ప్యాడ్‌ ఛాలెంజ్‌

8 Feb, 2018 00:33 IST|Sakshi
‘ప్యాడ్‌మ్యాన్‌’

బహిష్టు సంబంధిత పరిశుభ్రత మీద ఇవాళ దేశమంతా మాట్లాడుతోంది. మెన్‌స్ట్రువల్‌ హైజీన్‌కు సంబంధించి కలిగించాల్సిన అవగాహన పట్ల అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. స్కూలు స్థాయి నుంచి ఆడపిల్లలకు  ఈ చైతన్యం అవసరం. ‘ప్యాడ్‌మేన్‌’ వంటి సినిమాలు, సెలబ్రిటీల  ‘ప్యాడ్‌ ఛాలెంజ్‌’ వంటివి ఈ ప్రచారానికి తోడ్పాటు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘ప్యాడ్‌’ వాడకంపై విస్తృత కథనం...

మహిళలకు అనివార్యమైన ఆ మూడు నుంచి ఐదురోజుల ఇబ్బందికరమైన సమయంలో అనుసరించాల్సిన పద్ధతులు, ఉపకరించే సాధనాలను వారు తమకు తామే రూపొందించుకున్నారు. సామాజికంగా వారికి ఎదురయ్యే అనేక సాంస్కృతిక అంశాలు, మూఢనమ్మకాల వంటి సవాళ్లు చుట్టుముట్టిన నేపథ్యంలో వాటికి అనుగుణంగా ఎలాగోలా తమ తమ ఆర్థిక, విద్యాపరమైన స్థోమతను బట్టి తమ తమ సొంత మార్గాలు అనుసరించారు. చాలా సందర్భాల్లో వారు అనుసరించిన మార్గాలు అంత సులువైనవీ, సౌకర్యవంతమైనవి కావు. మరీ ముఖ్యంగా పేద వర్గాల్లో అవి చాలా ఇబ్బందికరమైనవి. అయినా తమ ఇబ్బందికరమైన ఆ రోజులను ఎలాగోలా నెట్టుకొచ్చారు. వారి ఇబ్బందులు గమనించిన తమిళనాడులోని అరుణాచలం మురుగనంతం లాంటి వాళ్లు దానికి గురించి మాట్లాడటానికి ప్రయత్నించినా సమాజం వారిని ప్రోత్సహించలేదు. 

భారత్‌లో ఇదీ పరిస్థితి... 
మన భారతీయ సమాజంలో అత్యధికులు పేద వర్గాలే. మార్కెట్లో దొరికే ఖరీదైన ప్యాడ్స్‌ను కొనుగోలు చేయగలిగే ఆర్థిక స్తోమన ఉన్నవారు చాలా తక్కువ. 2016లోని ఒక అధ్యయన వివరాల ప్రకారం... దేశంలో 84% కౌమార బాలికలు, 92.2% తల్లులు ఇప్పటికీ నెలసరి సమయంలో గుడ్డను వాడుతున్నారు. ప్రభుత్వమే నిర్వహించిన ఒక సర్వే వివరాల ప్రకారం మన దేశంలో కేవలం 12% మంది మాత్రమే ప్యాడ్స్‌ వాడగలిగే స్థితిలో ఉన్నారు. దాంతో 37.8% మంది పెళ్లికాని యువతులు యోని దగ్గర దురద, దుర్వాసన వంటి సమస్యలతో బాధపడుతున్నారు.

సాధారణ గుడ్డను ఉపయోగించడంలో ఎదురయ్యే ఇబ్బందులు
►మళ్లీ ఉపయోగించే గుడ్డను వాడినప్పుడు, అది కాస్తంత అపరిశుభ్రంగా ఉన్నా మహిళలకు రీప్రోడక్టివ్‌ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్లు (యోని సంబంధిత ఇన్ఫెక్షన్లు – ఆర్టీఐ) రావచ్చు. 

►సాధారణంగా యోనిలో దాని రక్షణకు అవసరమైన హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ను స్రవించే లాక్టోబాసిల్లై అనే మంచి బ్యాక్టీరియాతో పాటు కొద్ది మోతాదులో వేరే బ్యాక్టీరియా కూడా జీవిస్తూ ఉంటుంది. గుడ్డ వంటి అపరిశుభ్రమైన పద్ధతుల వల్ల యోని సంబంధిత ఇన్ఫెక్షన్ల ముప్పు ఏర్పడి తర్వాతి కాలంలో సంతానలేమి, సెక్స్‌ వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే పెల్విక్‌ ఇన్‌ఫ్లమేటరీ వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. 

