ఈ భావోద్వేగం బుద్బుద ప్రాయమేనా?

17 May, 2020 01:16 IST|Sakshi

సందర్భం

అదృశ్య వినాశినితో పోరాడుతున్న తరుణంలో నిగూఢ సత్యాలు కొన్ని మానవ సమాజానికి స్ఫటిక సదృశ్యంగా దర్శనమిస్తున్నాయి. అటు సమాజం, ఇటు ప్రభుత్వం కరోనానంతరం కచ్చితంగా దృష్టి పెట్టి తీరాల్సిన అంశాల్లో అవిప్పుడు చేరిపోయాయి. కరోనా వైరస్‌కు కొద్ది నెలల్లోనే వ్యాక్సినో, మెడిసినో ఏదో ఓ విరుగుడు మందు వచ్చి తీరుతుంది. అవేవీ రాకున్నా సరే, అనేక రుగ్మతలతో సహజీవనం చేస్తున్నట్టే కరోనాతో కలిసి బతికే జీవనశైలి అయినా అలవడుతుంది. కానీ కరోనా నేపథ్యంలో ఎంతో గంభీ రంగా కనిపిస్తున్న అనిర్వచనీయమైన భావోద్వేగం తర్వాత ఏమైతది? ఇప్పుడు కనిపిస్తున్న పరివర్తన భవిష్యత్తు ఏమిటి? ఇదంతా నీటి బుడగలా మాయమవుతుందా? విత్తుల్లా వికసిస్తుందా? 

అసంఖ్యాక మరణాల తర్వాత లభించిన విజయం అశోకుడికి యుద్ధం అంటే విరక్తి వచ్చేలా చేసింది. ఇప్పుడీ ఇలాతలంలో అంతటి బౌద్ధ బుద్ధు లెవరైనా ఉన్నారా? యుద్ధం అవసరం మారిపోయింది. సరిహద్దులు కాపాడుకోవడానికి కాదు, మన జనాల్ని మన హద్దులో పెట్టుకోవడానికి యుద్ధం. యుద్ధమంటే రెండు శత్రుదేశాల మధ్య ఆయుధ, సాయుధ ఘర్షణ జరగడమే కాదు. అసమర్థతలను, వైఫల్యాలను కప్పిపుచ్చగలిగి, జనాల్ని దేశభక్తి అనే ఓ మైకంలోకి నెట్టగల గొప్ప సాధనం. 

అందుకే కరోనా వ్యాప్తి నివారణ ప్రయత్నాలను యుద్ధంతో పోల్చడమే భయం కలిగిస్తున్నది. కరోనా చైనా తయారీయే అని ట్రంప్‌ చేస్తున్న ఎడతెరపి లేని ప్రచారం వెనుక, రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం ఉందనే విశ్లేషణలు ఆశ్చర్యం కలిగించడం లేదు. భారతదేశంలో కూడా కరోనాపై యుద్ధం చేస్తున్నట్లు ప్రకటించిన వారు బలిపశువుగా మారాల్సిన శత్రువును సృష్టించేసినట్టే ఉంది. యుద్ధ సమయంలో ఎగిసిపడిన భావోద్వేగాన్ని రాజకీయ ప్రయోజనాలకు మరల్చుకోవడం మన రాజకీయ వ్యవస్థకు వెన్నతో పెట్టిన విద్య. 1962 చైనా యుద్ధం, 1965, 1971 పాకిస్తాన్‌ యుద్ధం, 1999 కార్గిల్‌ యుద్ధం, 2019 సర్జికల్‌ స్ట్రైక్స్‌ తదనంతర పరణామాలను నెమరు వేసుకుంటే భవిష్యత్‌ బోధపడడం కష్టమేమీ కాదు. 

కరోనాపై యుద్ధానంతరం వెనక్కితిరిగి చూసుకోవాల్సింది భుజకీర్తులను కాదు. పండుటాకుల్లా రాలిపోయిన పేద జీవితాలను, ఎండుటాకుల్లా ఎగి రిపోతున్న వలస బతుకులను పట్టించుకోవడం. కరోనా యుద్ధంలో క్షతగాత్రులెవరు? పాస్‌పోర్టు మోసుకొచ్చిన రోగం తెల్లరేషన్‌ కార్డుదారులను హింస పెట్టింది కదా? వలస కార్మికులను బలిపీఠం ఎక్కించింది కదా? దేశం దృష్టిని ఇప్పటి వరకు ఆకర్షించని వలస కూలీల బతుకు చిత్రం లాక్‌డౌన్‌ పుణ్యమా అని బయటపడింది. డాలర్ల జీతం, డాబుసరి జీవితం కోసం ఇతర రాష్ట్రాలకో, ఇతర దేశాలకో వెళ్లడం గౌరవం, వారి జీవితాలూ ధన్యం. కానీ కేవలం పొట్ట నింపుకోవడానికి అయిన వారందరినీ వదిలి, ఇంకో ప్రాంతానికి బతకడానికి పోవా ల్సిరావడం ఘోరం, వారి జీవితాలు దైన్యం. 

