వ్యవస్థ పిక్కటిల్లేలా గట్టిగా అరవాలనుంది!

27 Jul, 2017 23:06 IST|Sakshi
వ్యవస్థ పిక్కటిల్లేలా గట్టిగా అరవాలనుంది!

రెండు చెవులూ బాగా పని చేస్తున్న మన పిల్లలు
సివిల్స్‌లో టాప్‌ ర్యాంకులు కొడుతున్నారా?
టెన్త్‌లో, ఇంటర్‌లో, డిగ్రీలో అదరగొట్టేస్తున్నారా?
అప్పుడేం చేస్తాం?
దండలేస్తాం.. కిరీటం పెడతాం.. ఊరేగిస్తాం..
సభ పెట్టించి చప్పట్లు కొడతాం!
నేహాకు చిన్నప్పుడే చిన్న వినికిడి లోపం వచ్చింది.
కానీ క్లాసులో ఎప్పుడూ ఫస్ట్‌ వచ్చింది!
సివిల్స్‌లోనూ మంచి ర్యాంక్‌ సాధించింది.
అయితే తనని ‘పోస్టింగ్‌’కి ఫెయిల్‌ చేసేశారు!!
తనెంత బతిమాలినా, బామాలినా, ప్రాధేయపడినా...
చివరికి కాళ్లావేళ్లా పడినా..  
ప్చ్‌... వాళ్లకు వినిపించలేదు.
కనీసం.. వినిపించుకోలేదు!
వినికిడి లోపం నేహాకా? వినిపించుకోని వ్యవస్థకా?
అదే మన బిడ్డ అయితే మనం ఊరుకుంటామా?
పోరాడమా?
నేహ కోసం కూడా మనందరం పోరాడదాం.
ఆమెకు అండగా ఉందాం.


ఆ అమ్మాయి పేరు నేహ. చిన్నప్పుడు ఒక జ్వరం కారణంగా వినికిడి శక్తి కోల్పోయింది. అయితే కాక్లియర్‌ శస్త్రచికిత్సతో ఆ లోపాన్ని అధిగమించింది. కష్టపడి సివిల్స్‌లో మంచి ర్యాంక్‌ తెచ్చుకుంది. ఆ ర్యాంక్‌కు ఆమెకు ఉద్యోగం వచ్చి తీరాలి. కానీ ఆమె ఉద్యోగానికి అనర్హురాలంటూ వినికిడి పరీక్షల ద్వారా అధికారులు నిర్ణయించారు. అయితే తన వినికిడి సామర్థ్యం ఇప్పుడు పూర్తి నార్మల్‌గా ఉందంటూ నేహ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. వైద్య పరీక్షను మరోమారు నిర్వహించాలంటూ న్యాయస్థానం ఆదేశించడంతో ఇంకోసారి వినికిడి పరీక్ష నిర్వహించారు. చిత్రం ఏమిటంటే ఈసారి నేహ మునుపటి కంటే మెరుగ్గానే వింటోందని స్వయంగా ఆ వైద్యాధికారులే చెప్పారు. కానీ ఆ సామర్థ్యమూ సరిపోదంటూ మళ్లీ మెలిక పెట్టారు. అయితే వివిధ  హాస్పిటల్స్‌లో పలుమార్లు నిర్వహించిన వైద్య పరీక్షల్లోనూ ఆమె వినికిడి సామర్థ్యం నార్మల్‌గా ఉన్నట్లు ఫలితాలు వచ్చాయి.

అదే విషయాన్ని సంబంధిత అధికారులకు తెలుపుతూ... మునుపు వారే రెండు సార్లు నిర్వహించిన పరీక్షల్లో వచ్చిన తేడాను ఎత్తి చూపారు నేహ. వినికిడి పరీక్ష నిర్వహణలోనే తేడా ఉంది తప్ప తన వినికిడి సామర్థ్యంలో తేడా లేదని చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇలాంటి నిర్లిప్త వ్యవస్థ పట్ల నేహ మనసులో నిస్పృహ ఏర్పడితే అందుకు బాధ్యులెవరు? నేహ తల్లి శిరీష మాటల్లో నేహ ఆవేదన ఇది. ‘‘అది 2000 సంవత్సరం. అప్పుడు నేహకు ఏడేళ్లు. ఆ పసి వయసులో మెనింజైటిస్‌ అనే జ్వరం వచ్చింది. జ్వరం తగ్గిపోయినా అది పోతూ పోతూ నేహ వినికిడి శక్తిని పట్టుకెళ్లిపోయింది. అప్పట్లో నేహ ఏమీ వినలేదు. కళ్ల ముందు  క్లాసులో పాఠం జరుగుతున్నా ఏమీ అర్థం కాదు. ఏ వినికిడి ఉపకరణమూ ఆమెకు పనిచేయలేదు. దాంతో మా నెత్తి మీద కొండ విరిగిపడినట్టుగా అనిపించింది.

