ఉంగరం  ఉన్న చోట్ల నల్లబడుతోంది.. ఏం చేయాలి?

11 May, 2018 00:25 IST|Sakshi

ఫ్యామిలీ డాక్టర్‌

డర్మటాలజీ కౌన్సెలింగ్‌

నేను ఉంగరం పెట్టుకునే చోట వేలు నల్లబడుతోంది. మంటగా ఉండటంతో పాటు వేలిపై దురద వస్తోంది. నాకు తగిన సలహా ఇవ్వండి.  – నవీన, సామర్లకోట 
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీకు ‘కాంటాక్ట్‌ డర్మటైటిస్‌’ ఉన్నట్లు తెలుస్తోంది.   మీరు ఏదైనా సబ్బుగానీ లేదా డిటెర్జెంట్‌ గాని ఉపయోగిస్తుంటే... దాని మిగిలిపోయిన భాగం ఉంగరం వెనక ఉండిపోయి, అది చర్మానికి ఆనుకుంటూ ఉండవచ్చు. దాంతో అలా ఆ సబ్బు లేదా డిటెర్జెంట్‌ ఆనుకొని ఉండేచోట అలర్జీ వస్తోంది. ఇతర లోహాల మిశ్రమాల (అల్లాయ్స్‌)తో చేసే ఆభరణాల వల్ల కూడా అలర్జీ వచ్చే అవకాశం ఉంది. మీరు ఈ కింద సూచించిన జాగ్రత్తలు తీసుకోండి. 

∙మీ ఉంగరాన్ని తరచూ తీసి శుభ్రం చేసుకొని మళ్లీ ధరించండి. 
∙మీరు చేతులు కడుక్కునే సమయంలో వేళ్లన్నీ శుభ్రమయ్యేలా చూసుకోండి. 
∙ఉంగరాన్ని వేరే వేలికి తొడిగేందుకు అవకాశం ఉంటే, మీరు అలా కూడా మార్చి చూడవచ్చు. 
∙చర్మం నల్లగా అయ్యే ప్రాంతంలో హ్యాలోమెటాజోన్‌ వంటి మైల్డ్‌ కార్టికోస్టెరాయిడ్‌ ఉన్న క్రీమును రెండు వారాల పాటు రాయండి. 
అప్పటికీ సమస్య తగ్గకపోతే మీకు దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్‌ను సంప్రదించండి. 

జుట్టు విపరీతంగా రాలుతోంది...  పరిష్కారం చెప్పండి
నా వయసు 22 ఏళ్లు. నాకు జుట్టు విపరీతంగా రాలిపోతోంది. నా హెయిర్‌లైన్‌ కూడా క్రమంగా వెనక్కుపోతూ మాడు కనిపిస్తోంది. నేను అనిమిక్‌గా ఉంటాను. హిమోగ్లోబిన్‌  కూడా తక్కువే. కేవలం 10 శాతం మాత్రమే. దయచేసి నా జుట్టు రాలిపోకుండా ఉండటానికి తగిన సలహా ఇవ్వండి. 
– సుష్మా, ఖమ్మం 

జుట్టు రాలిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో పోషకాహార లోపం చాలా ప్రధానమైనది. పైగా మీ విషయంలో మీలో హిమోగ్లోబిన్‌ కేవలం 10 శాతం మాత్రమే అంటున్నారు. మీ రక్తహీతన కారణంగానే జుట్టు రాలిపోతూ ఉండవచ్చు. మీ వయసులో అంటే ఇరవైలలో ఉండే యువతలో ఇది చాలా సాధారణమైన విషయం. బహుశా మీ ఒత్తిడి కూడా జుట్టు రాలడానికి కారణం కావచ్చు. ఇవన్నీ  కలిసి మీలో జుట్టు రాలడం ఎక్కువయ్యేందుకు దోహదపడుతూ ఉండవచ్చు. మీరు  ఈ కింది సూచనలు పాటించండి. 
1) మీలో రక్తహీనతను తగ్గించుకోండి. మీ హిమోగ్లోబిన్‌ పాళ్లు కనీసం 14 శాతానికి పెరగాలి. ఇందుకోసం ఫెర్రస్‌ సల్ఫేట్‌ 50 ఎంజీ మాత్రలు రోజుకు ఒకటి చొప్పున, విటమిన్‌–సి 500 ఎంజీ మాత్రలు రోజుకు ఒకటి చొప్పున మూడు నెలల పాటు వాడండి. 
2) ఇక మీ జుట్టు రాలడాన్ని అరికట్టడం కోసం డాక్టర్‌ సలహా మేరకు బయోటిన్‌ 10 ఎంజీ, సాపాల్మెథో  లేదా ఇతర అమైనో యాసిడ్‌లను రోజుకు ఒకసారి చొప్పున భోజనం తర్వాత మూడు నెలల పాటు తీసుకోండి. 
3) మీ జీవనశైలి (లైఫ్‌స్టైల్‌)లో మార్పులు చేసుకోవడం చాలా అవసరం. మీరు రోజూ కనీసం ఎనిమిది గంటల పాటు హాయిగా, గాఢంగా నిద్రపోయేలా చూసుకోండి. 
4) పై సూచనలన్నీ పాటించాక కూడా మీ జుట్టు రాలడం తగ్గకపోతే ప్లేట్‌లెట్‌ రిచ్‌ ప్లాస్మా చికిత్స, మీసోథెరపీ వంటి ప్రక్రియల ద్వారా మీ జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు.

