ఆయుర్వేద కౌన్సెలింగ్

23 Jul, 2015 22:41 IST|Sakshi

మెడనొప్పికి పంచకర్మ
 

నా వయస్సు 36 సంవత్సరాలు. నాకు తరచూ మెడనొప్పిగా ఉంటోంది. ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు చెయ్యి లాగడం మొదలవుతోంది. మందులు వాడినప్పుడు నొప్పి తగ్గుతోంది. మందులు మానగానే మళ్లీ వస్తోంది. దీనికి ఆయుర్వేదంలో సరైన వైద్యం ఉందా? - రవి వర్మ, విశాఖపట్నం

మీరు కంప్యూటర్ ముందు ఎక్కువగా పనిచేసే వృత్తిలో ఉన్నవాళ్లలో ప్రతి 100 మందిలో 70 మంది ఈ లక్షణాలతో బాధపడుతున్నారు. దీనికి అనే కారణాలున్నాయి. ఈ వృత్తిలో వున్న చాలామందిలో శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది. ఆహార అలవాట్లలో విపరీతమైన మార్పు వచ్చింది. నిద్రా సమయంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. వీటి ప్రభావం మన శరీర, మానసిక వ్యవస్థలపై పనిచేసి, చాలా దుష్ర్పభావాలు చూపిస్తున్నాయి. అందులో ఒకటి ఈ మెడనొప్పి. ఈ మెడనొప్పిని ఆయుర్వేదంలో మన్యస్తంభము అనీ, అపబాహుకము అని, అల్లోపతి వైద్యశాస్త్రంలో సర్వికల్ స్పాండిలోసిస్ అని అంటారు.

 ఎక్కువగా మానసిక ఆందోళనకు గురికావడం, నిద్ర సరిగా లేకపోవడం, అన్నం సరిగా జీర్ణం కాకపోవడం వల్ల కూడా కొంతమందిలో మెడనొప్పి వస్తూ ఉంటుంది.
 
కారణాలు: 1) మెడ భాగంలో ఉన్న ఎముకల మధ్య ఉన్న ఖాళీభాగం తగ్గడం వల్ల, ఎముకల మధ్యలో వాపు రావడం వల్ల, ఎముకలు అరిగిపోవడం వల్ల కూడా పై లక్షణాలు కనిపిస్తుంటాయి. 2) కొంతమందిలో తల తిరగడం, పైకి లేస్తే కింద పడిపోతున్నట్లుగా ఉండడం వల్ల తలనొప్పి; మెడ నరాలు నొక్కుకుని పోయినట్లుగా, వాచినట్లుగా ఉండి, రక్తప్రసరణ తక్కువగా ఉండడం వల్ల కూడా మెడనొప్పి వస్తూ ఉంటుంది. 3) కొంతమందిలో మెడనొప్పి తక్కువగా ఉండి, మెడ దగ్గర నుండి అరచేయి వరకు లాగడం, నొప్పిగా ఉండడం, తిమ్మిరిగా, మొద్దుబారినట్టు ఉండడం వంటి లక్షణాలు ఉండచ్చు. మెడభాగంలోని ఎముకల మధ్య ఉన్న డిస్క్ భాగంలో వాపు రావడం వల్ల కానీ, అది పక్కకు జరగడం వల్ల కానీ ఇలా జరుగుతుంది.

 పై లక్షణాలు తెలుసుకోవడానికి ఎక్స్‌రే కానీ, ఎంఆర్‌ఐ కానీ తీయవచ్చు. ఆయుర్వేద వైద్యుడికి మాత్రం ఇవేవీ అవసరం లేదు. మీ లక్షణాలను బట్టి వ్యాధి నిర్ధారణ చేయవచ్చు.

చికిత్సా క్రమంలో... 1) వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే ఎక్కువ సమయం పడుకోవడం మంచిది. తలభాగంలో తక్కువ పరిమాణంలో ఉన్న దిండును వాడడం మంచిది. 2) కొద్దిరోజుల వరకు బరువైన వస్తువులను మోయరాదు. 3) శతపాక క్షీరబలా తైలాన్ని ఉదయం, రాత్రి వ్యాధి తీవ్రతను బట్టి తీసుకోవలసి ఉంటుంది. 4) మానసిక ఆందోళన, రక్తపోటు, తలతిరగడం ఉన్నట్లయితే ‘మానసమిత్రవటకం’ను వాడడం మంచిది. 5) ఎముకలమధ్య వాపు ఉన్నట్లయితే వాపు తగ్గడానికి ‘త్రయోదశాంగ గుగ్గులు’ వాడడం మంచిది.
 తిమ్మిరి, చెయ్యి మొద్దుబారినట్లు ఉండటం వంటి వాటికి వాతగజాంకుశరస్, లశూనాదివటి ని కలిపి తీసుకోవడం మంచిది. పంచకర్మ పద్ధతిలో శిరోధార, నస్యకర్మ, గ్రీవవస్తి, మనల్‌కిడీ లాంటి పంచకర్మ చికిత్సలను తీసుకున్నట్లయితే శాశ్వతమైన పరిష్కారం లభిస్తుంది.
 వ్యాధి తీవ్రత తగ్గిన తర్వాత, మెడనొప్పికి సంబంధించిన ఆసనాలు, మానసిక ప్రశాంతతకు ప్రాణాయామం, ధ్యానం మొదలైన వాటిని అలవాటు చేసుకోవడం మంచిది.
 

మరిన్ని వార్తలు