నిర్లక్ష్యం... నిర్లిప్తత!

12 Feb, 2014 00:40 IST|Sakshi

 వచ్చే ప్రాణం... పోయే ప్రాణంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం చేయకతప్పని ఒక లాంఛనాన్ని మొత్తానికి అయిందనిపించింది. ఇన్నేళ్లూ ఎలావున్నా కనీసం పోయేముందైనా ఘనంగా కేటాయింపులు చేద్దామని, ప్రజల మెప్పుపొందుదామని పాలకులకు తోచలేదు. ఇది ఆర్నెల్లకాలానికి పనికొచ్చే అనామతు ఖాతాయే కదా అని సరిపెట్టుకుందామనుకున్న వారికైనా ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆర్ధిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మొక్కుబడిగా, నిర్లిప్తంగా తన పని ముగించారు. మూడు నాలుగు నెలల్లో ఎటు తిరిగీ కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. సమగ్రమైన బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. కనీసం అప్పటివరకైనా రైతులు, మహిళలు, విద్యార్థులు, బలహీనవర్గాలు, మైనారిటీలకు ఎంతో కొంత తోడ్పాటునందించడానికి... కొత్తగా ఏర్పడ బోయే ప్రభుత్వానికి మార్గనిర్దేశనం చేయడానికి ప్రయత్నిద్దామని ప్రభుత్వం అనుకోలేదు. లక్షా 83వేల 129 కోట్ల రూపాయలతో బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ కూడా కీలక రంగాలకు కేటాయింపులను తగ్గించేశారు. నిరుడు ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో పోలిస్తే రూ.20,000 కోట్లు ఎక్కువన్న మాటేగానీ అన్నిటికీ తిరుక్షవరం చేశారు. వాస్తవ ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే ఫీజు రీయింబర్స్ మెంటు, నీటిపారుదల, గృహ నిర్మాణంవంటి రంగాలన్నిటికీ భారీగా కోతలు పడ్డట్టే లెక్క. వ్యవసాయ అనుబంధ రంగాల వాటా నిరుటి బడ్జెట్‌లో 3.08 శాతం ఉండగా అది ఇప్పుడు 3.65 శాతంవద్దే ఆగిపోయింది. గత బడ్జెట్ సమయంలో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ అంటూ ఊదరగొట్టారు. అలా విడిగా చూపడానికి ప్రయత్నించినం దుకైనా రైతు కోసమంటూ అప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఈసారి దాన్ని సవరించుకుందామని, ఈ ఆఖరి క్షణంలోనైనా రైతులకు ఏదైనా చేద్దామని అనుకోలేదు. నిరుడు ‘మార్కెట్ ఆలంబన నిధి’ పేరిట వంద కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు ఆనం వారు ప్రతిపాదించారు. కనీసం రూ.3,000 కోట్లు అందుకోసం కేటాయిస్తే తప్ప రైతులకు ఒరిగేదేమీ ఉండదని వ్యవసాయ నిపుణులు అప్పట్లో చెప్పారు. కనుక అందుకోసం ఆ నిధికి ఈసారి కొద్దో గొప్పో కేటాయింపులు పెంచుతారని ఆశగా ఎదురుచూసినవారికి మంత్రి షాకిచ్చారు. అసలు దాని ఊసే లేకుండా చేశారు. అంతేనా...పంట రుణాల వడ్డీ చెల్లింపులకు గత బడ్జెట్‌లో కేటాయించిన మొత్తాన్నే ఈసారి యథాతథంగా ఉంచేశారు. జాతీయ పంటల బీమా పథకం గతి కూడా అంతే. పెరిగిన సాగు విస్తీర్ణాన్నీ, కేంద్రం పెంచిన ప్రీమియం మొత్తాన్నీ కూడా పరిగణనలోకి తీసుకోకుండా పాత అంకెల్నే మళ్లీ కొనసాగించారు.
 