నుదుటి  చర్మం  మందంగా మారుతోంది... ఎందుకు?
నా వయసు 50 ఏళ్లు. నా ఒంటి రంగు గోధుమ వర్ణంలో ఉంటుంది. అయితే గత ఏడాది కాలం నుంచి నా నుదుటి మీద చర్మం నల్లగా మారుతోంది. మందంగా కూడా అవుతోంది. కణతల వద్ద, మెడ మీద, చంకల వద్ద, నడుము దగ్గర ఇలాగే అవుతోంది. ప్రధానంగా చర్మం మడతలు పడ్డ చోట ఇలా జరుగుతోంది. నాకు కొంచెం ఆందోళనగా ఉంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. 
– కె. కృష్ణమూర్తి, నిజామాబాద్‌ 

మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు ‘ఆకాంథోసిస్‌ నైగ్రిక్యాన్స్‌’ అనే కండిషన్‌తో బాధపడుతున్నారు. ఇది ‘ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌’ వల్ల జరుగుతున్న పరిణామం. సాధారణంగా స్థూలకాయుల్లో ఇలా జరుగుతుంది. దీన్ని ‘హెచ్‌ఓఎమ్‌ఏ–ఐఆర్‌’ అనే పరీక్షతో నిర్ధారణ చేయవచ్చు. రక్తంలోని సీరమ్‌ ఇన్సులిన్‌ ఎక్కువ కావడం వల్ల దీన్ని నిర్ధారణ చేయడం సాధ్యమవుతుంది. అలా ఇది రక్త పరీక్షలో బయటపడుతుంది. దీనికి చికిత్స ఈ కింది విధంగా జరుగుతుంది. 

∙బరువు తగ్గించుకోవడం ∙జీవనశైలిని మార్చుకోవడం (అంటే సరైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, వేళకు నిద్రపోవడం, ఒత్తిడి తగ్గించుకోవడం ∙మేని రంగును చక్కబరిచేందుకు మందులు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మేని ఛాయ క్రమంగా మెరుగువుతుంది. ఇందుకోసం పూత మందుగా ఉపయోగించాల్సినవి... – ఆర్బుటిన్‌ – లికోరైస్‌ – కోజిక్‌ యాసిడ్‌  
∙పైన పేర్కొన్న మందులతో పాటి క్లిగ్‌మెన్స్‌ రెజీమ్‌ అనే ప్రక్రియను రోజు విడిచి రోజు రాత్రివేళ అమలు పరచాలి ∙యాభైకు ఎక్కువగా ఎస్‌పీఎఫ్‌ ఉన్న సన్‌స్క్రీన్‌ను రోజూ ఉదయం తొమ్మిది నుంచి మధ్యానం రెండు వరకు రాసుకుంటూ ఉండాలి. ఒంటి లోపలి వ్యవస్థలను చక్కబరచడానికి యాంటీ ఆక్సిడెంట్‌ మాత్రలు, విటమిన్‌ సి కాప్సూ్యల్‌  వంటివాటితో పాటు డాక్టర్‌ సలహా మేరకు మెట్‌ఫార్మిన్‌ –500ఎంజీ ప్రతిరోజూ వాడాలి. 

ఇతర ప్రక్రియలు: ∙ఫీనాల్, టీసీఏ వంటి మందులతో కెమికల్‌ పీలింగ్‌ 4 – 6 సెషన్ల పాటు చేయించుకోవాలి ’ లేజర్‌ టోనింగ్‌ కూడా పిగ్మెంట్‌ను తగ్గించడంతో పాటు మందమైన చర్మం మామూలుగా కావడానికి, నలుపు తగ్గడానికి  ఉపయోగపడుతుంది. 
డాక్టర్‌ స్మిత ఆళ్లగడ్డ
చీఫ్‌ ట్రైకాలజిస్ట్‌ – డర్మటాలజిస్ట్, 
త్వచ స్కిన్‌ క్లినిక్,
గచ్చిబౌలి, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు