భార్య చేతిలో నేను కీలు బొమ్మనట!

23 Jul, 2014 00:08 IST|Sakshi
భార్య చేతిలో నేను కీలు బొమ్మనట!

మనోగతం
 
నాలో మొదటి నుంచి ప్రగతిశీల భావాలు ఎక్కువ. స్త్రీలంటే చాలా గౌరవం. చాలామంది పురుషులు భార్యను చిన్నచూపు చూస్తారు. వెటకారంగా మాట్లాడతారు. ఈ విషయంలో నేను మిగతావాళ్ల కంటే భిన్నంగా ఉంటాను. నా భార్యతో చాలా మర్యాదగా ప్రవర్తించేవాడిని. ఇది మా చుట్టాలలో చాలామందికి వింతగా అనిపించేది.

 ఒకసారి నేను ఒక ఫంక్షన్‌కు వెళ్లినప్పుడు ఒక పెద్దావిడ-
 ‘‘ఏం నాయనా...పెళ్లాం ఎంత చెబితే అంతేనట కదా!’’ అంది నవ్వుతూనే.
 నాకు మాత్రం ఎక్కడో చురుక్కుమంది.
 మరోరోజు, మరోచోట వరుసకు మామయ్య అయ్యే ఒకాయన-

 ‘‘ఆడవాళ్లకు అతి స్వేచ్ఛ ఇవ్వకూడదు...’’ అని ఏవేవో చెప్పడం మొదలు పెట్టాడు. ఆ రోజు కూడా కంటి నిండా నిద్ర లేదు. నేను ఎప్పుడూ శాంతంగా ఉంటాను. నాలో కోపం అనేది ఎప్పుడూ ఎవరూ చూసి ఉండరు. ‘శాంతమూర్తి’ అని కూడా నన్ను  ఆప్యాయంగా పిలిచేవారు ఉన్నారు. అలాంటి నేను మా పెద్దమ్మ కూతురు పెళ్లిలో పట్టలేనంత  కోపంతో ఊగిపోయాను.
ఒకడు అన్నాడు...‘‘పెళ్లాం చేతిలో కీలుబొమ్మగా ఉంటే ఎలా? కొన్నిరోజులైతే  నీతో బట్టలు కూడా ఉతికిస్తుంది’’ అని.

ఆ మాటలు విని, అతని చెంప మీద ఒక్కటిచ్చుకున్నాను. గట్టిగా అరిచాను.పెద్ద గొడవై పోయింది. చాలామందితో పాటు నాలోని కోపాన్ని నేను మొదటిసారిగా చూశాను. ఆరోజు మంచికో చెడుకో కోపంతో ఊగిపోయినా...ఇక అప్పటి నుంచి వెటకారపు మాటలు మాట్లాడే సాహసం ఎవరు చేయలేదు. మనకు అమ్మ ఉంటుంది. ఆమె ఆడదే. మనకు చెల్లి ఉంటుంది. ఆమె ఆడదే.. అయినప్ప టికీ ఆడవాళ్లంటే శత్రువుల్లా ప్రవర్తిస్తాం. చిన్నచూపు చూస్తాం. మాట్లాడతాం. ‘అలా మాట్లాడ కూడదు’ అని చెప్పడానికి మంచి మాటలు సరిపోనందుకు, చెయ్యెత్తి కొట్టాల్సి వచ్చినందుకు సంతోషించాలో బాధపడాలో తెలియడం లేదు!
 - డి.మూర్తి, మచిలీపట్నం

మరిన్ని వార్తలు