 ఈ సర్కారుకు రైతులపైన మాత్రమే నిర్లక్ష్యం అనుకోనవసరం లేదు. మహిళా సంఘాలకు జీరో వడ్డీకి రుణాలు ఇస్తున్నామని ఒకపక్క వాణిజ్య ప్రకటనలు హోరెత్తిస్తూ అందుకోసం కేటాయించిన మొత్తం రూ. 650 కోట్లు మాత్రమే. ఈ కేటాయింపులోనూ నిరుడున్న మొత్తాన్ని కొనసాగించారు. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో ఆ పద్దుకింద బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తమే రూ. 1,400 కోట్లుకాగా ఇప్పుడీ మొత్తం ఏం సరిపోతుంది? పాత బకాయిలో తీరేది సగం కూడా ఉండదు. ఇక కొత్త రుణాలకు కట్టాల్సిన వడ్డీ మొత్తాన్ని ఎక్కడినుంచి తెస్తారు? సర్కారు నిర్వాకంవల్ల ఇప్పటికే బ్యాంకులు మహిళా సంఘాలకు అప్పులివ్వడానికి వెనకడుగేస్తున్నాయి. చాలాచోట్ల సంఘాల నుంచి అసలుతోపాటు వడ్డీ కూడా వసూలు చేస్తున్నాయి. పేదింటికి సైతం ఈ బడ్జెట్‌లో అన్యాయం జరిగింది. పేదల ఇళ్లకు నిరుడు రూ. 1,923 కోట్లు కేటాయిస్తే ఈసారి దాన్ని రూ. 803 కోట్లు పెంచి రూ. 2,726 కోట్లు చేశారు. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ఇళ్లలో కొన్నయినా పూర్తికావాలంటే కనీసం రూ. 15,000 కోట్లు కావలసి వస్తుంది. కనీసం రూ. 5,000 కోట్లయినా ఇవ్వాలని గృహ నిర్మాణ శాఖ ప్రతిపాదించింది. వాస్తవంగా ఉన్న అవసరాలనూ పరిగణనలోకి తీసుకోక... ఆ శాఖ చెప్పినట్టూ చేయక విదిల్చిన ఈ మొత్తం వల్ల ఎవరికైనా ఒరిగేదేముంటుంది? ఒకపక్క పేదలకు లక్షల సంఖ్యలో ఇళ్లు మంజూరు చేస్తూ క్రియకొచ్చేసరికి ఇంత తక్కువ మొత్తం కేటాయించడమంటే ఆ వర్గాలను మోసగించడం తప్ప మరేమీ కాదు.
 
  ఓటాన్ అకౌంట్ ప్రవేశపెడుతూ అభివృద్ధి, సంక్షేమంలో మనమే దేశంలో అందరికన్నా ముందున్నామని చెప్పారు. అంతేకాదు...ఆ విషయంలో ప్రణాళిక సంఘం మనల్ని మెచ్చి కేటాయింపులు పెంచిందని కూడా అన్నారు. మరి కేటాయింపులు ఆ మేరకు ఎందుకు పెరగలేదు? కొత్త పథకాల సంగతి సరే... కనీసం నిరుడున్న పథకాలు ఏమైపోయాయి? అసలు గతంలో అంచనా వేసిన రాబడి రూ.1,16,000 కోట్లలో రూ. 13,000 కోట్ల మేర ఎందుకు కోత పడింది? ఇవన్నీ జవాబులేని ప్రశ్నలు. వివిధ మార్గాలనుంచి రావలసిన సొమ్ములతోపాటు రుణ సేకరణకున్న అవకాశాలను కూడా సర్కారు సవ్యంగా వినియోగించుకోలేకపోయింది. కేంద్రంనుంచి రావలసిన గ్రాంట్లనూ తెచ్చుకోలేకపోయింది. ఫలితంగా సంక్షేమ పథకాలన్నిటినీ అడ్డగోలుగా కత్తిరించింది. 2009 ఎన్నికల్లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులకు 9గంటల విద్యుత్తు ఇస్తామని వాగ్దానం చేశారు. ఆయన కనుమరుగయ్యాక వచ్చిన నేతలెవరూ దాన్ని నిలుపుకోలేక పోయారు. కనీసం ఆయన అమలుచేసిన సంక్షేమ పథకా లనూ సక్రమంగా కొనసాగించలేకపోయారు. ఇప్పుడు ఎన్నికలు ముంచుకొస్తున్న ఈ తరుణంలో ఎవరి దోవ వాళ్లు చూసుకోవడానికి తొందరపడుతూ జనక్షేమాన్ని గాలికొదిలారు. కానీ... ప్రజలు తెలివైన వారు. ఇలాంటివారు ఏ పంచన ఉన్నా ఇట్టే పసిగడతారు. తగిన బుద్ధి చెబుతారు.
 

మరిన్ని వార్తలు