కామెడీ చూపిస్త మావ

18 Aug, 2015 02:46 IST|Sakshi
కామెడీ చూపిస్త మావ

‘క్వాలిటీ’ కోసం తపించే తండ్రి, ర్యాంక్ హోల్డర్ కూతురు, ఆవారాగా తిరుగుతూ ఆమెను ప్రేమలో పడేసే అబ్బాయి - ఈ మూడు పాత్రల మధ్య సంఘటనలతో తెరపై వినోదం ఒంపిన సినిమా ఇది. కానీ, ఇవాళ్టి సమాజంలో, విద్యాలయాల్లో నెలకొంటున్న అపసవ్య ధోరణులకు ఇలాంటి కథాంశాలు ఏ మేరకు కారణమవుతున్నాయి? ఎవరిని ఎంతలా ప్రభావితం చేస్తున్నాయి? ఇది మాత్రం ఎప్పటికీ చర్చనీయాంశమే.
 
గత రికార్డులు, పాత సెంటిమెంట్లను బట్టి వర్తమానం వర్కౌట్ అయ్యే రంగం - సినిమా. పాత రికార్డెంత బాగుంటే, కొత్త సినిమాకు అంత క్రేజ్. గతానికెళితే, హీరో రాజ్ తరుణ్, ‘చిన్నారి పెళ్ళికూతురు’ సీరియల్ (హిందీ ‘బాలికా వధు’) ఫేమ్ అవికా ఎస్. గోర్ కాంబినేషన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ‘ఉయ్యాల జంపాల’ (2013). చిన్న సినిమాల్లో పెద్ద విజయంగా నిలిచిన ఆ ప్రీవియస్ హిట్ తాలూకు సెంటిమెంట్ పుణ్యమా అని మళ్ళీ వాళ్ళ కాంబినేషన్ ‘సినిమా చూపిస్త మావ’కు క్రేజ్ వచ్చింది!
 
పాత ప్లాట్‌కు... కొత్త పెయింటింగ్!
కథగా చెప్పుకోవడానికి ఈ సినిమాది చాలా చిన్న పాయింట్! అనగనగా ఒక అబ్బాయి. పేరు కత్తి (రాజ్‌తరుణ్). పెట్రోల్‌ను బ్లాక్‌లో అమ్మే తండ్రి (తోటపల్లి మధు) - తల్లికి ఒకడే కొడుకు. ఫ్రెండ్స్‌తో తిరుగుతూ, ఇంటర్ ఫెయిలైన కుర్రాడు. అలాంటబ్బాయి ఓ చదువుల సరస్వతిని చూస్తాడు. చూడగానే ప్రేమలో పడతాడు. అమ్మాయి పేరు పరిణీత (అవిక). ఇంట ర్‌లో వెయ్యికి 996 మార్కులొచ్చిన ర్యాంక్ హోల్డర్. ఆ అమ్మాయి కోసం ఆమె ఇంజనీరింగ్ కాలేజీలోకి స్టూడెంట్‌లా ‘దొంగ’ప్రవేశం చేస్తాడు.
 
ఈ అమ్మాయేమో బెంగాలీ బాబు సోమనాథ్ ఛటర్జీ (రావు రమేశ్) కూతురు. ఆయనేమో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో క్వాలిటీ అండ్ విజిలెన్స్ కంట్రోల్ ఆఫీసర్. తాగే మంచినీళ్ళ దగ్గర నుంచి చదివే చదువు దాకా జీవితంలో ప్రతిదీ ‘క్వాలిటీ’గా ఉండాలనుకొనే రకం. కూతురికి చదువు తప్ప, చిన్న చిన్న సంతోషాలు కూడా లేకుండా చేసిన మరోరకం ‘బొమ్మరిల్లు’ ఫాదర్. హీరో ఫైట్లు, డ్యాన్సులు చేసి, జీవితంలోని చిన్న ఆనందాల రుచి చూపించి, హీరోయిన్ ప్రేమను పొందుతాడు. విషయం తెలిసిన హీరోయిన్ తండ్రి అగ్గిరాముడవుతాడు. తండ్రి ఇచ్చే ధైర్యాన్నీ, ప్రియుడు ఇచ్చే ఆనందాన్నీ - దేన్నీ వదులుకోనంటుంది హీరోయిన్. అప్పుడు ‘మరో చరిత్ర’ నాటి నుంచి ఉన్న పద్ధతిలోనే ఓ పందెం. పందెం నెగ్గడానికి హీరో ఏం చేశాడు, ఏం జరిగిందన్నది మిగతా సినిమా.
 
