విండోస్ ఎక్స్‌పీ కథ కంచికి!

2 Apr, 2014 23:25 IST|Sakshi
విండోస్ ఎక్స్‌పీ కథ కంచికి!

మీరు మీ పీసీలో విండోస్ ఎక్స్‌పీ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నారా?  వచ్చే వారం.. కచ్చితంగా చెప్పాలంటే ఏప్రిల్ 8వ తేదీ తరువాత మీరు మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటారా? మైక్రోసాఫ్ట్ కంపెనీ ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌కు ఇస్తున్న సపోర్ట్‌ను ఆ రోజు నుంచి నిలిపివేస్తోంది కాబట్టి. అయితే నాకేంటి? అనుకుంటూంటే...
 
ప్రపంచంలోని మొత్తం కంప్యూటర్లలో మూడొంతులు విండోస్ ఎక్స్‌పీని వాడుతున్నాయి. హ్యాకర్లు దీనిపై దాడులకు తెగబడకుండా ఉండేందుకు మైక్రోసాఫ్ట్ ఎప్పటికప్పుడు లోటుపాట్లను గుర్తించి సెక్యూరిటీ ప్యాచ్‌లను పంపిస్తూంటుంది. వచ్చే వారం నుంచి ఈ ప్యాచ్‌లు రావన్నమాట. విండోస్ ఎక్స్‌పీతోపాటు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2003కి సంబంధించిన అప్‌డేట్స్ కూడా అందవు.  

దీంతో ఏ క్షణంలోనైనా హ్యాకర్లు ఎక్స్‌పీపై దాడులు చేయవచ్చునన్నమాట. వీటి వల్ల వ్యక్తిగతంగా పెద్దగా నష్టం ఉండకపోవచ్చుగానీ... దేశంలోని దాదాపు లక్ష ఏటీఎంల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. వీటిల్లో ఎక్కువశాతం ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌నే వాడుతున్నారు.

అయితే కొన్ని బ్యాంకింగ్ సంస్థలు తమదైన సపోర్టింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఈ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నాయి. తమిళనాడు ప్రభుత్వం ఎక్స్‌పీ స్థానంలో లీనక్స్ ఆధారిత ‘భారత్ ఆపరేటింగ్ సిస్టమ్ సొల్యూషన్స్’ (బాస్)ను వాడేందుకు సిద్ధమవుతోంది.  వ్యక్తిగత వినియోగదారులు వీలైతే విండోస్ 7 లేదా 8కు మారిపోవడం మేలు అన్నది నిపుణుల సూచన.
 

>
మరిన్ని వార్తలు