డాక్టర్ కలను నిజం చేసే మరో అవకాశం..బీడీఎస్

17 Jul, 2014 03:22 IST|Sakshi
డాక్టర్ కలను నిజం చేసే మరో అవకాశం..బీడీఎస్

బీడీఎస్ కోర్సు చేసిన వారు దంత సంబంధిత వ్యాధులకు చికిత్సలను అందిస్తుంటారు. వీరిని డెంటిస్ట్‌లుగా వ్యవహరిస్తారు. దంతవ్యాధుల నుంచి సంరక్షణ, దంత క్షయం, పళ్ల మధ్య ఖాళీలు, చిగుళ్ల సమస్యలు, దంతాల సర్దుబాటు, కృత్రిమ దంతాలను అమర్చడం వంటి సేవలను వీరు అందిస్తారు.
 
 కాలేజీలు (2013-14 వివరాల మేరకు):
 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కలిపి మొత్తం 24 బీడీఎస్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో 3 ప్రభుత్వ కాలేజీలు, 21 ప్రైవేట్ కాలేజీలు. వివరాలు..

 స్టేట్ వైడ్ కళాశాలలైన హైదరాబాద్ ప్రభుత్వ దంత వైద్య కాలేజ్‌లో 100 సీట్లు, విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాలలలో 40 సీట్లు ఉన్నాయి.  ఎస్వీయూ పరిధిలోని వెఎస్సార్ జిల్లా కడపలోని రాజీవ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సెన్సైస్(రిమ్స్)లో 100  సీట్లు ఉన్నాయి.
 
     ఎస్వీయూ పరిధిలోని 3 ప్రైవేటు కళాశాల్లో 250 సీట్లు ఉన్నాయి.
     ఏయూ పరిధిలోని 6 ప్రైవేటు కళాశాలల్లో 600 సీట్లు ఉన్నాయి.
     ఉస్మానియా  పరిధిలోని 7 ప్రైవేటు కళాశాలల్లో 700 సీట్లు ఉన్నాయి.
     స్టేట్ వైడ్ ప్రైవేటు కళాశాల కింద సికింద్రాబాద్ ఆర్మీ డెంటల్ కళాశాలలో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
 
 రాజమండ్రిలోని లెనోరా డెంటల్ కళాశాల మాత్రమే మైనార్టీ కళాశాల.
 కొత్తగా ప్రైవేట్ విభాగంలో తెలంగాణలో భాస్కర డెంటల్ కళాశాల (హైదరాబాద్), మల్లారెడ్డి ఉమెన్స్ డెంటల్ కళాశాల (హైదరాబాద్), ఆంధ్రప్రదేశ్‌లో కోనసీమ డెంటల్ కళాశాల (అమలాపురం)కు అనుమతించే లభించే అవకాశం ఉంది.
 
 కోర్సు స్వరూపం:
 బీడీఎస్ కోర్సు కాల వ్యవధి: ఐదేళ్లు (ఇంటర్న్‌షిప్‌తో కలిపి). ఇందులో ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ ఉంటుంది. నాలుగేళ్ల కోర్సు తర్వాత ఇంటర్న్‌షిప్ ప్రారంభమవుతుంది. ఇంటర్న్‌షిప్‌లో విద్యార్థులను హౌస్ సర్జన్‌గా వ్యవహరిస్తారు. ఈ దశలో కాలేజీకి అనుబంధంగా ఉన్న లేదా నిర్దేశించిన హాస్పిటల్‌లో సీనియర్ డాక్టర్ పర్యవేక్షణలో విద్యార్థులు ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకుంటారు. హౌస్ సర్జన్సీలో మూడు నెలలు పాటు గ్రామీణ ప్రాంతాల్లోని శాటిలైట్ క్లినిక్స్‌లో పని చేయాల్సి ఉంటుంది.
 
