భారతీయ రైల్వే.. భారీ కొలువులు

30 Jan, 2014 13:42 IST|Sakshi

రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డులు ఎప్పటికప్పుడు భారీ నోటిఫికేషన్లతో యువత ముందుకొచ్చి, క్రేజీ కొలువులకు రాచబాట వేస్తున్నాయి. తాజాగా 26,570 అసిస్టెంట లోకో  పైలట్ టెక్నీషియన్ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశాయి. ఈ నేపథ్యంలో విజయ వ్యూహాలపై స్పెషల్ ఫోకస్...

 

ఆర్‌ఆర్‌బీ సంయుక్త నోటిఫికేషన్ ద్వారా 15,059 అసిస్టెంట్ లోకో పైలట్, 11,511 టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ జరగనుంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు- సికింద్రాబాద్ పరిధిలో దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్‌కోస్ట్ రైల్వేకు చెందిన పోస్టులున్నాయి.
 
 

అర్హత:
 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు పదో తరగతితో పాటు ఐటీఐ. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా ఉన్నత స్థాయి కోర్సులు పూర్తిచేసిన వారు కూడా అర్హులు.
 టెక్నీషియన్ సిగ్నల్ గ్రేడ్-3, టెలీకమ్యూనికేషన్ మెయింటైనర్ గ్రేడ్-3 పోస్టులకు పదో తరగతితో పాటు ఐటీఐ ఉండాలి. లేదా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో 10+2 ఉత్తీర్ణత అవసరం. లేదా డిప్లొమా ఉండాలి. ఇతర టెక్నీషియన్ పోస్టులకు పదో తరగతితో పాటు ఆయా విభాగాల్లో ఐటీఐ పూర్తిచేసుండాలి.
 వయసు: 2014, జూలై 1 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
 
 
రాత పరీక్ష
 అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ పోస్టులకు ఉమ్మడి రాత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. అన్ని ఆర్‌ఆర్‌బీలు ఒకే రోజు పరీక్ష నిర్వహిస్తాయి. అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న బోర్డు పరిధిలో పరీక్ష రాయొచ్చు. పరీక్షలో 100 నుంచి 120 ప్రశ్నలు ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కు కోత విధిస్తారు. ప్రశ్నపత్రంలో జనరల్ అవేర్‌నెస్, అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ టెక్నికల్ ఎబిలిటీకి సంబంధించి ప్రశ్నలు ఉంటాయి. 90 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ, స్థానిక భాషలో ఉంటుంది.
 
 

ఎంపిక విధానం:
 అసిస్టెంట్ లోకో పైలట్‌కు మొత్తం మూడు దశల్లో ఎంపిక విధానం ఉంటుంది. మొదటి దశలో రాత పరీక్ష, తర్వాత ఆప్టిట్యూడ్ టెస్ట్, చివరగా మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. టెక్నీషియన్ పోస్టులకు రాత పరీక్ష ద్వారా నియామకాలు జరుపుతారు.
 
 
ప్రిపరేషన్ ప్రణాళిక

 
అర్థమెటిక్:  ఈ విభాగంలోని ప్రశ్నలు ప్రాథమిక స్థాయిలోని గణిత సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ఉంటాయి. ఇందులో ఎక్కువ మార్కులు సాధించాలంటే కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగహారాలను వేగంగా చేయగల నేర్పును సాధించాలి. కసాగు, గసాభా, శాతాలు, లాభ- నష్టాలు, సగటు, కాలం-పని, కాలం-వేగం-దూరం, నిష్పత్తులు, స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్, వైశాల్యం-చుట్టుకొలత, క్యాలెండర్, గడియారం వంటి అంశాలకు సంబంధించిన సమస్యలపై పట్టు సాధించాలి. బీజ గణితం, సమితులు, త్రికోణమితి, ప్రమేయాలపై కూడా అవగాహన పెంపొందించుకోవాలి.