మనసు దిటవు చేసుకొని...  
నా భర్త వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌లో అసిస్టెంట్‌ ఇంజనీర్‌. నేను సాధారణ గృహిణిని. నా భర్త ఉద్యోగబాధ్యతల రీత్యా వైజాగ్‌లోనే ఉండాల్సి రావడం వల్ల నేహ కోసం నేను తొలిసారి గడప బయటకు అడుగు పెట్టాల్సి వచ్చింది.  బెంగుళూరు వెళితే అక్కడి డాక్టర్లు నేహను పరీక్షించి వినికిడి శక్తి పూర్తిగా పోయిందన్నారు. అయితే కాక్లియర్‌ ఇంప్లాంట్‌ అమర్చితే వినడం సాధ్యమేనని చెప్పారు. కాక్లియర్‌ ఇంప్లాంట్స్‌ అప్పుడప్పుడే విదేశాల నుంచి దేశంలోకి కొత్తగా వస్తున్న రోజులవి. వాటిని అమర్చే నైపుణ్యం హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్‌లో సీనియర్‌ ఈఎన్‌టీ వైద్యనిపుణులు డాక్టర్‌ ఈసీ వినయకుమార్‌కు ఉందని తెలిసి ఆయన దగ్గరకు వచ్చాం. 2003 డిసెంబరులో నేహకు శస్త్రచికిత్స చేసి కాక్లియర్‌ ఇంప్లాంట్‌ అమర్చారు. నేహ మళ్లీ వినగలిగేలా చేశారు.

నిరుత్సాహం నింపుతూ... వివక్షకు గురిచేస్తూ...
చికిత్సకు ముందు నేహకు 100 శాతం వినికిడి లేదు. చికిత్స తర్వాత 100 శాతం వినికిడి ఉంది. అయితే గొడవ గొడవగా ఉండే క్లాస్‌ రూమ్‌లలో అంత స్పష్టంగా వినగలిగేది కాదు.  క్లాసును పూర్తిగా నిశ్శబ్దంగా ఉంచడం నేహకు సాధ్యం కాదు కదా.  అందుకే తనకు తానే పాఠాలు చెప్పుకుంది. దానికి తోడు తోటి పిల్లల నుంచి ఎదురయ్యే వివక్ష. అవకరాన్ని భూతద్దంలో చూపిస్తూ నోటితో కాకుండా నొసటితో వెక్కిరింపులు. టెన్త్‌ పాసైన తర్వాత ఒక రోజు నేహ కెమిస్ట్రీ టీచర్‌ నన్ను పిలిపించారు. ‘ఇప్పటివరకు నేహ బాగానే చదివింది. కానీ ఇప్పుడామె పై క్లాసులకు వచ్చింది. ఇక నుంచి కెమిస్ట్రీ చాలా టఫ్‌గా ఉంటుంది. ఆమెను ఏ డెఫ్‌ స్కూల్‌కో పంపితే మంచిది కదా’ అంది. ఆ మాటల్లో నీ కూతురు చెవిటిది సుమా అనే ఎగతాళి ఉంది. తొలిసారి నేహ తన వినికిడి శక్తి కోల్పోయిందని తెలిసిన రోజున కూడా నేను అంత భోరున విలపించలేదు. టీచర్‌ ఆ మాట చెప్పి రోజు వెక్కెక్కి ఏడ్చి ఇంటికి వచ్చాను. ‘టీచర్‌ ఎందుకు పిలిచారు?’ అని అడిగింది నేహ. ఆమెకు ఇవన్నీ చెప్పకుండా ‘ఈ ఏడాది నుంచి కెమిస్ట్రీ బాగా కఠినంగా ఉంటుందట. బాగా చదవమని చెప్పడానికి పిలిపించార’ని అన్నాను. ఆ ఏడాది నేహ ఇంటర్‌లో కెమిస్ట్రీ, బయాలజీలో టాపర్‌గా నిలిచింది. ఆంధ్రా యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌ చేతుల మీదుగా ప్రత్యేకంగా ఒక అవార్డును అందుకుంది.

