వెన్నునొప్పి తగ్గేదెలా..?

10 Apr, 2017 12:18 IST|Sakshi

స్పోర్ట్స్ - ఫిట్‌నెస్ :  నా వయసు 34. నేను చాలాసేపు కూర్చుని పనిచేస్తుంటాను. కంప్యూటర్ మీద ఒక్కోసారి గంటల తరబడి పనిచేయాల్సి ఉంటుంది. నాకు ఇటీవల విపరీతమైన వెన్నునొప్పి వస్తోంది. ఒక ఫ్రెండ్‌తో మాట్లాడితే వెన్నుపూసలు అరిగిపోవడం వల్ల కావచ్చని, సర్జరీ చేయించాల్సి ఉంటుందని అన్నాడు. నాకు సర్జరీ అంటే భయం. వెన్నునొప్పి తగ్గాలంటే ఏం చేయాలి? తగిన సలహా ఇవ్వండి.
- వెంకటేశ్వరరావు, హైదరాబాద్

మీరు చెప్పినట్లుగా చాలాసేపు కూర్చోవడం, ఎక్కువగా కంప్యూటర్ మీద పనిచేయడంతో పాటు మనం నిల్చునే, కూర్చునే భంగిమలలో పొరపాట్లు, అకస్మాత్తుగా వంగటం, ఒక్కసారిగా బరువులు ఎత్తటం, ఎక్కువసేపు డ్రైవింగ్ చేయడం, అధిక బరువు, వయసు పెరగటం వల్ల శరీరంలో చోటుచేసుకొనే మార్పులు, కొన్ని నరాల జబ్బులు... వంటి అనేక అంశాల వల్ల వెన్నునొప్పి వస్తుంటుంది. చాలా మంది వెన్నునొప్పి ఉన్నప్పుడు అది వెంటనే తగ్గాలని కోరుకుంటుంటారు. అలా తగ్గగానే మళ్లీ తమ పనులు మొదలుపెడుతుంటా రు. దీనికి బదులు నొప్పి వచ్చినప్పుడు మీరు వెన్నుకు కాస్త విశ్రాంతి ఇవ్వండి. అలా చేశాక కూడా తగ్గకపోతే నొప్పి తీవ్రతను బట్టి  కొన్ని పరీక్షలు అవసరం. అవసరాన్ని బట్టి ఎక్స్-రేలు, ఎంఆర్‌ఐ స్కాన్, సీటీ స్కాన్, బోన్ స్కాన్‌లు వంటివి తీయించాల్సి ఉంటుంది.

నొప్పి తగ్గడానికి కొన్ని సూచనలు
కొద్దిపాటి విశ్రాంతి తర్వాత అలా మళ్లీ నొప్పి రాకుండా ఉండాలంటే మెడ, వెన్నుకు సంబంధించిన కొన్ని వ్యాయామాలు చేయడం చాలా అవసరం. ఇక మనం కూర్చునే సమయంలో సరైన భంగిమలో కూర్చోవాలి. ఒకవేళ మనం తప్పుడు భంగిమల్లో  (ఫాల్టీ పోశ్చర్) కూర్చుంటుంటే వాటిని సరిదిద్దుకోవాలి. పనిచేసే చోట ఏ పోశ్చర్‌లో కూర్చుంటే ఎక్కువ నొప్పి వస్తుందో తెలుసుకుని దాన్ని చక్కదిద్దుకోవాలి. వెన్నునొప్పి నివారణకు యోగా కూడా మంచి మార్గమే. అయితే అది నిపుణులైన పర్యవేక్షకుల సమక్షంలో మాత్రమే చేయాలి. ప్రతి వెన్నునొప్పికీ సర్జరీ పరిష్కారం కాదు. ఏదైనా యాక్సిడెంట్స్ వల్ల నొప్పి వచ్చినప్పుడు లేదా మరికొన్ని ప్రత్యేక సందర్భాల్లో మినహాయిస్తే మిగతా సందర్భాల్లో... ప్రతి వెన్నునొప్పికీ సర్జరీ అవసరం పడదు. కాబట్టి మీ పనిలో తరచూ లేస్తూ ఉండటం, మీరు కూర్చునే భంగిమ మార్చుకోవడం వంటి సూచనలు పాటించండి. అప్పటికీ నొప్పి తగ్గకపోతే ఒకసారి డాక్టర్‌ను సంప్రదించండి.

డాక్టర్ భక్తియార్ చౌదరి
స్పోర్ట్స్ మెడిసిన్, ఫిట్‌నెస్ నిపుణుడు, హైదరాబాద్
 

మరిన్ని వార్తలు