‘ఇడియట్’ నుంచి ‘ఆంధ్రాపోరి’ దాకా కథ ఇలాంటిదే అయినా, దాన్ని ఎంటర్‌టైనింగ్‌గా చెప్పడం మీద దర్శక, రచయితలు దృష్టి పెట్టారు. టీవీ షో ‘జబర్దస్త్’లో పాపులరైనవాళ్ళు కమెడియన్స్ కావడంతో ఫస్టాఫ్ కామెడీ స్కిట్ల మధ్య నడుస్తుంది. ‘భారతం’, ‘రామాయణం’ కలగలిపిన కాలేజీ స్కిట్ లాంటివి ‘ప్రేమకథా చిత్రమ్’ నుంచి ‘అత్తారింటికి దారేది’ అహల్య ఎపిసోడ్ దాకా చాలావాటిని గుర్తుతెస్తాయి.  
 
కలసిపడ్డ కష్టం వేస్ట్ కాలేదు!
గతంలో చాలా షార్ట్‌ఫిల్మ్స్‌లో భాగమై, సినీ తెరంగేట్రం చేసి, ఇప్పుడు నిర్మాతలతో సహా ఎవరికీ అందుబాటులో లేనంత స్థాయికి ఎదిగిన కథానాయకుడు - రాజ్ తరుణ్. ఈ కుర్రాడి నటన ఉత్సాహంగా సాగింది. మొదటి సినిమాలో లానే ఈసారీ గోదావరి యాసనే అనుసరించాడు. కొన్నిచోట్ల రవితేజ శైలి అనుకరణను వదిలించుకోలేకపోయాడు.
 
మునుపటి కన్నా ఒళ్ళు చేసినట్లు అనిపించిన అవికా గోర్ ఈ సినిమాలో కాసేపు అమాయకపు కూతురుగా, కాసేపు ప్రేమ కోసం తపించే ప్రియురాలి లాగా - రెండు కోణాల్లో కనిపిస్తారు. ఇక, ‘క్వాలిటీ’ కోసం తపించడంతో మొదలై ఆఖరుకొచ్చేసరికి కూతురినే కాదనుకొనేంత ఇగోయిస్ట్ తండ్రిలా ఉంటుంది రావు రమేశ్ పాత్ర గ్రాఫ్. అదెలా ఉన్నా అభినయించడంలో ఆయన లోపం చేయలేదు. గతంలో అనేక హిట్ చిత్రాలకు రచయితగా పనిచేసి, అడపాదడపా తెరపైనా మెరిసిన తోటపల్లి మధు చాలాకాలం తర్వాత నటించారు. సినిమా మొదటి నుంచి చివరి దాకా కనిపించే హీరో తండ్రి పాత్రతో వినోదం, సెంటిమెంట్ - రెండూ పంచారు. నటుడిగా ఈ సినిమాతో ఆయనకు మంచి బ్రేక్ కావచ్చు. సినిమా మొదట, చివరా కనిపించిన పోసాని క్యారెక్టర్ జనానికి నచ్చుతుంది. ప్రవీణ్, సత్య, ‘జబర్దస్త్’ కమెడియన్ల టీమ్ సభ్యులు ఉన్నంతలో రాణిం చారు. ఒకట్రెండు పాటలు బాగున్నాయి. ‘పిల్ల జమీందార్’, ‘గీతాంజలి’ ఫేవ్‌ు సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, సీన్‌కు తగ్గట్లు చేయించుకున్న డి.ఐ భేష్. వెరసి యూనిట్టంతా కలసిపడ్డ కష్టం తెర మీద కనిపిస్తుంది.
 
