంపిన ఘటన అయిదేళ్లక్రితం చోటుచేసుకుంది. ఆ తర్వాత ఒక దశలో అవి రివాజుగా మారాయి.

సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఇలాంటి వదంతులు వ్యాపింపజేసేవారిపైనా, మూక దాడులకు పాల్పడేవారిపైనా ఒక చట్టం చేయడం ఉత్తమమని కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చింది. ఇంతవరకూ అది సాకారం కాలేదు. సామాజిక మాధ్యమాల ద్వారా వదంతులు వ్యాప్తి అవుతున్న తీరు ఆందోళనకర స్థాయికి పెరిగి పోయింది. అవి నిజమో కాదో తెలుసుకునే ఓపిక కూడా లేకుండా ఎవరికి వారు వాటిని అందరికీ పంపే తీరువల్ల ఎన్నో సమస్యలొస్తున్నాయి. అస్సాంలో బయల్దేరిన వదంతుల కారణంగా ఆరేళ్ల క్రితం పలు జిల్లాల్లో బోడోలకూ, మైనారిటీ వర్గాలకూ మధ్య ఘర్షణలు చెలరేగి ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఇళ్లకు నిప్పెట్టడంతో వందలాదిమంది నిరాశ్రయులయ్యారు. 

కరోనా మహమ్మారి చుట్టుముట్టాక వదంతులు, తప్పుడు వార్తలు గతంతో పోలిస్తే మరింత పెరిగాయి. బహుశా లాక్‌డౌన్‌ కారణంగా ఈ దుండగులకు కావలసినంత తీరుబడి లభించడం ఒక కారణం కావొచ్చు. మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో ఇద్దరు సాధువులను, వారితో వున్న డ్రైవర్‌ను జనం కొట్టి చంపారు. అలా కొట్టేముందు కనీసం వారెవరో, ఎక్కడినుంచి ఎటు వెళ్తున్నారో తెలుసు కోవడం...ఆ సమాచారం సరైందో కాదో నిర్ధారించుకోవడం వంటివి చేయాలన్న స్పృహ కూడా లేనంత ఉన్మాదంలో వారు కూరుకుపోయారు.

చిత్రమేమంటే అక్కడే వున్న పోలీసులు ఆ ముగ్గురినీ కాపాడే ప్రయత్నం చేయడం మాట అటుంచి, స్వయంగా వారే దుండగులకు అప్పజెప్పారు. లాక్‌డౌన్‌ కారణంగా స్వస్థలాలకు పోతున్నవారిలో కొందరు పిల్లల్ని అపహరిస్తున్నారన్న వదంతి వాట్సాప్‌ మాధ్యమంలో వ్యాపించడం ఇందుకు కారణం. పహారా కాస్తున్న గ్రామస్తులు వీరి వాహనం చూసి కిడ్నాపర్లే అనుకుని ఈ దారుణానికి పాల్పడ్డారు. తబ్లిగీ జమాత్‌కు హాజరైనవారి వల్ల దేశంలో అక్కడక్కడా వ్యాధి వ్యాపించిన తీరు చూసి మొత్తం ముస్లిం సమాజాన్ని తప్పుబడుతూ అనేకులు మార్ఫింగ్‌ ఫొటోలు, విదేశాల్లో తీసిన వీడియోలు, మన దేశానికి సంబంధించిన పాత వీడియోలు ప్రచారంలో పెట్టి విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు.

గల్ఫ్‌ దేశాల్లో నిరసనలు రావడం మొదలయ్యాక, స్వయానా నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని మతాలకూ, ప్రాంతాలకూ ముడిపెట్టడం సరైందికాదని చెప్పాక దీనికి బ్రేక్‌ పడింది. ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ కూడా గత నెల 26న దీనిపై మాట్లాడారు. వ్యక్తులపరంగా జరిగిన పొరపాటును సమూహానికి ఆపా దించడం వల్ల సమాజం దెబ్బతింటుందని హెచ్చరించారు. కరోనాపై అపోహలు వ్యాపించి వ్యాధి గ్రస్తుల కుటుంబాలకు సమస్యలు సృష్టిస్తున్నాయి. దీన్ని చూస్తూ ఊరుకోవడం సరికాదు. వదంతుల వ్యాప్తిని, తప్పుడు వార్తల వ్యాప్తిని అరికట్టేందుకు...మూకదాడులను అడ్డుకునేందుకు ఇకనైనా సమగ్రమైన చట్టం తీసుకురావాల్సిన అవసరం వుంది.
(చదవండి: కరోనా : ట్విటర్‌ సంచలన నిర్ణయం)

మరిన్ని వార్తలు