కష్టాల్లో ‘మెట్రో రైలు’

19 Sep, 2014 00:36 IST|Sakshi
కష్టాల్లో ‘మెట్రో రైలు’

అవసరాల కోసం జంటనగరాల జనం తన దగ్గరకు రావడం కాక... రద్దీగా ఉండే రోడ్లపైకి తానే వెళ్లి జనం అవసరాలు తీర్చేలా ముస్తాబవుతున్న ప్రతిష్టాత్మక మెట్రో రైలు ప్రాజెక్టు ఉన్నట్టుండి పెను వివాదంలో చిక్కుకున్నది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు ప్రతీకగా, మహానగర ముఖ్య ప్రాంతాలన్నిటినీ ఒరుసుకుంటూ సాగిపోయేలా డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టుపై అడపా దడపా ఏవో కథనాలు రావడం, వాటికి ఆ సంస్థనో, ప్రభుత్వమో వివరణలివ్వడం పాత కథే. కానీ, ఇప్పుడు మీడియాలో వెలువడిన కథనాలు అలాంటివి కాదు.
 
ప్రాజెక్టు నుంచి ఎల్ అండ్ టీ మెట్రో రైలు సంస్థ వైదొలగేందుకు సిద్ధమవుతున్నదని, దానిని మీరే చేపట్టుకోండంటూ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసిందని ఆ కథనాల సారాంశం. ప్రాజెక్టు పనుల్లో తమకు ఎదురవుతున్న అనేకానేకా ప్రతిబంధకాలను ప్రస్తావించడంతో ఊరుకోక రాష్ట్ర విభజనానంతరం హైదరాబాద్ ప్రాధాన్యంలో మార్పు వచ్చిందంటూ ఆ లేఖ అభిప్రాయపడిందని తాజా కథనాలు పేర్కొనడంతో వివాదం పతాక స్థాయికి చేరుకున్నది. తమ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ కథనాలు వెలువడ్డాయని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అంటున్నారు.
 
కథనాల వెనక దురుద్దేశాలు, కుట్రల ఆరోపణల సంగతలా ఉంచి ఎల్ అండ్ టీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాయడమైతే వాస్తవమని ఆ సంస్థ సీఈఓ వి.బి. గాడ్గిల్ అంగీకరించారు. ప్రాజెక్టుకు సంబంధించి రాస్తున్న లేఖల పరంపరలో ఇది కూడా భాగమని ఆయన ఉవాచ. భారీ ప్రాజెక్టు గనుక ఏవో సమస్యలొస్తుంటాయని కూడా ఆయన చెబుతున్నారు. పూర్తయ్యేసరికి సుమారు రూ. 14,000 కోట్లు ఖర్చుకాగలదని అంచనాలున్న ఈ ప్రాజెక్టు భారీ స్థాయిదే. దీనిపై ఇప్పటికే దాదాపు రూ. 5,000 కోట్లు ఖర్చుచేసినట్టు ఎల్ అండ్ టీ సంస్థ  చెబుతున్నది. గాడ్గిల్ అన్నట్టు ప్రాజెక్టు ఇంత బృహత్తరమైనది కనుక సమస్యలొస్తాయన్న మాట కూడా వాస్తవమే. కానీ, ఈ వివాదాల పరంపరకు ఎక్కడో అక్కడ, ఏదో ఒక దశలో ముగింపు ఉండాలి కదా! ఆ విషయంలో ఇటు ఎల్ అండ్ టీ సంస్థకు... అటు ప్రభుత్వానికి అంత పట్టింపు ఉన్నట్టు కనబడదు.
 
సరిగదా మధ్యమధ్య లీకులివ్వడం, ఆనక దానిపై మౌనంగా ఉండటం సర్వసాధారణమైంది. మెట్రో రైలు నిర్మాణం జంటనగరాల్లోని పలు చారిత్రక కట్టడాలను ధ్వంసం చేసేదిగా ఉన్నదని గతంలో మేథావులు కొందరు ఆందోళన వ్యక్తంచేశారు. రెండుచోట్ల భూగర్భ మెట్రో పనులు చేపడితే ఈ సమస్య పరిష్కారమవుతుందని మూడునెలల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో కేసీఆర్‌కు ఎల్ అండ్ టీ సంస్థ లేఖ రాసిందని, భూగర్భ మెట్రో తమ వల్ల కాదని చెప్పిందని లీకులు వెలువడటం తప్ప వివరణనిచ్చినవారు లేరు. ఇంత భారీ ప్రాజెక్టు విషయంలో జరుగుతున్నదేమిటో, చివరకు ఇది ఏమవుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తి, ఆత్రుత పౌరులకు ఉంటుంది. అలా తెలుసుకోవడం వారి హక్కు కూడా. పారదర్శకంగా వ్యవహరించి, అన్నిటినీ ప్రజలముందుంచితే ఇలాంటి కథనాలకు ఆస్కారం ఉండదు.
 