 
రీజనింగ్: అభ్యర్థి విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఉద్దేశించిన విభాగమిది. సాధారణంగా ఆర్‌ఆర్‌బీ పరీక్షలలో వెర్బల్ సెక్షన్ నుంచే ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. నాన్ వెర్బల్ నుంచి తక్కువగా వస్తున్నాయి. రీజనింగ్ విభాగంలో సిరీస్(లెటర్/నెంబర్/సింబల్), అనాలజీ, క్లాసిఫికేషన్, కోడింగ్-డీకోడింగ్, డెరైక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, పజిల్ టెస్ట్, ర్యాంకింగ్ అండ్ అరేంజ్‌మెంట్, లాజికల్ డయాగ్రామ్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్, మిస్సింగ్ నెంబర్స్, అర్థమెటికల్ రీజనింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ వంటి అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. చిట్కాల ద్వారా ప్రతిరోజూ సాధన చేస్తే త్వరగా సమాధానాలు గుర్తించవచ్చు. వీలైనన్ని ఎక్కువ ప్రశ్నల్ని ప్రాక్టీస్ చేయడం అవసరం. దీనికోసం పాత ప్రశ్నపత్రాలను పరిశీలించాలి. A నుంచి Z వరకు, Z నుంచి A వరకు వేగంగా చదవగలగాలి. A నుంచి Z వరకు వాటి స్థాన విలువలు (A-1, B-2, C-3, ......, Z-26) తెలిసుండాలి. A నుంచి Z వరకు తిరోగమన స్థాన విలువలు (A-26, B-25,....., Z-1) నేర్చుకోవాలి.


 
 జనరల్ అవేర్‌నెస్:  హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, జనరల్ సైన్స్ అంశాలకు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. చరిత్రలో భారతదేశ చరిత్ర (ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక యుగం).. ముఖ్యంగా స్వాతంత్య్రోద్యమంపై ప్రశ్నలు వస్తాయి. జాగ్రఫీకి సంబంధించి విశ్వం, భూమి, ఖండాలు, మహాసముద్రాలు, నదులు, ఖనిజాలు, రవాణా వ్యవస్థ, జనాభా, వ్యవసాయం తదితర అంశాలపై పట్టు సాధించాలి. పాలిటీ విభాగంలో భారత రాజ్యాంగం, న్యాయవ్యవస్థ, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, వివిధ కమిషన్ల చైర్మన్‌ల పేర్లను తెలుసుకోవాలి. జనరల్ సైన్స్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అంశాలను చదవాలి. రక్షణ, అంతరిక్ష, అణుశక్తి వంటి విభాగాలపైనా దృష్టి సారించడం మంచిది. ఎకానమీలో.. జాతీయాదాయం, నిరుద్యోగం, పేదరికం, ప్రభుత్వ పథకాలు, పన్నుల వ్యవస్థ, ఫైనాన్స్ కమిషన్ వంటి అంశాలను చదవాలి.


 
 స్టాక్ జనరల్ నాలెడ్జ్:  ఈ విభాగంలో రైల్వే వ్యవస్థకు సంబంధించిన ప్రశ్నలతోపాటు.. జాతీయ చిహ్నాలు, అంతర్జాతీయ సరిహద్దులు, ఐక్యరాజ్యసమితి, పరిశోధన సంస్థలు, క్రీడలు, అవార్డులు, పుస్తకాలు-రచయితలు, ప్రపంచం/ఇండియాలో తొలి, ఎత్తై, పొడవైన అంశాలకు సంబంధించిన ప్రశ్నలను అడుగుతారు.


 
 కరెంట్ అఫైర్స్:  పరీక్ష జరిగే తేదీకి ముందు ఏడాది కాలంలో జరిగిన ప్రధాన సంఘటనలను (సదస్సులు, సమావేశాలు, ఒప్పందాలు, వ్యక్తులు, విజయాలు, అవార్డులు వంటివి) తెలుసుకోవాలి. దీనికోసం రోజూ దినపత్రికలు, మేగజీన్లను చదవాలి.