►మహిళల్లో మూత్రవిసర్జనకు ఉండే రంధ్రం నిడివి చాలా తక్కువగా ఉంటుంది. దాంతో హానికరమైన బ్యాక్టీరియా అక్కడ విస్తరిస్తే అది యూరినరీ ఇన్ఫెక్షన్స్‌కు దారి తీయడంతో పాటు బ్లాడర్‌ (మూత్రం నిల్వ ఉండే తిత్తి) వరకు పాకే ముప్పు ఉంటుంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో యూరినరీ ఇన్ఫెక్షన్లు పదే పదే తిరగబెడుతుండటానికి కారణం కూడా రుతుస్రావం సమయాల్లో పాటించే అపరిశుభ్రమైన పద్ధతులే.

వాడి పారేయగల ప్యాడ్స్‌ గురించి... 
►మిగతా వాటితో పోలిస్తే వాడి పారేసేందుకు అనువైన ప్యాడ్స్‌ స్త్రీల పరిశుభ్రతకు అనువైనవి. వాటిని ఉపయోగించాల్సిన తీరుతెన్నులు బాలికలకూ, యువతులకూ మహిళా టీచర్లు విపులంగా వివరించాలి. 
►ఉపయోగించిన ప్యాడ్స్‌ను తేలిగ్గా పారేసేలా కొంత మరుగుగా ఉన్న ప్రాంతాల్లో ‘డిస్పోజబుల్‌–బిన్స్‌’ ఏర్పాటు చేయాలి. అంటే స్కూళ్లలో, ఆఫీసుల్లో ఉండే టాయిలెట్స్‌లో, మహిళలు వేచి ఉండే ప్రాంతాలు, విశ్రాంతి స్థలాల్లోని మరుగు ప్రదేశాల్లో వాటిని ఉంచాలి. ఆ బిన్స్‌ను తరచూ శుభ్రపరుస్తూ ఉండాలి.
►వాడేసిన ప్యాడ్స్‌ను ‘సేఫ్‌గా డిస్పోజ్‌’ చేయాలి. అంటే లోతు గుంతలో వేసి కాల్చేయడం (పిట్‌ బర్నింగ్‌), బయటకు ఏమాత్రం పొగరానివ్వని విధంగా భస్మం చేయడం (ఇన్‌సినరేషన్‌) వంటి పద్ధతులు అవలంబించడం మేలు. ప్యాడ్‌ తయారైన మెటీరియల్‌ ఆధారంగా ఏది ఆరోగ్యకరమైన పద్ధతో ఆ పద్ధతిని ఎంచుకోవడం మేలు. 
►అంతే తప్ప వాటిని ఒకచోట కుప్పగా వేసి, బహిరంగంగా తగలబెట్ట రాదు.