 బోధించే అంశాలు:
 బీడీఎస్ కోర్సులో అనాటమీ, హ్యూమన్ ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ అండ్ న్యూట్రిషన్, డెంటల్ అనాటమీ ఎంబ్రీయాలజీ అండ్ ఓరల్ హిస్టాలజీ, జనరల్ పాథాలజీ అండ్ మైక్రోబయాలజీ, డెంటల్ మెటీరియల్స్, జనరల్ అండ్ డెంటల్ ఫార్మాకాలజీ అండ్ థెరపెటిక్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఓరల్ పాథాలజీ అండ్ మైక్రోబయాలజీ, పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ, ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ తదితర సబ్జెక్ట్‌లను బోధిస్తారు.
 
 ఇంటర్‌‌నషిప్:
 ఇంటర్‌‌నషిప్‌లో భాగంగా విద్యార్థులు నిరంతరం వార్డుల్లో పర్యటించడం, పలు రకాల వ్యాధులతో బాధపడుతున్న పేషెంట్లతో మమేకం కావడం.. ఒక వ్యాధికి సంబంధించి తాము అకడెమిక్‌గా తెలుసుకున్న విషయాలు, లక్షణాలు.. వాస్తవంగా అదే వ్యాధికి గురైన రోగులకు సీనియర్లు చికిత్స అందిస్తున్న తీరును పరిశీలించడం వంటి లక్షణాలు అలవర్చుకోవాలి.
 
 కావల్సిన స్కిల్స్:
 కోర్సులో  ప్రవేశించాలనుకునే వారికి  కొన్ని నైపుణ్యాలు తప్పనిసరి. అవి..
     సేవా ధృక్ఫథం, ఓర్పు, ఆత్మ విశ్వాసం, ఏకాగ్రత
     దృడచిత్తంతో వ్యవహరించగలగడం
     నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం
     కమ్యూనికేషన్ స్కిల్స్
     కష్టపడే మనస్తతత్వం
     కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి
 
 ఆసక్తి ఉంటే పీజీ:
 బీడీఎస్ తర్వాత పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేయవచ్చు. ఈ కోర్సును ఎండీఎస్ (మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ)గా వ్యవహరిస్తారు. ఇందులో పలు స్పెషలైజేషన్స్ ఉంటాయి. అవి.. ఓరల్ పాథాలజీ అండ్ మైక్రోబయాలజీ, ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ, పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ, కన్సర్వేటివ్ డెంటిస్ట్రీ అండ్ ఎండోడెంటిక్స్, పెన్‌డోడెంటిక్స్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్రీ, ఆర్థోడెంటిక్స్ అండ్ డెంటో ఫేిషియల్ ఆర్థోపెడిక్స్, పరియోడెంటిక్స్, ఓరల్ అండ్ మ్యాక్స్‌ల్లోఫేషియల్ సర్జరీ తదితరాలు. తర్వాత ఆసక్తి ఉంటే పీహెచ్‌డీ కూడా చేసే అవకాశం ఉంది.
 
