ఈ వెంటిలేటర్‌ చిన్నదీ, చవకైనదీ!

11 Apr, 2020 06:39 IST|Sakshi

ఈ కథనంలో ఉన్న చిత్రంలో మీరు చూస్తున్న వెంటిలేటర్‌ అతి చిన్నదీ... చాలా చవకైనది. ‘ఏ–సెట్‌ రొబోటిక్స్‌’ అనే రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్రొఫెసర్‌ దివాకర్‌ వైష్‌ దీన్ని రూపొందించారు. ఈయన గతంలో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో మొట్టమొదటి 3–డీ ప్రింటెడ్‌ హ్యూమనాయిడ్‌ రోబోనూ (దీని పేరు మానవ్‌), మన మనసు ఆజ్ఞలతో నడిచే వీల్‌ చైర్‌నూ తయారు చేశారు. పూర్తిగా దేశీయంగా... తయారవుతున్న ఈ వెంటిలేటర్ల ప్రత్యేకతలు ఎన్నో ఎన్నెన్నో.

ఉదాహరణకు కొన్ని చూద్దామా? 

  •  ప్రపంచంలోనే అత్యంత చిన్న వెంటిలేటర్‌ ఇది. 
  • ఇది ఎంత చిన్నదంటారా? మన హాస్పిటళ్లలో ఉపయోగించే మామూలు వెంటిలేటర్ల సైజులో దీనిది 450వ వంతు. అంటే ఓ సాధారణ వెంటిలేటర్‌ స్టాండ్‌తో కలిపి దాదాపుగా ఓ చిన్న పిల్లాడి సైజ్‌ అంత ఉంటే... ఇది మాత్రం వాడి జేబులో పట్టేంత చిన్నదిగా ఉంటుంది. మరో పోలిక చెప్పాలంటే... మన ఇళ్లలో వాడే ‘ఫ్లెక్స్‌ బాక్స్‌’ అంత ఉంటుంది. చూడ్డానికి దాదాపూ అలాగే ఉంటుంది. 
  • ఈ వెంటిలేటర్‌ను బ్లూటూత్‌తో, మన స్మార్ట్‌ఫోన్‌లోని ఒక ఆప్‌ సహాయంతో ఇంట్లోనూ వాడుకోవచ్చు. 
  • దీన్ని వాడటానికి ఆక్సిజన్‌ సిలెండర్‌ కూడా అక్కర్లేదు. 
  • ఎటూ కదలలేకుండా ఉంటే పక్షవాతం రోగులు దీన్ని కొని ఇంట్లోనే వాడుకోవచ్చు. 
  • దీని ఖరీదూ, సైజూ చిన్నదైనందున పెద్ద పెద్ద నగరాల్లోని హాస్పిటల్స్‌ మాత్రమే కాదు... చిన్న చిన్న పట్టణాలూ, పల్లెల్లోని డాక్టర్లు సైతం దీన్ని వాడుతూ... సంక్లిష్టమైన స్థితిలో ఉన్న రోగిని నగరానికి చేర్చే వరకు ప్రాణాలను కాపాడవచ్చు.

మామూలు వెంటిలేటర్‌ ధర దాదాపు ఐదారు లక్షల రూపాయల నుంచి రూ. 15 లక్షల వరకు ఉంటుంది. కానీ దీని ధర అటు ఇటుగా దాదాపుగా పదిహేనువేల రూపాయలు మాత్రమే. అంటే మామూలు పెద్ద వెంటిలేటర్ల ధరలో వందో వంతు.  రేయింబవళ్లూ కష్టపడి నెల రోజుల్లోపల కనీసం 20,000 వెంటిలేటర్లను మన హాస్పిటల్స్‌కు అందిస్తానని గత నెల 22న ప్రొఫెసర్‌ దివాకర్‌ వైష్‌ ట్వీట్‌ చేశారు. అంటే... మరో పదిహేను రోజుల్లో ఈ కొత్త వెంటిలేటర్లను మనం వాడటమే కాదు... అతి త్వరలోనే... మొన్నటి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌లాగే ప్రపంచానికీ అందించగలం. అదీ మన సత్తా!!

మరిన్ని వార్తలు