వికాస గ్రంథాలు

6 Aug, 2017 00:21 IST|Sakshi
వికాస గ్రంథాలు

ఆత్మీయం

మన పురాణాలు వ్యక్తిత్వ వికాస సంపద భాండాగారాలు. అధునాతనమైన జీవనసరళిలో వేగం పెరిగిపోతూ విలువలు, ప్రమాణాలు తరిగిపోతున్నాయి. సాంకేతికంగా ఎన్నో విజయాలను సాధించాడు. కాని ప్రశాంతంగా బతకడం మాత్రం దుర్భరం అయిపోతోంది. ఒత్తిడికి, సంఘర్షణకు గురికావలసి వస్తోంది. ఆరోగ్యానికి దూరం కావడం, సాధారణమైన సుఖసంతోషాలకు కూడా నోచుకోలేకపోవడం పరిపాటి అవుతోంది. ఈ నేపథ్యంలో మనిషికి మార్పు చాలా అవసరం. ఆ మార్పు బాహ్యమైనది కాదు – లోపలి మనిషికి. తరతరాలుగా తనలో జీర్ణమైన కొన్ని చాదస్తాలను, మూఢనమ్మకాలను విడిచిపెట్టి, తన ప్రవర్తనలోని లోపాలను చక్కదిద్దుకోవాలి.

తద్వారా సమాజానికి పనికొచ్చే విధంగా తనను తాను మలచుకోవాలి. ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవడం, అభివృద్ధికరమైన ఆలోచనలకు స్థానం కల్పించడం, ప్రతికూల భావనలను పోగొట్టుకోవడం, సానుకూల దృక్పథాన్ని సాధించడం, ఆత్మన్యూనతాభావాన్ని జయించడం దిశగా కృషి చేయాలి. చిత్రమేమిటంటే, ఇవన్నీ సాధించేందుకు కావలసిన వ్యక్తిత్వ వికాస శిక్షణ మన పురాణాలలోనే ఉంది. భగవద్గీత, రామాయణం, మహాభారతాలను  మించిన వ్యక్తిత్వ వికాస గ్రంథాలు ఈ లోకంలో లేనేలేవు. విదేశీ వ్యక్తిత్వ వికాస గ్రంథాలలో కూడా మన రామాయణ భారత భాగవతాలూ, భగవద్గీతలలోని అంశాలనే ఉదహరించడమే అందుకు నిదర్శనం.

మరిన్ని వార్తలు