ప్లస్‌ టూ పూర్తి కావడాన్నే సివిల్స్‌ గడపగా భావిస్తూ...
ప్లస్‌ టూ పూర్తయ్యాక ఎలాగైనా సివిల్స్‌ సాధించాలనే నిర్ణయానికి వచ్చింది. అందుకు అనుగుణంగా ఎంబీబీఎస్‌ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సు కాకుండా బీఎస్సీని ఎంచుకుంది. డిగ్రీలో ఉన్నప్పుడే తనను తాను పరీక్షించుకునేందుకు ఇంటర్మీడియెట్‌ ప్రాతిపదికగా నిర్వహించే బ్యాంక్‌ క్లరికల్‌ ఎగ్జామ్స్‌ రాసింది. అలా 2012లో డిగ్రీ సెకండియర్‌లో ఉండగానే జాబ్‌ సంపాదించింది. జాబ్‌లో చేరి,‡ గ్యాడ్యుయేషన్‌ కోర్సును కొనసాగించింది. అయితే డ్యూటీలోని తీరిక సమయాల్లో తాను చదువుకుంటూ ఉండటాన్ని కొందరు మాటిమాటికీ అభ్యంతర పెట్టారు. దాంతో  ఏడాది తర్వాత ఉద్యోగం మానేసింది. 2013లో డిగ్రీ పూర్తయ్యింది.  వెంటనే సివిల్‌ సర్వీసెస్‌కు తొలి అటెంప్ట్‌ చేసింది. ఫ్రెషర్‌ అయినప్పటికీ ఇంటర్వ్యూ వరకు వచ్చింది. ఈ స్ఫూర్తితో 2014లో మళ్లీ సీరియస్‌గా సివిల్‌ సర్వీసెస్‌కు ప్రయత్నం చేసింది.   ఈసారి జనరల్‌ ర్యాంకు 1221. ఫిజికల్లీ హ్యాండీక్యాప్‌డ్‌ విభాగంలో మూడో ర్యాంకు. నిజానికి ఆ ర్యాంకుకు తనకు ఐఎఫ్‌ఎస్‌ వస్తుంది. అయితే విదేశాలకు వెళ్లే ఉద్దేశం లేని నేహ... ప్రాధాన్యక్రమంలో దాని తర్వాతిదైన ఐఆర్‌ఎస్‌ (ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌)ను కోరుకుంది.

ఈ దశ నుంచి అన్నీ సాకులూ... చిక్కులూ
యూపీఎస్‌సీలో విజయం సాధించిన ప్రతి ఒక్కరూ లాంఛనంగా మెడికల్‌ టెస్ట్‌కు అటెండ్‌ కావాలి. ఈ దశ నుంచి నేహకు అభ్యంతరాలు, అవరోధాలు, అడ్డంకులూ ఒకదాని తర్వాత మరొకటి ఎదురొచ్చి నిలిచాయి. వైద్యపరీక్షల కోసం ఢిల్లీలోని గురు తేజ్‌బహదూర్‌ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.  ఆ ఆసుపత్రిలో వినికిడిని నిర్ణయించే పరీక్షలు చేసే వసతులూ లేవు. ఉపకరణాలూ లేవు. దాంతో ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)కు వెళ్లి పరీక్షలు చేయించమని చెప్పారు.  కానీ అక్కడ  ఆరుబయట ఆమెకు వైద్య పరీక్ష నిర్వహించారు. అన్ని రకాల చప్పుళ్లతో ఉన్న అక్కడ నిర్వహించిన పరీక్షల్లో ఆమె 50 డెసిబుల్స్‌ పైబడిన శబ్దాలనే వినగలుగుతోందన్నారు. అప్పుడు నేహ వినికిడి సామర్థ్యాన్ని తెలుసుకునేందకు మళ్లీ మేం హైదరాబాద్‌ అపోలోలో, వైజాగ్‌లోని రాణి చంద్రమతి హాస్పిటల్‌లో వినికిడి పరీక్షలు చేయించాం. వాస్తవం ఏమిటో తెలుసా...? నేహ 25 – 30 డెసిబుల్స్‌ శబ్దాలను సైతం వినగలుగుతోంది. ఈ విషయాన్ని అధికారులకు తెలిపితే వారు ససేమిరా అన్నారు.