లాజిక్‌లొద్దు! మ్యాజిక్ చూడు!!
పేరుకు ఈ సినిమాలో హీరోయిన్‌ది హైదరాబాద్‌లో స్థిరపడ్డ బెంగాలీల కుటుంబం. కాబట్టి, వాళ్ళు తెలుగులో మాట్లాడుకోవడంలో ఆశ్చర్యం లేదు. కోల్‌కతా నుంచి ఇంటికి వచ్చిన బంధువులు సైతం హాయిగా మనందరికీ అర్థమయ్యేలా కోస్తాంధ్ర మాటలు, మాండలికాల్లో మాట్లాడేస్తుంటారు. ఇలాంటి ‘సినిమా సౌలభ్యాలు’ చాలానే కనిపిస్తాయి.
 
ఇంటర్ ఫెయిల్ కుర్రాడు ఇంజనీరింగ్ కాలేజ్‌లోకి ఎలా వెళ్ళాడు? కేవలం స్కిట్‌తో ప్రిన్సిపాల్‌తో సహా అందరినీ ఎలా పడగొట్టేశాడు? ర్యాంక్ హోల్డర్ హీరోయిన్‌కు ఆవారా అబ్బాయితో ప్రేమేంటి? లాంటి లాజిక్‌లు వెతకడం టైమ్ వేస్ట్. ఇది సినిమా అన్న ఒకే ఒక్క లాజిక్ వీటన్నిటికీ జవాబు. కాలేజీలో ర్యాగింగ్, అమ్మాయిల వెంట అబ్బాయి పడడం, క్లాస్‌రూమ్‌లో లెక్చరర్‌ను వెర్రివెంగళప్పను చేయడం లాంటి వెండితెర ఫార్ములాలు ఈ సినిమా సక్సెస్‌కీ వాడారు. ఇవి ఎంతవరకు సమాజానికి మంచివి, వీటిని ఏ మేరకు తీసుకోవాలన్నది మాత్రం ఆడియన్స్ విజ్ఞత.
 
ఆడియన్స్ అన్నీ చూస్తున్నారు!
‘బాహుబలి’ భారీ విజువల్ వండర్‌ను ఆదరిస్తున్న కళ్ళతోనే, ‘శ్రీమంతుడు’ లాంటి కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ లాంటి ఫ్యామిలీ సబ్జెక్ట్స్, ‘పండగ చేస్కో’ లాంటి టైమ్‌పాస్ ఎంటర్‌టైనర్‌లనూ ఆదరించడం ఇవాళ ప్రేక్షకుల ట్రెండ్. చిన్న సినిమా అయినా సరే, కాస్తంత విషయం ఉండి, కొద్దిసేపు నవ్వించేస్తే - రెండున్నర గంటలు గిట్టుబాటైందన్న విశాల హృదయం ఆడియన్స్‌కు వచ్చింది.
 
అందుకే, మొదటి నుంచి చివరి దాకా వినోదం చేసే మ్యాజిక్ మీదే చిత్ర యూనిట్ పందెం కాసింది. వాట్సప్, ఎస్.ఎం.ఎస్. జోకులన్నీ ముచ్చటగా మూటగట్టి తెరపై వడ్డించింది. అందుకే, కాసేపు బుర్ర పక్కనపెట్టేసి, ఆలోచనను అటకెక్కించి, కలర్‌ఫుల్ కాలక్షేపానికి వెళితే, ‘సినిమా చూపించాడు మావ’ అనుకొంటూ బయటకు రావచ్చు!
 - రెంటాల జయదేవ
 
సినిమా వెనక కథ... ఇదీ మావ!
- ‘టాటా-బిర్లా-మధ్యలో లైలా’తో మొదలైన నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌కిది 7వ సినిమా. నిర్మాణానికి ఏణ్ణర్ధంపైనే పట్టింది. అనేకసార్లు షూటింగ్ క్యాన్సిలైనా, యూనిట్ కలసికట్టుగా నిలిచింది.  
- ‘మేం వయసుకు వచ్చాం’, ‘ప్రియతమా! నీవచట కుశలమా’ తరువాత దర్శకుడిగా నక్కిన త్రినాథరావుకిది మూడో సినిమా. ఆయన మొదట అనుకున్న కథ వేరు. కానీ ఫ్యామిలీ ఎంటర్‌టైనరైన హిట్ తీయాలని ఇప్పుడు చూస్తున్న కథ అల్లుకున్నారు.
- మొదట ఈ సినిమాను వైజాగ్, సముద్రతీరం నేపథ్యంలో తీయాలనుకున్నారు. ‘హుద్‌హుద్’ తుపాను వల్ల షూటింగ్ క్యాన్సిల్. తరువాత పరిశ్రమలో సమ్మెలు. అలా 3 -4 నెలలు వేస్ట్. చివరకి కథ బ్యాక్‌డ్రాప్‌ను వైజాగ్ నుంచి హైదరాబాద్ మార్చారు.
- 48 షూటింగ్ డేస్, 60 కాల్షీట్స్. హైదరాబాద్‌లోనే షూట్ అంతా.
- ‘జబర్దస్త్’ షో రైటర్ ప్రసన్నకుమార్ సినీ డైలాగ్ రైటర్‌గా పరిచయమయ్యారు. 3 పాటల్రాశారు. ఈ చిత్రానికి డైలాగులు బలం.
- హీరో రాజ్‌తరుణ్ అనుకొని, హీరోయిన్ కోసం వెతకసాగారు. వేరే సినిమా కోసం నిర్మాత అట్టిపెట్టుకున్న అవిక డేట్స్ సంగతి గుర్తుచేసి, కమర్షియల్‌గా బాగుంటుందని బెల్లంకొండ సురేశ్ సలహా ఇచ్చారు. కథను వినోదం బాటలోనే నడపమని కోన వెంకట్, మామ పాత్రకి రావు రమేశ్ బాగుంటారని డిస్ట్రిబ్యూటర్ బాబ్జీ సలహాలిచ్చారు. ఈ ఫ్రెండ్స్ సలహాలన్నీ రిజల్టిచ్చాయి.
 
బిజినెస్ ఎంతో తెలుసా... మావ!
- టీజర్ చూసి, ముచ్చటపడ్డ డిస్ట్రిబ్యూటర్ ‘దిల్’ రాజు తానే ముందుకొచ్చి, నైజామ్ ఏరియా కొనుక్కున్నారు.
- సుమారు రూ. 3 కోట్లు ఖర్చయిన  సినిమాపై నిర్మాతలకెంత కాన్ఫిడెన్స్ అంటే, డిస్ట్రిబ్యూటర్లకు సినిమా చూపించి, మరీ బిజినెస్ చేశారు. రిలీజ్‌కి ముందే చిన్న సినిమా వ్యాపారం పూర్తవడం, అంతా హ్యాపీగా ఉండడం చాలాకాలం తరువాత ఇదే!
- ‘మా’ టీవీ చానల్ వాళ్ళు సినిమా చూసి, రిలీజ్ కన్నా ముందే శాటిలైట్ రైట్స్ (దాదాపు రూ. 2 కోట్లని వినికిడి) కొనేశారు.  
- ‘శ్రీమంతుడు’, ‘కిక్2’ లాంటి పెద్ద సినిమాల మధ్యలో ఈ చిన్న సినిమాతో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు నమ్మకంగా రిలీజ్ చేశారు.
- మొదటి రోజు నుంచే హిట్ టాక్. ‘ఏ’, ‘బి’ సెంటర్స్ హౌస్‌ఫుల్. మంచి ఓపెనింగ్స్. అందరికీ లాభాలొచ్చే ప్రాజెక్టని ట్రేడ్ టాక్.
 
త్వరలో... కొత్త కామెడీ సీన్లు మావ!
ఈ సినిమా కోసం బ్రహ్మానందం, సప్తగిరి, రాజ్‌తరుణ్‌ల కాంబినేషన్‌లో కొన్ని సీన్లు తీశారు. కామెడీతో పాటు యాక్షన్ కూడా ఉన్న ఈ సీన్లను ఫస్ట్‌కాపీ వచ్చాక నిడివి సమస్యతో పక్కనపెట్టారు. టాక్ బాగుండడంతో, ఈ 13 నిమిషాల సీన్లను త్వరలోనే కలపనున్నారు.

మరిన్ని వార్తలు