 
 టెక్నికల్ సబ్జెక్ట్:  ఈ విభాగంలో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అంశాలపై ప్రశ్నలు వస్తాయి. మెకానికల్ ఇంజనీరింగ్‌లో మెకానిక్స్, డిజైన్, ప్రొడక్షన్ టెక్నాలజీ, థర్మోడైనమిక్స్, ఐ.సి.ఇంజిన్స్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్, ఫ్లూయిడ్ మెకానిక్స్, మెషినరీ వంటి అంశాలు ముఖ్యమైనవి.
 
 ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్: అటామిక్ స్ట్రక్చర్, కరెంట్, రెసిస్టెన్స్, ఓమ్ నియమం, కెపాసిటర్స్, సిరీస్-ప్యారలల్ కనెక్షన్స్, మ్యాగ్నటిజం, ప్రిన్సిపుల్స్ ఆఫ్ మోటార్, ట్రాన్స్‌ఫార్మర్స్, జనరేటర్స్, మెజరింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ వంటి అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి.
 ఎలక్ట్రానిక్స్: ఈ విభాగంలో రాణించడానికి.. కన్వర్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రాన్స్, కండక్టర్స్, సెమీ కండక్టర్స్ వంటి అంశాలపై పట్టు సాధించాలి.
 
 రిఫరెన్స్:  అర్థమెటిక్, రీజనింగ్- ఆర్‌ఎస్ అగర్వాల్.  లూసెంట్ పబ్లికేషన్స్.
 
 
 ప్రాక్టీస్‌తోనే సక్సెస్
 మెరుగైన ప్రాక్టీస్‌తోనే రాత పరీక్షలో విజయం సాధించగలం. వీలైనన్ని మోడల్, ప్రీవియస్ ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. నిపుణులైన ఫ్యాకల్టీ సహాయంతో తప్పులను సరిదిద్దుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించాలి. ఏఎల్‌పీ, టెక్నీషియన్స్ పోస్టులకు ఉమ్మడిగా నిర్వహించే రాతపరీక్షలో టెక్నికల్ సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు బేసిక్ స్థాయిలో ఉన్నప్పటికీ, స్టాండర్డ్‌గా ఉంటాయి. అందువల్ల అభ్యర్థులు మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించిన ప్రాథమిక అంశాలను విశ్లేషణాత్మకంగా చదవాలి. ఉద్యోగంలో చేరుతూనే ఆకర్షణీయ జీతభత్యాలతో అసిస్టెంట్ లోకో పైలట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన వారు తర్వాత సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్‌గా, లోకో పైలట్ స్థాయికి చేరుకోవచ్చు.
 - ఎ.సత్యనారాయణరెడ్డి,
 డెరైక్టర్, గ్రేట్ ఇన్‌స్టిట్యూట్,సికింద్రాబాద్.


 నోటిఫికేషన్ వివరాలు
 ఫీజు వివరాలు: జనరల్/ఓబీసీ పురుష అభ్యర్థులు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రూ.40 డీడీ లేదా ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ద్వారా ఫీజు చెల్లించాలి.
 దరఖాస్తు విధానం: దరఖాస్తులను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా నిర్దేశిత నమూనాలో అ4 సైజు పేపర్‌పై పూర్తి చేసిన దరఖాస్తుతోపాటు సంబంధిత సర్టిఫికెట్లను, డీడీ/ఐపీఓ జతచేయాలి. డీడీ/ఐపీఓ వెనుక నోటిఫికేషన్ నెంబర్, దరఖాస్తు చేసిన పోస్టు, పేరు, చిరునామా వివరాలను పొందుపరచాలి. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
 ముఖ్య తేదీలు:
 దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 17, 2014.
 పరీక్ష తేదీ: జూన్ 15, 2014.
 వెబ్‌సైట్: www.rrbsecunderabad.nic.in

>
మరిన్ని వార్తలు