దాంతో మేం హైకోర్టును ఆశ్రయించాం. అక్కడ ఇలాంటి సర్వీస్‌ను పరిష్కరించే ‘సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌’ నేహ కేసు విన్నది. నేహకు మరోమారు వినికిడి పరీక్ష నిర్వహించి, నెలలోపు నియామకం ప్రక్రియను పూర్తి చేయాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. మళ్లీ కోర్టు డైరెక్షన్స్‌ మేరకు నేహను ఎయిమ్స్‌కు పంపారు. ఈసారి కూడా అలాగే బయట చిన్నపిల్లల ఏడుపులూ, రోగుల రణగొణధ్వనులూ, ఇతరత్రా చప్పుళ్లు ఉన్నచోట పరీక్ష నిర్వహించారు. ఈసారి 40 డెసిబుల్స్‌ పైబడిన శబ్దాలనే వినగలుగుతోందని నివేదిక ఇచ్చారు. నిబంధనల ప్రకారం 30 డెసిబుల్స్‌ వినగలిగితేనే ఉద్యోగం ఇస్తామన్నారు. ‘మీరు నిర్వహించిన పరీక్షలోనే మొదటిసారికీ, రెండోసారికీ 10 తగ్గింది కదా. మరోమారు ఆమెకు అనువైన వాతావరణంలో పరీక్ష చేయమ’ని కోరాను. కాళ్లావేళ్లాపడుతూ బతిమాలాను.  ప్రభుత్వ గెజిట్‌ ప్రకారం 30 డెసిబుల్స్‌ వింటేనే ఉద్యోగ నియామకం జరపగలమంటూ, నిబంధనలను సాకుగా చూపుతూ మళ్లీ ఆమెకు ఉద్యోగాన్ని నిరాకరించారు.

ఈ ప్రహసనాలను వివరిస్తూ మళ్లీ మేం ‘క్యాట్‌’ (సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌)ను ఆశ్రయించక తప్పలేదు. నేనొక సాధారణ గృహిణినే అయినా, మాకు తగిన వనరులు లేకపోయినా ఎంతో మంది పెద్దలు, శ్రేయోభిలాషుల సహాయంతో న్యాయపోరాటాన్ని కొనసాగిస్తున్నాం.
కొందరి మౌన మద్దతు ఉన్నా... ఏదో తెలియని వివక్ష...

ఎందుకోగానీ అక్కడి మెడికల్‌ బోర్డులో కొందరు నేహ పట్ల వివక్షతో ఉన్నారని అనిపిస్తోంది. ఎందుకంటే తొలుత నేహపై సానుభూతితో మాకు సలహాలూ, సూచనలు ఇచ్చిన ఎందరో ఆ తర్వాత చిత్రంగా నిశ్శబ్దం పాటిస్తున్నారు. మానవీయ కోణంలో ముందుగా నేహకు సహాయం చేద్దామని వచ్చిన చాలామంది ఆ తర్వాత నోరు విప్పడం లేదు.  ఒక అజ్ఞాత శ్రేయోభిలాషి ఫోన్‌ చేసి చెప్పిన మాట మాకెంతో మానసిక నిబ్బరాన్ని ఇచ్చింది. నైతిక స్థైర్యాన్ని పెంచింది. అదేమిటంటే...  విజేతగా నిలిచినా మా నేహలాగే వినికిడి శక్తి లేదనే సాకుతో మణిరామ్‌ శర్మ అనే అభ్యర్థిని మొదట కాదన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందోగానీ... ఇప్పుడు మణిరామ్‌ శర్మ రాజస్థాన్‌లోని మేవాడ్‌లో కలెక్టర్‌గా సేవలందిస్తున్నారు. ఇలాంటి అజ్ఞాత ఫోన్‌కాల్స్‌తో మాకు నైతికమద్దతు తెలిపేవారి నుంచి స్ఫూర్తి పొందుతూ మా పోరాటాన్ని కొనసాగిస్తున్నాం.