వలస కూలీలంటే ఒకప్పుడు పాలమూరు గుర్తుకొచ్చేది. కానీ దేశమే వేల పాలమూరుల సమూహం అని తేలడం 225 లక్షల కోట్ల సంపద (జీడీపీ) కలిగి బలమైన ఆర్థిక వ్యవస్థగా చెప్పుకుంటున్న దేశానికి గర్వకారణం కాదు.  సొంతూ ళ్లకు వెళ్లడానికి వారు పడే బాధలు, వందల కిలోమీటర్ల కాలినడకలు, మార్గమధ్యలోనే చావులు, అవి మిగిల్చిన విషాదాలు వర్ణనాతీతం. బతుకు జీవుడా అనుకుంటూ సొంతూళ్ళకు పోయినవారు మళ్లీ ధైర్యంగా పనికి వస్తారా? వారికి సమాజం, ప్రభుత్వం ధైర్యం ఇవ్వగలవా? దారిలోనే కన్నుమూసిన వారి కుటుంబాలకు ఎవరు ఆసరాగా నిలబడాలి?


ఇప్పుడు ఆ వలస కార్మికుల గురించి ఆలోచన చేయాలి. విదేశాల్లో ఉండే భారతీయుల (ఎన్నారై) సంక్షేమం కోసం ప్రత్యేక పాలసీలు, కార్యక్రమాలు, బడ్జెట్‌ నిధులున్నాయి. వలస కార్మికుల కోసం అలాంటి చర్యలు ప్రారంభం కావాలి. కష్ట కాలంలో వారిని ఆదుకోవడానికి ఓ విధానం రావాలి. అదృష్టవశాత్తూ కరోనా వైరస్‌ మనకు చాలా మేలు చేసింది. మన దేశంలో చాలా ఆలస్యంగా ప్రవేశించింది. చాలా నిదానంగా విస్తరించింది. వైద్యరంగంలో కొంతయినా సమకూర్చుకోవడానికి కావాల్సినంత వ్యవధి ఇచ్చింది.

కొద్దో గొప్పో వైద్య సదుపాయాలు కలిగిన పట్టణ ప్రాంతాలకే పరిమితమయింది. కనీసం మందుగోలి దొరకని మారుమూలకు పాకలేదు. లేకుంటే ఏమయ్యేది అని తలుచుకుంటే భయంకర దృశ్యాలే కదలాడతాయి. ఒక్కసారే లక్షల కేసులు నమోదైతే ఎట్ల? మనం సిద్ధంగా ఉన్నామా? అని వెనక్కి తిరిగి చూసుకుంటే అంతా అగాధమే. దేశంలో వైద్య సదుపాయాలు అత్యంత అధ్వానంగా ఉన్నాయనే విషయం కరోనా నేపథ్యంలో మరోసారి తెలిసి వచ్చింది. ఈ గుణపాఠంతో అయినా మనం వైద్య రంగానికి ప్రాధాన్యత ఇస్తే, కరోనా మనకు మేలు చేసినట్లే.

కరోనాకు మందో మాకో కనిపెట్టక పోతారా అని జనం రీసెర్చి ల్యాబొరేటరీల వైపు ఆశగా చూస్తున్నారు. పారిశుధ్య కార్మికులు, ఆరోగ్య కార్యకర్తలు, పోలీసు కానిస్టేబుళ్లు, ఇతర పనివారు దేవుళ్లలాగా కనిపిస్తున్నారు. సొంతూరు పోవడానికి పర్మిషన్‌ ఇచ్చే పోలీస్‌ స్టేషన్లు, రోగాన్ని నయం చేసే దవాఖానాలే దేవాలయాలయ్యాయి. మనుషుల్లోనే గొప్పతనాన్ని, శాస్త్రీయతతోనే పరిష్కారాన్ని చూడగలిగే వాస్తవిక దృక్పథం స్థిరపడితే పాడురోగం కొంత మేలు చేసినట్లే. 

ఇప్పుడు దేశంలో గతంలో ఎన్నడూ చూడని రాజకీయ ఐకమత్యం బయటకు కనిపిస్తున్నది. దేశ ప్రధానమంత్రే ఏకంగా ఐదుసార్లు అందరు ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. ఐక్యంగా ముందుకుపోదాం అని ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్నారు. దేశం మొత్తంపై ప్రభావం చూపే అంశం కాబట్టి, అంతా ఒక్కతాటిపైన నిలవడం మంచిదే. కానీ, ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే, గతంలో దేశానికి సంబంధించిన అంశాలపై ఇలాంటి స్ఫూర్తి ప్రదర్శించలేదు. అందరినీ కలుపుకుపోవాలని అనుకోలేదు. కనీసం కరోనా నేర్పిన పాఠంతో అయినా ఫెడరల్‌ వ్యవస్థ బతికితే చాలు. దేశ ప్రజలందరిపై ప్రభావం చూపే అంశాల్లో ఈ సంప్రదింపులు, ఐక్యతారాగాలు కొనసాగితే సమాఖ్య స్ఫూర్తి మరికొంత కాలం నిలబడుతుంది. 
వ్యాసకర్త: గటిక విజయ్‌కుమార్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యక్తిగత ప్రజా సంబంధాల అధికారి

ఈ–మెయిల్‌: Vijaynekkonda@gmail.com

మరిన్ని వార్తలు