 కె రీర్‌గ్రాఫ్:
 బీడీఎస్ పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో అవకాశాలు ఉంటాయి. ప్రైవేట్ రంగలోనైతే ఏదైనా హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్/హౌస్ స్టాఫ్‌గా కెరీర్ ప్రారంభమవుతుంది. తర్వాత అర్హత, అనుభవం ఆధారంగా..సీనియర్ డాక్టర్, చీఫ్ మెడికల్ ఆఫీసర్/ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ (ఆర్‌ఎంఓ) వంటి హోదాలను అందుకోవచ్చు. ప్రభుత్వ రంగంలోనైతే.. పీహెచ్‌సీ, జనరల్ హాస్పిటల్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, జిల్లా ఆస్పత్రులలో.. డెంటల్ సర్జన్‌గా కెరీర్ ప్రారంభమవుతుంది. అర్హత, అనుభవం ఆధారంగా పదోన్నతులు ఉంటాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లోని మెడికల్ సర్వీసెస్‌లో కూడా డెంటిస్ట్‌లకు అవకాశాలు ఉంటాయి. హాస్పిటల్స్ ప్రారంభించడం ద్వారా సొంతంగా ప్రాక్టీస్ చేయవచ్చు. మెడికల్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు, ఫార్మాస్యూటికల్ పరిశ్రమలు, పరిశోధన సంస్థలలో కూడా స్థిరపడొచ్చు. ఆసక్తి ఉంటే అధ్యాపక వృత్తిని కూడా ఎంచుకోచ్చు. మెడికల్ కాలేజ్/ఇన్‌స్టిట్యూట్‌లలో క్లినికల్ అసిస్టెంట్/క్లినికల్ ట్యూటర్‌గా కెరీర్ ప్రారంభివచ్చు. ప్రస్తుతం కేవలం బీడీఎస్‌తోనే సుస్థిర కెరీర్‌ను ఆశించలేం. కాబట్టి విద్యార్థులు పీజీని లక్ష్యంగా పెట్టుకోవాలి.
 
 నైపుణ్యత పెంచుకోవాలి
 
 బీడీఎస్ కోర్సులో ఒక ఏడాది ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ఇంటర్న్‌షిప్‌లో విద్యార్థులను హౌస్ సర్జన్‌గా వ్యవహరిస్తారు. హౌస్ సర్జన్సీలో విద్యార్థులకు మూడు నెలల పాటు గ్రామీణ ప్రాంతాల్లోని శాటిలైట్ క్లినిక్స్‌లో పోస్టింగ్ ఇస్తారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన విధానం తెలుసుకోవడానికి వీలవుతుంది. బీడీఎస్ అభ్యర్థులు కెరీర్‌లో రాణించడమనేది నైపుణ్యత మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల కోర్సులో భాగంగా థియరీతో పాటు క్లినికల్ నాలెడ్‌‌జపైనా ఎక్కువ దృష్టిపెట్టాలి. ఇందుకోసం కోర్సు చేస్తున్న సమయంలోనే సబ్జెక్ట్‌పై పట్టు పెంచుకోవాలి. తద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నైపుణ్యతను పెంచుకోవడానికి క్లినికల్ స్కిల్స్‌పై దృష్టి సారించాలి.  కాబట్టి విద్యార్థులు హౌస్‌సర్జన్సీషిప్‌లో నిరంతరం వార్డుల్లో పర్యటించడం, పలు రకాల వ్యాధులతో బాధపడుతున్న పేషెంట్లతో మమేకం కావడం..
 
  ఒక వ్యాధికి సంబంధించి తాము అకడెమిక్‌గా తెలుసుకున్న లక్షణాలు.. వాస్తవంగా అదే వ్యాధికి గురైన రోగులకు సీనియర్లు చికిత్స అందిస్తున్న తీరును పరిశీలించడం వంటి లక్షణాలు అలవర్చుకోవాలి. తద్వారా క్లినికల్ నాలెడ్జ్ పెరుగుతుంది. నైపుణ్యత అలవడుతుంది. అంతేకాకుండా వృత్తిలో భాగంగా రోగులతో  మాట్లాడటం, వారిలో నమ్మకం కలిగించడం ప్రధానం కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవాలి. అవకాశాల విషయానికొస్తే.. సొంతంగా ప్రాక్టీస్ చేయవచ్చు, ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్‌లో అవకాశాలు ఉంటాయి. ఇండియన్ ఆర్మీలో ఆర్మ్‌డ్ కార్ప్స్‌గా స్థిరపడొచ్చు. విదేశాల్లో ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో బీడీఎస్ అభ్యర్థులకు మంచి డిమాండ్ ఉంటోంది.
 -డాక్టర్ టి .మురళీ మోహన్, ప్రిన్సిపాల్,
 ప్రభుత్వ దంత వైద్య కళాశాల, విజయవాడ.
 

మరిన్ని వార్తలు