ఏళ్లే వచ్చి వయసును మళ్లిస్తుంటే...

6 Aug, 2018 01:38 IST|Sakshi

పదం పలికింది – పాట నిలిచింది

పెళ్లి తంతును ఎన్నిసార్లు వర్ణించినా ఇంకా ఏదో చెప్పడానికి మిగిలేవుంటుందా? మళ్లీ మళ్లీ విన్నదే. కానీ మళ్లీ మళ్లీ కూడా కొత్తగా అనిపిస్తుంది సిరివెన్నెల రాస్తే. మొగుడు చిత్రంలోని ‘చూస్తున్నా చూస్తువున్నా చూస్తూనేవున్నా’ పాటనోసారి చూస్తే...

‘పచ్చని మాగాణి చేలు పట్టుచీరగా కట్టి 
బంగరు ఉదయాల సిరులు నొసట బాసికంగా చుట్టి 
ముంగిట సంక్రాంతి ముగ్గులు చెక్కిట సిగ్గులుగా దిద్ది 
పున్నమి పదహారు కళలు సిగలో పూవులుగా పెట్టి 
దేవేరిగా పాదం పెడతానంటూ నాకు శ్రీవారిగా పట్టం కడతానంటూ
నవనిధులు వధువై వస్తుంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నేనైనట్టు’ 

పద్మము, శంఖము, నీలము లాంటి కుబేరుడి నవనిధులు ఏకంగా వధువై వస్తున్నాయంట! దీనికి కొనసాగింపుగా రెండో చరణంలో–

‘నీ సౌందర్యంతో ఇంద్రపదవి నెదిరిస్తాను నీ సాన్నిధ్యంలో 
నేను స్వర్గమంటే ఏదంటాను 
ఏళ్లే వచ్చి వయసును మళ్ళిస్తుంటే 
నేనే నీ వొళ్ళో పాపగ చిగురిస్తుంటే... చూస్తున్న’ 

దాంపత్యానికి ఫలశ్రుతి ఇదే కదా, మళ్లీ చిన్నారిగా భర్త కొత్తగా జీవం పోసుకోవడం! 2011లో వచ్చిన ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది కృష్ణవంశీ. యాడ్‌ఫిల్మ్‌ మేకర్‌ బాబు శంకర్‌ సంగీతం అందించారు. పాడింది కార్తీక్‌. తాప్సీ, గోపీచంద్‌ నటీనటులు. 

మరిన్ని వార్తలు