తాజా పరిస్థితి ఇదీ...
నేహకు తొలుత అమర్చిన ప్రోసెసర్‌ కంటే ఇప్పుడు మరింత మెరుగైన క్యాన్సో  ప్రోసెసర్‌ అందుబాటులోకి వచ్చాయి. వాటి సహాయంతో గత నాలుగైదు రోజుల క్రితం నిర్వహించిన ఆడియోమెట్రీ పరీక్షలో నేహ ఇప్పుడు 20 డెసిబుల్స్‌ను సైతం వినగలుగుతోంది. సరైన వాతావరణంలో పరీక్ష నిర్వహిస్తే... నేహ కూడా నార్మల్‌ వ్యక్తి లాగే వినగలదు. అందుకే ఈ న్యాయపోరాటంలో నేహ గెలవాలనీ, ఆమెకు న్యాయం జరగాలని ఆశీర్వదించండి. మీ నైతికమద్దతుతో పోరాటాన్ని కొనసాగిస్తాం. మా అమ్మాయికి మీ అందరి  ఆశీస్సులు కావాలి’’ అంటూ వేడుకుంటున్నారు నేహ తల్లి శిరీష.

వైఎస్‌ అప్పటి ప్రోత్సాహం...  ఇప్పటికీ నేహాకు నిత్య స్ఫూర్తి
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి నేహకు చేసిన సహాయం అంతా ఇంతా కాదు. నేహకు ఒక దశలో ప్రోసెసర్‌ మార్చాల్సి వచ్చింది. కొత్త ప్రోసెసర్‌కు లక్ష రూపాయలు కావాలి. మాకది చాలా పెద్ద మొత్తం. దాంతో ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లాం. చుట్టూ జనం... సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఆ సమూహంలో మా వంతు కోసం ఎదురుచూస్తూ మేమున్నాం. ఆయన మా దగ్గరికి వచ్చారు. మా అర్జీ విన్నారు. తాను తప్పక సహాయం చేస్తానన్నారు. నేహ భుజం మీద చెయ్యేసి ‘నువ్వు బాగా చదువుకో. భవిష్యత్తులోనూ నీకు కావాల్సిన సహాయం అందిస్తాన’ని అన్నారు. అన్నట్లుగానే ఆ సాయంత్రానికే రూ. లక్ష మంజూరు చేశారు. అప్పుడాయన నాకు తండ్రిలా కనిపించారు. ఆయన చనిపోయినప్పుడు రక్తసంబంధీకులు దూరమైనట్లు బాధపడ్డాను. అలాగే డాక్టర్‌ ఈసీ వినయకుమార్‌. ఏడేళ్ల పాప దగ్గర్నుంచి ఇప్పుడు నేహ ఇంతగా ఎదిగాక కూడా తన సొంత బిడ్డలా చేయూతనిస్తున్నారు.
– శిరీష, నేహ తల్లి

వినికిడి కోల్పోవడం అవకరం కాదు...
చిన్నప్పుడే పూర్తిగా వినికిడి కోల్పోయిన పిల్లలకు కాక్లియర్‌ శస్త్రచికిత్స చేస్తే వారు అందరిలాగే వినగలుగుతారు, మాటలూ వస్తాయి. అయితే ఎంత చిన్న వయసులో ఈ శస్త్రచికిత్స చేస్తే ఫలితాలు అంత మెరుగ్గా ఉంటాయి. అయితే వినికిడి కోల్పోవడం అన్నది వారి వికాసానికి ఏ మాత్రం ప్రతిబంధకం కాబోదు. వినికిడి లేకపోవడం వారికి ఎంతమాత్రమూ అవకరం కాబోదు. కాక్లియర్‌ అమర్చిన పిల్లలు నేహలాగా బాగా చదువుకొని ఏదైనా సాధించగలరు. వినికిడి లేని పిల్లలను అలాగే వదిలేసి వారిని వినకుండా, మాట్లాడకుండా... మూగచెవిటి వారిగా చేయడం సరికాదు. కాక్లియర్‌ ఇంప్లాంట్స్‌ అమర్చితే ఆ పిల్లలూ అందరిలాగే రాణిస్తారని చెప్పడానికి నేహ వృత్తాంతమే మంచి ఉదాహరణ. నేహలాగే ఎందరో పిల్లలు ఈ సమాజంలో ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు, సమాజం కూడా వారికి చేయూత ఇవ్వాలి. తగిన తోడ్పాటును అందించాలి.
– డాక్టర్‌ ఇ.సి. వినయ కుమార్, హెచ్‌ఓడి – ఈఎన్‌టి సర్జన్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్‌
– యాసీన్, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

 

>
మరిన్ని వార్తలు