ప్యాడ్స్‌లో సాధారణ రకాలు
1. పీల్చుకునే సాధనంగా ఉపయోగించే గుడ్డ : పాత చీరలూ, తువాళ్లు, పాత బెడ్‌షీట్లు వంటి వాటిని తమకు అనువైన రీతిలో కత్తిరించుకొని చాలా మంది వాడుతుంటారు. ఇవి దొరకడం చాలా తేలిక. దాంతో వీటిని తరచూ శుభ్రపరచుకొని ఉపయోగిస్తుంటారు. లభ్యత తేలికే అయిన శుభ్రపరచుకునేందుకు వారు కోరుకునే చాటు/మరుగు మన సమాజంలో అంత తేలిగ్గా దొరకదు. ఉతికేందుకు చోటూ, తగినంత నీరూ, సబ్బు, ఎండ తగిలేలా ఆరేసుకునేందుకు అనువైన ప్రదేశం దొరకడం చాలా కష్టం. పైగా ఇన్ని సౌకర్యాలు లేకపోతే వాటిని మళ్లీ ఉపయోగించడం వల్ల దురద,  దుర్వాసన వంటి మరికొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. చెమ్మ ఉంటే ఇన్ఫెక్షన్లకూ దారితీస్తుంది. అలాంటి అనారోగ్యకరమైన, అపరిశుభ్రమైన పరిస్థితులు మన దేశపు పల్లెప్రాంతాల్లోని పేదవర్గాల్లో చాలా ఎక్కువ. 
2. స్థానికంగా తయరయ్యే మళ్లీ ఉపయోగించేందుకు వీలున్న న్యాప్కిన్లు : దాదాపు 6–12 సార్లు ఉపయోగించేందుకు వీలైన స్థానిక ప్యాడ్స్‌ కొన్ని చోట్ల లభ్యమవుతున్నాయి. ఇవి మాటిమాటికీ ఉపయోగపడేవి కావడంతో దాదాపు శిథిలమయ్యేవరకు ఉపయోగించే వీలుండటం వల్ల పర్యావరణానికీ హాని చేయవు. అయితే పైన పేర్కొన్నట్లే శుభ్రపరచడానికి (లాండ్రీయింగ్‌)కు వీటికి చోటు కావాలి. 
3. ఉపయోగం తర్వాత పారేసేందుకు అనువైన వాణిజ్య ఉత్పాదనలు : ఇప్పుడివి మరీ మారుమూల ప్రాంతాలు మినహాయించి, ఒక మోస్తరు పెద్ద పల్లెల వరకూ విస్తారంగా లభిస్తున్నాయి. తగినంత పరిశోధన తర్వాత ఆరోగ్యకరమైన రీతిలో రూపుదిద్దుకున్న న్యాప్కిన్లు ఇవి. అయితే అందరూ కొనలేని కారణంగా, ఆర్థికంగా  అందరికీ అందుబాటులో లేకపోవడం, ఒక్క ఉపయోగం తర్వాత వ్యర్థాలుగా మారడంతో శిథిలం కావడానికి కాస్తంత ఎక్కువ సమయం తీసుకోవడంతో ఇవి పర్యావరణానికి అంత అనువుగా లేవు. అందుకే వాడాక కొంత జాగ్రత్తగా వీటిని పారేయాల్సి ఉంటుంది. 

ఆరోగ్య సమస్యల ముప్పు తగ్గించడానికి పాటించాల్సిన పరిశుభ్రత సూచనలు
రుతుస్రావం సమయంలో పరిశుభ్రత (మెన్‌స్ట్రువల్‌ హైజీన్‌) పాటించకపోతే చాలా ఆరోగ్య సమస్యలొస్తాయి. అవి రాకుండా ఉండాలంటే పాటించాల్సిన సూచనలివే... 

01. తిరిగి ఉపయోగించగలిగేవైనా లేదా వాడాక పడేసేవైనా సురక్షితమైన రీతిలో ఉపయోగించాలి. ఈ ప్రయోజనం కోసం గుడ్డ కంటే ప్యాడ్‌ మేలు. 

02. ప్యాడ్‌ తరచూ మార్చుకోవాలి : మన రక్తం దేహాన్ని వదలగానే మన శరీరంలో ఉండే కొన్ని క్రిములతో కలిసి కలుషితం అవుతుంది. అంటే పరిశుభ్రత పాటించకపోతే వ్యాధులను కలిగించేలా మారుతుంది. ప్యాడ్‌ రక్తంతో తడిసినప్పుడు యోనిలో ఉండే బ్యాక్టీరియా క్రిములు, యోని పరిసరాల్లో స్రవించిన చెమటలోని క్రిములతో నిండిపోతుంది. అదే చెమ్మ అలాగే ఎక్కువసేపు కొనసాగింతే ఆ క్రిములు మరింతగా వృద్ధి చెందేందుకు అనువైన వాతావరణం ఏర్పడుతుంది. దాంతో ఆ క్రిములు అపరిమితంగా పెరిగి మూత్రసంబంధమైన, యోని సంబంధిత ఇన్ఫెక్షన్లు, చర్మం ఎర్రబారడం, దురద వంటి సమస్యలు రావడానికి దారి తీయవచ్చు. అందుకే వీలైనంత త్వరత్వరగా ప్యాడ్స్‌ మార్చేయాలి. ఎంత వ్యవధిలో వాటిని మార్చాలన్నది వారి వారి సౌకర్యాన్ని బట్టి ఉంటుంది. సగటున ప్రతి ఆరుగంటలకు ఒకసారి మార్చడం మంచిది. 

03. రుతు సమయంలో స్రవించే రక్తం యోని ముఖద్వారం, దాని చుట్టూ ఆవరించే ఉండే లేబియా చర్మంలో కొన్ని చుక్కలు ఉండవచ్చు. దాని వల్ల దుర్వాసన వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక తరచూ యోని ప్రాంతాన్ని కడుక్కుంటూ ఉండాలి. 

04. యోని కడిగేందుకు సబ్బు లేదా ఇతర ఉత్పాదనలు వాడకండి. సబ్బు లేదా ఇతర ఉత్పాదనలు వాడినప్పుడు చెడు బ్యాక్టీరియాతో పాటు యోనికి మేలు చేసేందుకు ఉద్దేశించిన మంచి బ్యాక్టీరియా కూడా ప్రక్షాళన ప్రక్రియలో నశించిపోతాయి. అందుకే కాస్తంత గోరువెచ్చని నీటితోనే శుభ్రం చేసుకోవడం మేలు. 

05. యోని ప్రాంతాన్ని శుభ్రం చేసుకునే సమయంలో ఎప్పుడూ మీ చేతిని కింది నుంచి పై వైపునకు కదిలిస్తూ శుభ్రం చేసుకోండి. దీనికి వ్యతిరేక దిశలో వద్దు. మీ ప్రైవేటు పార్ట్స్‌ను  పై నుంచి కిందివైపునకు శుభ్రం చేసుకుంటే యోని దగ్గర ఉండే క్రిములు కింద మలవిసర్జన ద్వారం నుంచి లోపలికి ప్రవేశించి, అక్కడికి ఇన్ఫెక్షన్స్‌ను వ్యాపి చేసే అవకాశం ఉంటుంది. 

06. ఉపయగించి తీసేశాక ఆ ప్యాడ్‌ను జాగ్రత్తగా వదిలించుకోవాలి (డిస్కార్డ్‌ ప్రాపర్లీ): ఉపయోగించిన న్యాప్కిన్‌ లేదా టాంపూన్‌ వల్ల దుర్వాసన లేదా ఇన్ఫెక్షన్‌ వ్యాపించడానికి అవకాశం ఉంటుంది. అందుకే దాన్ని వాడాక పారేసేముందర ఏదైనా శుభ్రమైన పేపర్‌లో చుట్టి (ర్యాప్‌ చేసి) దూరంగా పొడిప్రాంతాల్లో పడేయాలి. టాయిలెట్‌ రంధ్రంలో వేసి ఫ్లష్‌ చేయడం సరైన పద్ధతి కాదు. అది మీ టాయిలెట్‌లో అడ్డంకిగా మారి మరో సమస్యను సృష్టించవచ్చు. న్యాప్కిన్‌ను పారేశాక మీ చేతులు శుభ్రంగా కడుక్కోవడం మరచిపోకండి. 

07. ప్యాడ్‌తో వచ్చే ర్యాష్‌తో జాగ్రత్త : ఒక్కోసారి రక్తస్రావం ఎక్కువగా ఉన్నవారిలో  ప్యాడ్‌ చాలాసేపు తడిగా ఉండి తొడలు, తొడలోపలి భాగాల్లో దురద రావడం, ఎర్రగా మారడం, ర్యాష్‌ రావడం జరగవచ్చు. అందుకే ప్యాడ్స్‌ను తరచూ మార్చడం ఎంత ముఖ్యమో, ఆ ప్రాంతాన్ని ఎప్పుడూ పొడిగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం. ఒకవేళ అప్పటికే మీకు అక్కడ ర్యాష్‌ ఉంటే ప్యాడ్‌ వాడే సమయంలోనే మరింత జాగ్రత్తతో ఉండటం చాలా అవసరం. అలాగే డాక్టర్‌ సలహా మేరకు యాంటీసెప్టిక్‌ ఆయింట్‌మెంట్‌ను స్నానం తర్వాత, పడుకునే ముందర రాసుకోవాలి. ఇలాంటి సమస్య ఉంటే  బిడియపడకుండా తప్పక డాక్టర్‌ను సంప్రదించండి. మీకు సహాయం చేయడం కోసమే డాక్టర్లు ఉంటారు. అంతేగానీ ‘ఇదేమిటీ’ అంటూ వారేమీ చెడుగా అనుకోరు. అన్యథా భావించరు. మీ సమస్య గురించి వేరే ఎక్కడా చర్చించరు. వారు అక్కడికక్కడే ఆ విషయాన్ని మరచిపోతారు. 

08. ఒకసారికి ఒక్క ప్యాడ్‌ మాత్రమే: ఒకసారి ఒక్కటే ప్యాడ్‌ను వాడండి. అంతేగానీ హెవీ బ్లీడింగ్‌ అవుతోంది కదా అని రెండు ప్యాడ్స్‌ వాడకండి. రెండు వాడటం వల్ల కింది ప్యాడ్‌ రక్తాన్ని పూర్తిగా పీల్చుకునే అవకాశం ఉండదు. పై ప్యాడ్‌ రక్తంతో తడిసి, చెమ్మగా చాలాసేపు ఉండిపోతుంది. కిందిది పొడిగానే ఉంది కదా అని మీరు మార్చడానికి చాలాసేపు ఉంచుతారు. దాంతో పైనున్న తడిప్యాడ్‌లో ఇన్ఫెక్షన్‌ కలిగించే బ్యాక్టీరియా వృద్ధి చెంది మీకు ఇన్ఫెక్షన్స్‌ కలిగిస్తాయి. ర్యాష్‌ కూడా రావచ్చు. ఇక కొన్ని సందర్భాల్లో రెండు ప్యాడ్స్‌ ఉండటం అంత సౌకర్యం కాకపోవచ్చు కూడా.

09. రుతు సమయంలో క్రమం తప్పకుండా స్నానం చేయండి : రుతుసమయాల్లో మహిళలు స్నానం చేయకూడదంటూ కొన్ని సంస్కృతుల్లో మహిళలకు ఆంక్షలు ఉంటాయి. కానీ రుతుసమయంలో మహిళలు తప్పనిసరిగా రోజూ స్నానం చేయాలి. స్నానం వల్ల వారి ప్రైవేట్‌ పార్ట్స్‌ పూర్తిగా శుభ్రం కావడమే కాదు వారిలో మెన్‌స్ట్రువల్‌ క్రాంప్స్‌ రాకుండా ఆ శుభ్రత దోహదపడుతుంది. అంతేకాదు ఎక్కడా ఏ అడ్డులేకుండా స్రావాలు ఫ్రీగా ప్రవహించేందుకూ స్నానం ఉపయోగపడుతుంది. స్నానం తర్వాత ఉండే ఆహ్లాద భావనతో మహిళలు చాలా హాయిగా ఫీలవుతారు. 

10. మీ ప్యాడ్స్‌ను రెడీగా ఉంచుకోండి: రుతుస్రావం మొదలయ్యాక ప్యాడ్‌ను వెతుక్కోవడమో, ప్యాడ్‌ పారేయాల్సిన సమయంలో అవి లేవని గుర్తించి, షాప్‌కు వెళ్లడమో కాకుండా మొదట్నుంచే ప్యాడ్స్‌ను రెడీగా పెట్టుకోండి. మీరు స్కూల్‌కు లేదా కాలేజీకి వెళ్లే యువతి అయినా, లేదా బయటకు వెళ్లి పనిచేసే వర్కింగ్‌ ఉమన్‌ అయినా శానటరీ న్యాప్కిన్స్‌ లేదా ప్యాడ్స్‌ను ఎప్పుడూ నిల్వ ఉంచుకోండి. పరిశుభ్రమైన మీ బ్యాగ్‌లో ఒక పేపర్‌లో చుట్టి ప్యాడ్‌నూ, మృదువైన ఒక తువ్వాలను, లేదా కొన్ని పేపర్‌ న్యాప్కిన్స్‌నూ, చేతులు శుభ్రపరచుకునే హ్యాండ్‌ వాష్‌ (హ్యాడ్‌ శానిటైజర్‌)నూ, కాస్తంత పెద్దమొత్తంలోనే తినుబండారాలనూ (హెవీ శ్నాక్‌), ఒక వాటర్‌బాటిల్‌నూ, ఒక యాంటీసెప్టిక్‌ ట్యూబ్‌నూ దగ్గరుంచుకోండి. 

ఇవీ ప్రభుత్వ మార్గదర్శకాలు
కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని తాగునీరు, పారిశుధ్ధ్య మంత్రిత్వ శాఖ వారు రుతుస్రావ సమయంలోని పరిశుభ్రత విషయంలో 2015లో కొన్ని మార్గదర్శకాలు రూపొందించారు. అలాగే స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలోనూ  కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. వాటిలోని ముఖ్యంశాలు ఇవి. 
1.    అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, వర్కర్లకు రుతుస్రావ సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత విషయమై శిక్షణ ఇచ్చి అది మహిళలందరికీ చేరేలా చూడాలి. 
2.    స్వయంసేవాసంఘాల (సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూపుల) ద్వారా శానిటరీ నాప్కిన్స్‌ గ్రామీణ ప్రాంతాలకూ చేరేలా జాగ్రత్తలు తీసుకోవాలి. 
3.    కౌమారవయసులోని బాలికల సాధికారత కోసం ఉద్దేశించిన ఎస్‌ఏబీఎల్‌ఏ కార్యక్రమం, సమీకృత బాలల అభివృద్ధి (ఇంటిగ్రేటెడ్‌ ఛైల్డ్‌ డెవలప్‌మెంట్‌) కార్యక్రమాలు, మహిళా ఆర్థిక్‌ వికాస్‌ మహామండల్‌ కింద పనిచేసే స్వయం సేవా సంఘాల ద్వారా రుతుస్రావ పరిశుభ్రత అవసరాలను మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని స్కూల్‌ పిల్లల వరకూ చేర్చాలి. 
4.    కొత్తగా యుక్తవయసుకు వచ్చిన బాలికల కోసం ‘అడాలసెంట్‌ రీసోర్స్‌ సెంటర్స్‌’ ద్వారా కౌన్సెలింగ్‌ కార్యకలాపాలను నిర్వహింపజేయాలి. 
5.    కొత్తగా యుక్తవయసుకు వచ్చిన బాలలకు ఏర్పడే అవసరాల గురించి, ఆ బాలలు అనుసరించాల్సిన పద్ధతులు, సంబంధిత అంశాల గురించి అన్ని స్కూళ్లలోనూ, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలోనూ నోడల్‌ టీచర్లు విపులంగా వివరించాలి. 
6.    స్కూలుకు వెళ్లే వయసున్న బాలబాలికలకు తగిన అవగాహన కల్పించేలా ‘రాష్ట్రీయ బాల్‌ స్వాస్థ్య కార్యక్రమ్‌’ కోసం ఉద్దేశించిన కార్యకర్తలు కృషిచేయాలి. 
7.    యుక్తవయసుకు వచ్చిన బాలికలకు రుతుసమయంలో పాటించాల్సిన పరిశుభ్రత పద్ధతుల (మెన్‌స్ట్రువల్‌ హైజీన్‌ మేనేజ్‌మెంట్‌–ఎమ్‌హెచ్‌ఎమ్‌)తో పాటు ఆ వయసులో కిశోర బాలబాలికలకు ఏర్పడే సందేహాల నివృత్తి కోసం ‘రాష్ట్రీయ కిశోర్‌ స్వాస్థ్య కార్యక్రమ్‌’ కింద సేవాకార్యకర్తలు పాటుపడాలి. 
8.    రుతుసమయంలో పాటించాల్సిన పరిశుభ్రత పద్ధతుల (మెన్‌స్ట్రువల్‌ హైజీన్‌ మేనేజ్‌మెంట్‌–ఎమ్‌హెచ్‌ఎమ్‌) గురించి నేషనల్‌ రూరల్‌ లైవ్‌లీహుడ్‌ మిషన్‌ కింద పనిచేసే స్వచ్ఛంద సేవా సంస్థలు యువతుల్లో, మహిళల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి.

మురగనాథమ్‌  చేసిన కృషి
తమిళనాడుకు చెందిన అరుణాచలం మురుగనాథమ్‌ అనే  వ్యక్తి తన అసాధారణ కృషితో  మూడున్నర కోట్ల శానిటరీ న్యాప్‌కిన్‌ మెషిన్‌ను కేవలం రూ. 65 వేలకే తయారు చేశాడు. దాని సహాయంతో స్వయం సేవా సంఘాల ద్వారా 29 రాష్ట్రాలు ఉన్న మన దేశంలోని 23 రాష్ట్రాలలో ప్యాడ్స్‌ను చాలా చవకగా అమ్ముతున్నాడు. ఆయన సేవలకుగాను 2016లో ఆయనను కేంద్రప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఆయన భూమికను ప్రముఖ బాలివుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ పోషించగా ‘ప్యాడ్‌మ్యాన్‌’ అనే చిత్రం దేశవ్యాప్తంగా ఈనెల 9 విడుదల కానుంది. సినిమా వంటి మాస్‌మీడియా ద్వారా ఈ సినిమా రుతుస్రావ పరిశుభ్రత, ప్యాడ్‌ అవసరాల గురించి అవగాహన కల్పించనుంది.  


ప్యాడ్‌ వాడకంపై  ప్రచారం: ట్వింకిల్‌ఖన్నా, దీపికా పదుకోన్, కత్రినాకైఫ్‌ 

మరిన్ని వార్తలు