మెట్రో రైలు ప్రాజెక్టు ఒక్క హైదరాబాద్‌కో, తెలంగాణకో ప్రతిష్టాత్మకమైనది మాత్రమే కాదు...దేశానికే తలమానికమైనది. ప్రజారవాణా రంగంలో పీపీపీ పద్ధతిన దేశంలో చేపట్టిన తొలి ప్రాజెక్టు ఇది. కనుకనే ప్రాజెక్టుకు సారథ్యంవహిస్తున్న సంస్థ వ్యూహాత్మకంగానే కావొచ్చుగానీ... తప్పుకుంటాననడం అసాధారణమైన విషయం. ఎల్ అండ్ టీ సంస్థ ఈ విషయాన్ని సరిగా గుర్తించినట్టు లేదు. 2011నుంచీ ప్రభుత్వంతో తాము జరుపుతున్న సుదీర్ఘ ఉత్తరప్రత్యుత్తరాల్లో ఎన్నో విషయాలున్నాయని, అందులో ఇది కూడా ఒకటని గాడ్గిల్ చాలా అలవోకగా చెబుతున్నారు. మీడియాలో కథనాలు వెలువడటానికి ముందురోజు కూడా ఆయన ఒక కార్యక్రమంలో అరవై నెలల రికార్డు సమయంలో ఈ ప్రాజెక్టును పూర్తిచేయడమే లక్ష్యమని మాట్లాడారు. ప్రాజెక్టు పూర్తయ్యాక ఈ మహానగరం రూపురేఖలు ఎలా మారగలవో నోరూరేలా చెప్పారు.
 
ఒకపక్క విభజన తర్వాత హైదరాబాద్ ప్రాధాన్యం తగ్గిపోయిందని, యూటీ చేస్తారనుకున్నామని రహస్య లేఖలో రాసి బహిరంగంగా అందుకు భిన్నంగా మాట్లాడటంలోని ఉద్దేశమేమిటి? ఇంతకన్నా చిత్రమైన సంగతేమంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ఆ సంస్థ ఈ బాణీలోనే లేఖ రాసిందట. అయితే, అప్పుడు వైదొలగుతామనడానికి కారణాలు వేరు. ఇలా తరచు తప్పుకుంటామని లేఖలు రాయడం,  సందర్భానుసారం అందుకు ఏదో ఒక కారణం చూపడం నిర్మాణ రంగంలో అగ్రగామిగా ఉంటున్న ఎల్ అండ్ టీ వంటి సంస్థకు భావ్యమేనా? లేఖ రాయడం వెనకా, దాన్ని లీక్ చేయడం వెనకా ఎవరో ఉన్నారని కేసీఆర్ అన్నారంటే అందుకు తమ బాధ్యతారహిత ధోరణే కారణమని ఇప్పటికైనా సంస్థ గుర్తిస్తుందా? ఇంత బృహత్తరమైన ప్రాజెక్టు చేపట్టినప్పుడు భూసేకరణ దగ్గరనుంచి ఎన్నో సమస్యలు వచ్చిపడతాయి.
 
వాటి పరిష్కారంలో జాప్యం జరిగితే ఆ మేరకు ప్రాజెక్టు ఆలస్యమై దాని వ్యయం కూడా భారమవుతుంది. దీన్నెవరూ కాదనలేరు. అయితే, ఏ సమస్యనైనా సవ్యంగా పరిష్కరించుకోవడానికి కొన్ని మార్గాలంటూ ఉంటాయి. బాధ్యత గుర్తెరిగితే, చిత్తశుద్ధి ఉంటే అలాంటి మార్గాలను ఎన్నుకోవాలి. అంతేతప్ప వైదొలగుతామని లేఖలు రాయడం, వాటిని లీక్ చేయడం మంచిది కాదు. ప్రాజెక్టు రూపుదిద్దుకుంటున్న తీరు జంట నగరాల పౌరులకూ, ఇక్కడికి వచ్చిపోయేవారికి ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నది. కానీ, దానికి సమాంతరంగా ఈ బాపతు లేఖలు రాసి కలవరం సృష్టిద్దామనుకోవడం ఎవరికీ మంచిది కాదు.

మరిన్ని వార్తలు