జుత్తు రాలుతోంది... చుండ్రు కూడా ఉంది...

19 Aug, 2013 23:34 IST|Sakshi
జుత్తు రాలుతోంది... చుండ్రు కూడా ఉంది...

నా వయసు 44. గత ఎనిమిది నెలల నుండి నాకు జుత్తు విపరీతంగా రాలిపోతోంది. అప్పుడప్పుడు చుండ్రు కూడా కనపడుతోంది. ఎన్నో మందులు, షాంపూలు వాడినా ప్రయోజనం కనపడలేదు. ఇదే సమస్య మా అమ్మాయి (18సం)కి కూడా ఉంది. ఆయుర్వేదంలో దీనికి పరిష్కారం తెలియజేయ ప్రార్థన.
 -సీతాదేవి, వరంగల్

శిరోజాల స్వరూపం, స్వభావం, దళసరి మొదలగు అంశాలు వారి వారి ప్రకృతిని బట్టి మారుతుంటాయి. వాటి పోషణ, ఆరోగ్యాలు మన చేతుల్లో ఉంటాయి. అవి సక్రమంగా స్వాభావికంగా పెరగడానికి దోహదపడే ఆహార విహారాలు ఒక వంతైతే, వాటికి హాని కలిగించే ప్రక్రియలకు దూరంగా ఉంచడం మరొక ముఖ్యాంశం.
 
 దోహదపడే అంశాలు
 ఆహారంలో ప్రోటీన్లు, ఐరన్, విటమిన్‌ఎ, డి, బి కాంప్లెక్స్ తగినంతరీతిలో ప్రతిదినం సేవించాలి. మొలకలు, ఖర్జూరం, నువ్వులు, బెల్లం, తాజాఫలాలు, బాదం, జీడిపప్పు వంటి ఎండు ఫలాలు, మునగకాడలు, ఆకుకూరలు, గుడ్లు, మాంసాహారాల్లో చక్కటి పోషక విలువలు ఉంటాయి. రోజూ కనీసం నాలుగైదు లీటర్ల నీళ్లు తాగితే మంచిది. ప్రతిరోజూ స్వచ్ఛమైన కొబ్బరినూనెతో తల మీద ఉన్న చర్మానికి మర్దన చేస్తూ, శిరోజాలకు కూడా రాసుకోవాలి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చాలా మంచిది. తగినంత వ్యాయామం చెయ్యడం ద్వారా తలపై స్వేదం జనించి రోమకూపాలు ఉత్తేజితమవుతాయి. కల్తీ లేని కుంకుడుకాయ, షీకాకాయలతో మాత్రమే తల రుద్దుకోవాలి.

 ప్రతికూలాంశాలు
 ఎక్కువగా డైయింగ్ చేయటం, కృత్రిమంగా డ్రైయింగ్ చేయటం: కొన్ని రకాల నీళ్లు (అతిగా ఉప్పు ఉండటం, పోషకాలు లేకపోవడం మొదలైనవి) కూడా జుత్తు రాలిపోవటానికి కారణమే. వాటితో తలస్నానం చేసినా, తాగినా హానికారకమే. కొంతమందికి కొన్నిరకాల షాంపూలు పడవు. అదేవిధంగా కొన్ని వ్యాధుల కోసం వాడే మందుల తాలూకు దుష్ర్పభావాలు కూడా జుత్తు రాలడానికి కారణమే.
 
 ఇతరత్రా కారణాలు: తలపైనున్న చర్మానికి కలిగే చుండ్రు, ఇతర ఫంగల్.. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, మానసిక ఒత్తిడి, ఆందోళనలు. స్త్రీలలో మెనోపాజ్ వయసులో సంభవించే హార్మోనుల అసమతుల్యతలు. వార్థక్యం సమీపిస్తున్నప్పుడు  వివిధ ధాతువుల యొక్క శైథిల్యం సహజమని గుర్తించాలి. అప్పుడు జుత్తు పలచబడటం సామాన్యమే కాని, వ్యాధి కాదు. కాబట్టి ప్రతికూలాంశాలను పరిశీలిస్తూ చికిత్స కొనసాగించాలి. సానుకూల ప్రక్రియలను అనునిత్యం పాటిస్తుండాలి.
 
 సాధారణ కేశవర్థక ఔషధాలు
 మహాభృంగరాజ తైలం/నీలిభృంగాది తైలం/కేశోవిన్ మొదలైన కేశతైలాలు నిత్యం వాడుకోవాలి.
 
 ఆరోగ్యవర్థని మాత్రలు ఉదయం 1, రాత్రి 1,  అశ్వగంధారిష్ట, సారస్వతారిష్ట ద్రావకాలను రెండేసి చెంచాలు ఒక గ్లాసులో కలుపుకుని సమానంగా నీళ్లు కలిపి రెండుపూట లా తాగాలి.
 
 గృహవైద్యం: వేపనూనెను తల మీది చర్మానికి క్రమం తప్పకుండా పూస్తూ ఉంటే చుండ్రు తగ్గుముఖం పడుతుంది.  పెరుగులో నానబెట్టిన మెంతులను ముద్దగా చేసి తల మీద రాసుకుంటే కేశాలకు బలవర్థకం. అదేవిధంగా ఉసిరికాయ ముద్ద కలబంద గుజ్జు కూడా కేశవర్థకం.
 
 గత పది నెలలుగా నాకు మలబద్దకం ఉంది. నేను నిర్లక్ష్యం చేయడంతో దానివల్ల ఆర్శమొలలు ఏర్పడ్డాయి. ఇంగ్లిషు మందులు వాడినా పెద్ద ప్రయోజనం లేదు. దీనికి ఆయుర్వేదంలో మంచి మందులుంటాయని నా మిత్రుడు చెప్పాడు. దయచేసి తగిన మందులు సూచించ గలరు.
 - డి. కామేష్, మెదక్ జిల్లా

 
 మీరు మీ వయసు ప్రస్తావించలేదు. కాని పెద్దవారన్న దృష్టితో రాస్తున్నాను. ప్రధానంగా మీరు మలబద్దకాన్ని తొలగించుకోవాలి. దానికి ఈ కింది సూత్రాలను పాటించండి. మలబద్దకం, ఆర్శమొలలు కూడా తగ్గుతాయి.
 
 పరగడుపున రెండులీటర్ల నీళ్లు తాగండి. రోజు మొత్తం మీద నాలుగు నుంచి ఆరు లీటర్లు తాగాలి  ఆగకుండా కనీసం ఓ అరగంట సేపు నడవాలి  శాకాహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
 
 పచ్చిసలాడ్లు, పీచు పదార్థాలు, తాజాఫలాలు తినాలి. డ్రైఫ్రూట్స్ కూడా తినాలి. పలుచని మజ్జిగ ఎక్కువగా తాగాలి. ఆహారంలో స్వచ్ఛమైన నువ్వులనూనెను ఉపయోగించాలి.

 ఔషధాలు
ఆరోగ్యవర్ధినీవటి (మాత్రలు): ఉదయం 1, రాత్రి 1  కాంకాయన వటి (మాత్రలు): ఉదయం 1, రాత్రి 1 అభయారిష్ట (ద్రావకం) నాలుగు చెంచాల మందుకి సమానంగా నీళ్లు కలిపి రాత్రి పడుకునేటప్పుడు రోజూ తాగాలి.
 
 డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి
 అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్), సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్,
 హుమయున్ నగర్, హైదరాబాద్

 

మరిన్ని వార్తలు